📄 ePaper
Thursday, June 4, 2026
ADS
HomeTS- vyavasayam.ఎరువుల విక్రయాల్లో అక్రమాలకు చెక్.

ఎరువుల విక్రయాల్లో అక్రమాలకు చెక్.

📰 Generate e-Paper Clip

-ఖరీఫ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు

-లింకింగ్ విక్రయాలకు నో

-అధిక ధరలపై కఠిన చర్యలు

    హైదరాబాద్,జూన్,2,(మెదక్ టుడే న్యూస్)డిజైనర్ టెక్ గురు ప్రతినిధి): ఖరీఫ్ సీజన్‌లో రైతులకు అవసరమైన ఎరువులు సకాలంలో అందుబాటులో ఉండేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని వ్యవసాయ సంచాలకులు డాక్టర్ బి. గోపీ అధికారులను ఆదేశించారు. వ్యవసాయ కమిషనరేట్ కార్యాలయంలో ఎరువుల డీలర్ల సంఘం ప్రతినిధులు, హోల్‌సేల్ డీలర్లు, ఎరువుల తయారీ సంస్థల ప్రతినిధులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన పలు కీలక సూచనలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఖరీఫ్ సీజన్‌కు అవసరమైన ఎరువుల నిల్వలను నిరంతరం పర్యవేక్షిస్తూ రైతులకు ఎలాంటి కొరత తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాల వారీగా నిల్వల పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ సరఫరా వ్యవస్థను బలోపేతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రైతులు సాగు పనులు ప్రారంభించే సమయంలో ఎరువుల కొరత కారణంగా ఇబ్బందులు ఎదుర్కోకుండా ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలని పేర్కొన్నారు.
    ఎరువుల విక్రయాల సమయంలో పురుగుమందులు, సూక్ష్మపోషకాలు లేదా ఇతర వ్యవసాయ ఉత్పత్తులను బలవంతంగా కొనుగోలు చేయించే లింకింగ్ విధానాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని స్పష్టం చేశారు. రైతులు కోరిన ఎరువులను మాత్రమే విక్రయించాలని, అదనపు ఉత్పత్తులను కొనుగోలు చేయాలని ఒత్తిడి చేయరాదని హెచ్చరించారు. ఈ విషయంలో ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా వెంటనే విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. గరిష్ట చిల్లర ధర కంటే అధిక ధరలకు ఎరువులు విక్రయించినట్లు గుర్తిస్తే సంబంధిత డీలర్లు, విక్రేతలపై ఎరువుల నియంత్రణ ఉత్తర్వులు–1985 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని వ్యవసాయ సంచాలకులు హెచ్చరించారు. రైతుల నుంచి వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని, జిల్లా స్థాయిలో తనిఖీలు మరింత ముమ్మరం చేయాలని అధికారులకు సూచించారు.
    రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఎరువుల సరఫరా, నిల్వలు, పంపిణీ వ్యవస్థలో ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని ఆయన స్పష్టం చేశారు. రైతులకు అవసరమైన ఎరువులు సకాలంలో అందుబాటులో ఉండేలా వ్యవసాయ శాఖ, సహకార శాఖ, ఎరువుల సంస్థలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో సహకార శాఖ ప్రత్యేక సంచాలకులు రాహుల్ రాజ్, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు, ఎరువుల తయారీ సంస్థల ప్రతినిధులు, డీలర్ల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఖరీఫ్ సీజన్‌లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగాలని సమావేశంలో నిర్ణయించారు.

    RELATED ARTICLES
    - Advertisment -ADS

    Most Popular