వందనపురి కాలనీలో ఘనంగా గణనాథుడి శోభాయాత్ర
• రూ.1,15,000కు లడ్డూ సొంతం చేసుకున్న రాధాబాయి–రామనాథం దంపతులు
• ముఖ్య అతిథిగా హాజరైన మాజీ వైస్ చైర్మన్ నందారం నరసింహ గౌడ్
అమీన్పూర్, సెప్టెంబర్ 25,(మెదక్ టుడే) న్యూస్ ప్రతినిధి.సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని బీరంగూడ వందనపురి కాలనీలో గత 15 సంవత్సరాలుగా కొనసాగుతున్న సంప్రదాయం ప్రకారం, ఈ ఏడాది కూడా వినాయక నవరాత్రి ఉత్సవాలను కాలనీవాసులు, ఉత్సవ కమిటీ సభ్యులు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా 11వ రోజు గణనాథుడి మహా శోభాయాత్రను అంగరంగ వైభవంగా చేపట్టారు.నిమజ్జనోత్సవంలో భాగంగా నిర్వహించిన లడ్డూ, వెండి నాణేల వేలంపాట భక్తుల ఉత్సాహం నడుమ పోటాపోటీగా సాగింది. ఇందులో కాలనీకి చెందిన శ్రీమతి, శ్రీ రాధాబాయి–రామనాథం దంపతులు గణేషుడి మహా లడ్డూను రూ. 1,15,000 కు వేలంలో దక్కించుకున్నారు. ఈ కార్యక్రమానికి అమీన్పూర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నందారం నరసింహాగౌడ్ ముఖ్య అతిథిగా విచ్చేసి, లడ్డూ దక్కించుకున్న దంపతులతో పాటు వెండి నాణేలు గెలుచుకున్న భక్తులకు స్వహస్తాలతో వాటిని అందజేశారు. ఈ సందర్భంగా కాలనీవాసులు, ఉత్సవ కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ.. 11 రోజుల పాటు నిష్ఠతో పూజలందుకున్న గణనాథుడి ఆశీస్సులు లడ్డూ, వెండి నాణేలు దక్కించుకున్న వారందరిపై ఉండాలని ఆకాంక్షించారు. కాలనీలో ఎలాంటి సమస్యలు ఎదురైనా ఎల్లప్పుడూ అండగా ఉంటూ ముందుండి నడిపిస్తున్న మాజీ వైస్ చైర్మన్ నందారం నరసింహాగౌడ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వందనపురి కాలనీవాసులంతా ఒక్కతాటిపై ఉంటూ ప్రతి వేడుకను విజయవంతం చేస్తారని పేర్కొన్నారు. చిన్నారుల ఆటపాటలు, మహిళల కోలాటాలు, భక్తుల నృత్యాల నడుమ శోభాయాత్ర ఆద్యంతం కోలాహలంగా సాగింది. స్థానిక అభయ కోదండరామ స్వామి కృపతో, విఘ్నేశ్వరుని అనుగ్రహంతో ప్రజలంతా సుఖశాంతులతో వర్ధిల్లాలని, వచ్చే ఏడాది కూడా ఉత్సవాలను ఇంతే ఘనంగా నిర్వహిస్తామని కాలనీవాసులు స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో కాలనీ ప్రతినిధులు, ఉత్సవ కమిటీ సభ్యులు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


