పాపన్నపేట,జూలై,25,(మెదక్ టుడే న్యూస్)మెదక్ జిల్లా విద్యాశాఖ అధికారి రాజు శనివారం ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వన దుర్గ భవాని మాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు, ఆయన జిల్లా విద్యాశాఖ అధికారిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం మొట్టమొదటిసారిగా అమ్మవారిని దర్శించుకున్నారు, ఈ సందర్భంగా ఆలయ పండితులు శంకర శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు, డిఇఓ రాజుకు వేద పండితులు ఏడుపాయల ఆలయ ప్రశస్తిని వివరించారు. ఆయన వెంటఅక్షయ పాత్ర మెదక్ ప్లాంట్ మేనేజర్ త్రిపాఠి ,పవన్ కుమార్, రాకేష్ కుమార్ ,భట్టు నాగరాజు, వికాస్ రాజు, బత్తిని రాజు తదితరులు పాల్గొన్నారు.
ఉపాధి హామీ కార్యాలయంలో ఉద్యోగుల ఇష్టారాజ్యం..?సెల్‌ఫోన్లలో మునిగితేలుతున్న సిబ్బంది..
ప్రజల ప్రశ్నలకు సమాధానమే లేదు..!
పాపన్నపేట ఎన్‌ఆర్‌ఈజీఎస్ కార్యాలయ పనితీరుపై తీవ్ర విమర్శలు..
పాపన్నపేట,జూలై 24 (మెదక్ టుడే న్యూస్):పాపన్నపేట మండల కేంద్రంలోని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎన్‌ఆర్‌ఈజీఎస్) కార్యాలయంలో ఉద్యోగుల నిర్లక్ష్య వైఖరి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోందనే ఆరోపణలువెల్లువెత్తుతున్నాయి.కార్యాలయానికి వచ్చే ప్రజలను పట్టించుకోకుండా కొందరు ఉద్యోగులు సెల్‌ఫోన్లలో వీడియోలు చూస్తూ కాలక్షేపం చేస్తున్నారని మండలంలోని పలు గ్రామాలకు చెందిన ప్రజాప్రతినిధులు, ఉపాధి హామీ కూలీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.శుక్రవారం మధ్యాహ్నం 1:20 గంటలకు కార్యాలయాన్ని సందర్శించిన విలేకరులకు కూడా ఇదే పరిస్థితి కనిపించింది.తమ సమస్యల పరిష్కారం కోసం వచ్చిన కూలీలకు సరైన సమాచారం ఇవ్వకుండా, ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు చెప్పకుండా సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు ప్రత్యక్షంగా గమనించారు.ప్రజలకు సేవలు అందించాల్సిన ప్రభుత్వ కార్యాలయంలోసిబ్బంది,బాధ్యతారాహిత్యంగావ్యవహరిస్తుండటంతో ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి తీరుతో ప్రభుత్వ ప్రతిష్ఠ దెబ్బతింటోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.ఈ విషయమై స్పందన కోసం పాపన్నపేట మండల ఏపీఓ బి. మైపాల్ రెడ్డిని ఫోన్ ద్వారా సంప్రదించేందుకు విలేకరులు పలుమార్లు ప్రయత్నించినప్పటికీ ఆయన స్పందించలేదు.ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఉపాధి హామీ కార్యాలయ పనితీరుపై విచారణ జరిపి, ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న ఉద్యోగులపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
రోడ్డు ప్రమాద బాధిత కుటుంబానికి పద్మశాలి సంఘం.11 వేల ఆర్థిక సాయం.
పాపన్నపేట,జూలై,23,(మెదక్ టుడే న్యూస్:(ప్రతినిధి)ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పాపన్నపేటకు చెందిన మరెల్లి రాములు కుటుంబానికి స్థానిక పద్మశాలి సంఘం సభ్యులు మానవత్వాన్ని చాటుతూ రూ.11,000 ఆర్థిక సహాయం అందజేశారు.మరెల్లి రాములు కుటుంబ ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉండటంతో, పద్మశాలి సంఘం సభ్యులు స్వచ్ఛందంగా విరాళాలు సేకరించి గురువారం ఆయన కుటుంబ సభ్యులకు నగదు అందజేశారు.ఈ సందర్భంగా రాములు కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, కష్టకాలంలో అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని సంఘం నాయకులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పాపన్నపేట చేనేత సంఘం అధ్యక్షుడు కొడుపాక విఠల్, మాజీ అధ్యక్షుడు పడిగే కృష్ణ, పల్లె సంగమేశ్వర్, కొడుపాక శివశంకర్, తూర్పు రాజు,తూర్పు రాజారాం, కొడుపాక దుర్గేశ్వర్, వళ్ళందేశి శ్రీనివాస్,తూర్పు రమేష్, పోల్ శ్రీనివాస్, వళ్ళందేశి ఉదయ్, కళ్లేటి వెంకట్, అచుకట్ల మహేష్, కొడుపాక పూర్ణచందర్, రాజారాం చంద్రం, మదనాల అరవింద్, చామంతుల నాగరాజు, వళ్ళందేశి రాజు, కొడుపాక ప్రసాద్, ఊరటి లక్ష్మి, కొడుపాక ఉమామహేశ్వర, కొడుపాక వెంకటేశం, కొడుపాక యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇన్‌చార్జి నీలం మధు ముదిరాజ్‌ను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శాపురం నరసింహారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.
