రూ. 2.25 లక్షలకు గణేశుడి లడ్డూ కైవసం
భక్తిశ్రద్ధలతో దక్కించుకున్న పెద్దింటి శశికళ–మాధవరెడ్డి కుటుంబం
అమీన్పూర్, సెప్టెంబర్ 28:(మెదక్ టుడే) న్యూస్ ప్రతినిధి.సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని బీరంగూడ డివిజన్ ఇక్రిసాట్ కాలనీలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు సోమవారం అత్యంత వైభవంగా ముగిశాయి. గత 15 సంవత్సరాలుగా కాలనీవాసులు, ఉత్సవ కమిటీ సభ్యుల సంయుక్త ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. నవరాత్రుల ముగింపు సందర్భంగా కాలనీలో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించిన అనంతరం స్వామివారి శోభాయాత్రను కనులపండువగా ప్రారంభించి, గంగమ్మ ఒడికి చేర్చి నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేశారు.లడ్డూ వేలంపాటలో పెరిగిన పోటీ:నిమజ్జన శోభాయాత్రకు ముందు నిర్వహించిన గణనాథుడి మహా ప్రసాదం (లడ్డూ) వేలంపాట భక్తుల ఉత్సాహం మధ్య హోరాహోరీగా సాగింది. ఈ వేలంలో ఇక్రిసాట్ కాలనీకి చెందిన పెద్దింటి శశికళ–మాధవరెడ్డి, వారి కుమారులు కార్తీక్ రెడ్డి, దీపక్ రెడ్డి కుటుంబ సభ్యులు గరిష్టంగా రూ. 2,25,000 పలికి స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని దక్కించుకున్నారు.ఈ సందర్భంగా లడ్డూను దక్కించుకున్న పెద్దింటి మాధవరెడ్డి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ… “వినాయకుడి ఆశీస్సులతో లడ్డూ ప్రసాదం దక్కడం మా కుటుంబానికి ఎనలేని సంతోషాన్ని, మానసిక తృప్తిని ఇచ్చింది. లడ్డూ ప్రసాదం స్వీకరించినప్పటి నుంచి మా కుటుంబానికి అంతా మంచి జరుగుతోందని, అన్నింటా కలిసి వస్తోందనే ప్రగాఢ విశ్వాసంతోనే ఈసారి కూడా భక్తితో వేలంలో పాల్గొని దక్కించుకున్నాం. కాలనీ ప్రజలందరిపై ఆ విఘ్నేశ్వరుడి కరుణాకటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం” అని తెలిపారు.అనంతరం ఉత్సవ కమిటీ సభ్యులు లడ్డూ దక్కించుకున్న కుటుంబ సభ్యులను శాలువాలతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. డప్పు వాయిద్యాలు, యువత నృత్యాలు, భక్తుల జయజయధ్వానాల మధ్య గణనాథుడి నిమజ్జన శోభాయాత్ర శాంతియుతంగా, కోలాహలంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ ప్రతినిధులు, కాలనీ పెద్దలు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


