తెలంగాణ అభివృద్ధి పథంలో సాగాలి ఉప సర్పంచ్ మహమ్మద్ రఫీ
దివంగత వార్డ్ మెంబర్ సాయిబాబాకు పాలకవర్గం శ్రద్ధాంజలి
చేగుంట,జూన్,2,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మంగళవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ సండ్రుగు స్రవంతి సతీష్ జాతీయ జెండాను ఆవిష్కరించి, అమరవీరుల త్యాగాల ఫలంగా సిద్ధించిన స్వరాష్ట్ర ప్రజలందరికీ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.తెలంగాణ సంస్కృతికి ప్రతీకలైన బతుకమ్మ, బోనాలు వంటి పండుగలను మనం ఘనంగా జరుపుకుంటున్నామని, భవిష్యత్తులో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో విలసిల్లాలని ఆమె ఆకాంక్షించారు. అనంతరం ఉపసర్పంచ్ మొహమ్మద్ రఫీ మాట్లాడుతూ సమైక్యాంధ్రా పాలనలో కరెంట్, సాగునీరు లేక అల్లాడిన తెలంగాణ, కేసీఆర్ ఉద్యమ పోరాటంతో మనకు రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియమ్మ చొరవతో నేడు 24 గంటల విద్యుత్, పుష్కలమైన నీటితో ప్రగతి పథంలో దూసుకుపోతుందన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రం అప్పుల ముప్పు నుండి తప్పించుకుని, నిరుద్యోగులకు మరిన్ని ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ లాభదాయకమైన తెలంగాణగా రూపాంతరం చెందాలని ఆయన ఆకాంక్షించారు.ఈ వేడుకల మధ్యలోనే, ఇటీవల అనారోగ్యంతో అకాల మరణం చెందిన రెండవ వార్డు మెంబర్ సాయిబాబాకు చేగుంట పాలకవర్గం, సిబ్బంది కలిసి రెండు నిమిషాల పాటు నిశ్శబ్దంగా మౌనం పాటించి ఘన నివాళులు అర్పించారు. ఎందరో పోరాట వీరుల త్యాగాలను స్మరిస్తూ సాగిన ఈ ఉత్సవ మరియు శ్రద్ధాంజలి కార్యక్రమంలో చేగుంట పంచాయతీ కార్యదర్శి వెంకటేష్, సిబ్బంది లింగం, సత్యనారాయణ, సాదుల్లా, శ్రీనివాస్, వివిధ వార్డుల సభ్యులు పాల్గొన్నారు.