పటాన్ చెరు,జులై,23,మెదక్ టుడే న్యూస్:(ప్రతినిధి)కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శాపురం నరసింహారెడ్డి, మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇన్‌చార్జి నీలం మధు ముదిరాజ్ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి, శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ముత్తంగి విభాగం పరిధిలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం, పార్టీ కార్యక్రమాలు, ప్రజల సమస్యలు మరియు భవిష్యత్ కార్యాచరణపై ఇరువురు విస్తృతంగా చర్చించారు. అలాగే, ముత్తంగి విభాగంలో శాపురం నరసింహారెడ్డి చేపడుతున్న ప్రజాసేవా కార్యక్రమాల గురించి వివరించారు. ముఖ్యంగా, పారిశుద్ధ్య కార్మికుల సన్మానం, ప్రత్యేక పనుల పర్యవేక్షణ, ప్రజలతో ప్రత్యక్ష సమావేశాలు, సామాజిక సేవా కార్యక్రమాలు మరియు కాంగ్రెస్ పార్టీ సంస్థాగత బలోపేతం కోసం తీసుకుంటున్న చర్యలను నీలం మధు ముదిరాజ్‌కు తెలియజేశారు.
శాపురం నరసింహారెడ్డి చేస్తున్న సేవా కార్యక్రమాలను నీలం మధు ముదిరాజ్ అభినందించారు. ఇదే సేవా స్ఫూర్తితో ఎల్లప్పుడూ ప్రజల్లో ఉండాలని, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను గ్రామస్థాయిలో మరింత బలోపేతం చేయాలని ఆయనకు సూచించారు.
ముత్తంగి డివిజన్ కర్దనూర్ గ్రామంలో ప్రజలతో ముఖాముఖి: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శాపురం నరసింహారెడ్డి.
పటాన్‌చెరు,జూలై,23,మెదక్ టుడే న్యూస్:(ప్రతినిధి)సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం పరిధిలోని ముత్తంగి డివిజన్ పరిధిలోని కర్దనూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శాపురం నరసింహారెడ్డి గ్రామ ప్రజలతో ప్రత్యేక ముఖాముఖి సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఓటరు జాబితా సవరణ ప్రత్యేక కార్యక్రమం గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఓటరు జాబితాలో ప్రతి అర్హులైన వ్యక్తి పేరు సక్రమంగా నమోదై ఉండేలా తగు సూచనలు చేశారు. ఓటరు నమోదుకు కావలసిన ధృవపత్రాలు, దరఖాస్తు చేసుకునే విధానం మరియు ఓటు హక్కు యొక్క ప్రాముఖ్యతను వివరించారు.అనంతరం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులు మరియు ప్రజలకు అందిస్తున్న వివిధ పథకాలపై చర్చించారు. గ్రామ ప్రజల సమస్యలను ఓపికగా విని, వాటి పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలుస్తుందని భరోసా కల్పించారు.ఈ సందర్భంగా శాపురం నరసింహారెడ్డి మాట్లాడుతూ, “ప్రజలతో నిరంతరం మమేకమై వారి సమస్యలను తెలుసుకుంటూ, అభివృద్ధి మరియు సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ప్రతి గ్రామంలో ప్రజల భాగస్వామ్యంతో పార్టీని మరింత బలోపేతం చేస్తాం” అని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు మరియు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో ముగిసిన గుప్త నవరాత్రి ఉత్సవాలు.
అమీన్ పూర్,జూలై,23,
మెదక్ టుడే న్యూస్:(ప్రతినిధి)
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బీరంగూడ గుట్టపై వెలసిన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో గుప్త నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా ముగిశాయి. ఉత్సవాల్లో చివరి రోజైన గురువారం అమ్మవారు ప్రత్యేకంగా శాకంబరీ దేవి అవతారంలో భక్తులకు అలంకార దర్శనమిచ్చారు.ఈ పవిత్ర సందర్భాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు, అర్చనలు, విశేష అలంకరణ కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈఓ) దేవనాదం, ఆలయ కమిటీ చైర్మన్ సుధాకర్ యాదవ్ ఆధ్వర్యంలో ఈ నవరాత్రి వేడుకలు కన్నులపండువగా సాగాయి. తొమ్మిది రోజులపాటు ఆలయానికివిచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు వారు తెలిపారు. అమ్మవారి కృపాకటాక్షాలు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు పేర్కొన్నారు.అమ్మవారి దర్శనానికి మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, అధికారులు, అర్చకులు మరియు భక్తులు పాల్గొన్నారు.
నేడు వరుణ యాగం:
దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు, వర్షాలు సమృద్ధిగా కురిసి లోకం సుభిక్షంగా ఉండాలనే సంకల్పంతో ఈరోజు ఉదయం ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా వరుణ యాగం నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి దేవనాదం వెల్లడించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ యాగంలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు.

ప్రజా సమస్యల పరిష్కారమే నా ప్రథమ ప్రాధాన్యత: అమీన్ పూర్ కాంగ్రెస్ అధ్యక్షులు శశిధర్ రెడ్డి.
అమీన్ పూర్,జూలై,23,(మెదక్ టుడే న్యూస్ (ప్రతినిధి)
బీరంగూడ డివిజన్ పరిధిలోని కాలనీల్లో నెలకొన్న ప్రజా సమస్యల పరిష్కారానికి తాను ఎల్లప్పుడూ ముందుండి కృషి చేస్తానని అమీన్పూర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు శశిధర్ రెడ్డి స్పష్టం చేశారు. స్థానిక నల్లూరి హైట్స్ కాలనీలో తన సొంత నిధులతో సుమారు 210 మీటర్ల మేర నూతన సీసీ రహదారి నిర్మాణ పనులను చేపట్టిన సందర్భంగా ఆయన ఈ మేరకు మాట్లాడారు.
ప్రజలకు అత్యంత ఆవశ్యకమైన మౌలిక సదుపాయాల కల్పనలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడేది లేదని ఆయన తేల్చిచెప్పారు. కాలనీల సమగ్ర అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తానని, ప్రజా సమస్యలపై వెంటనే స్పందిస్తూ వాటి పరిష్కారం కోసం సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతానని హామీనిచ్చారు.ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ, వారి కష్టాలను తొలగించడమే తన ప్రధాన లక్ష్యమని శశిధర్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజల సహకారంతో బీరంగూడ డివిజన్‌ను అన్ని రంగాల్లోనూ మరింత అభివృద్ధి చేసేందుకు భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని ఆయన వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు చుక్క రెడ్డి, నరేందర్ రెడ్డి, రామ్ చంద్ర రెడ్డి, మురళి, వెంకట్ రెడ్డి, విజయ్ తదితరులు పాల్గొన్నారు.
చేగుంట గణేశ్ హాస్పిటల్ వద్ద ఆర్‌ఎక్స్‌పర్ట్ ఉచిత ఐవీఎఫ్ సలహా శిబిరం-28న.
చేగుంట,జూలై,23,(మెదక్ టుడే న్యూస్)చేగుంట మండల కేంద్రంలో గణేష్ హాస్పిటల్ దగ్గర జూలై 28వ తేదీనగ్రామీణ మారుమూల ప్రాంతాల్లో నివసించే ప్రజలకు సంతానోత్పత్తి వైద్య సేవలను మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో ఆర్‌ఎక్స్‌పర్ట్ డిజిటల్ వైద్యశాలలు మామ్ ఐవీఎఫ్ కేంద్రం హైదరాబాద్ సహకారంతో జూలై 28నఉచితఅంతర్జాలఐవీఎఫ్సలహాశిబిరాన్నినిర్వహిస్తోంది.ఈ శిబిరం ముఖ్యంగా సంతానం కోసం ఎదురుచూస్తున్న దంపతుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. గర్భధారణ సమస్యలు, సంతాన సామర్థ్య పరీక్షలు, ఐవీఎఫ్ చికిత్సకు సంబంధించిన నిపుణుల సలహాలను అందించేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. ఆర్‌ఎక్స్‌పర్ట్ దూరవైద్య వేదిక ద్వారా పాల్గొనే దంపతులు మామ్ ఐవీఎఫ్ సెంటర్ వస్థాపకురాలు, ప్రముఖ సంతాన సామర్థ్య నిపుణురాలు డా. పూర్ణిమ దుర్గ ఆమె నిపుణుల బృందాన్ని హైదరాబాద్‌కు ప్రయాణించాల్సిన అవసరం లేకుండానే అంతర్జాలంలో సంప్రదించవచ్చు.
ఈ కార్యక్రమానికి సంబంధించిన నమోదులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఆసక్తి గల దంపతులు తమకు సమీపంలోని ఆర్‌ఎక్స్‌పర్ట్ డిజిటల్ వైద్యశాలను సంప్రదించి నమోదు చేసుకోవచ్చు. అక్కడ శిక్షణ పొందిన సమన్వయకర్తలు కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేసి, అవసరమైన సమాచారాన్ని సమీకరించి, అంతర్జాల సలహా కోసం సమయాన్ని నిర్ణయిస్తారు.ఈ సందర్భంగా డి.ఆర్. పట్నాయక్ మాట్లాడుతూ,“గ్రామీణ ప్రాంతాల్లోని అనేక మంది దంపతులు దూరం, సమయం అధిక వైద్య ఖర్చుల కారణంగా నిపుణులైన సంతాన సామర్థ్య వైద్యులనుసంప్రదించలేకపోతున్నారు. సాంకేతికత స్థానిక ఆరోగ్య సేవల సహకారంతో నిపుణులైన ఐవీఎఫ్ వైద్య సేవలను గ్రామీణ ప్రజలకు చేరువ చేయాలనే ఉద్దేశంతో ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నాము” అని తెలిపారు.ఈ కార్యక్రమం ద్వారా ఆర్‌ఎక్స్‌పర్ట్, హైదరాబాద్‌లోని అత్యుత్తమ అతి విశిష్ట వైద్య సేవలను గ్రామీణ ప్రాంతాలకు అందించాలనే తన నిబద్ధతను మరోసారి చాటుతోంది. సరసమైన ఖర్చుతో, సరైన సమయంలో నాణ్యమైన వైద్య సలహాలను అందించడం ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం.ఈ అరుదైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఉచితంగా నిపుణుల సంతాన సామర్థ్య సలహాలు పొందేందుకు ఆసక్తి గల దంపతులు వెంటనే నమోదు చేసుకోవాలని నిర్వాహకులు కోరుతున్నారు.నమోదు వివరాల కోసం:చేగుంట: ఎ. రేఖ – 9989204307
ఆర్‌ఎక్స్‌పర్ట్: 7993328843
డి. ఆర్. పట్నాయక్: 9849018186

ఏడుపాయల అమ్మవారికి ఘనంగా పూజలు.
మెదక్ టుడే న్యూస్ జులై 23 మెదక్ జిల్లా ప్రతినిధి (పి. దుర్గేష్ గౌడ్ )పాపన్నపేట మండలంలోని ప్రసిద్ధ ఏడుపాయల వనదుర్గ భవాని అమ్మవారి ఆలయంలో ఈరోజు ఘనంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు అమ్మవారికి అభిషేకం, అలంకరణతో పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి దర్శనంతో భక్తులు ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు.
విద్యార్థులపై లాఠీచార్జ్ దారుణం-ప్రశ్నించే గొంతుకలను అణచొద్దు.
నీట్ లీకేజీపై పార్లమెంట్‌లో చర్చ జరపాలి.
కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి.
మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి.
మెదక్,జూలై, 22,(మెదక్ టుడే న్యూస్ ప్రతినిధి)
ఢిల్లీలో తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం శాంతియుతంగా నిరసన చేపట్టిన విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి అన్నారు. ఈ ఘటనను తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.ప్రశ్నించే హక్కు ప్రతి పౌరుడికి భారత రాజ్యాంగం కల్పించిందని, ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతుకలను అణచివేయడం సమంజసం కాదన్నారు. ప్రభుత్వం ప్రజల సమస్యలను వినాలే తప్ప, బలప్రయోగంతో నిరసనలను అణచివేయకూడదని సూచించారు.నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని, పార్లమెంట్‌లో విద్యార్థుల సమస్యలు, నీట్ పేపర్ లీకేజీపై సమగ్ర చర్చ నిర్వహించాలని కోరారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.ఢిల్లీలో విద్యార్థుల ఆందోళన సందర్భంగా జరిగిన ఘటనలపై స్వతంత్ర న్యాయ విచారణ జరిపించాలని, నీట్ పేపర్ లీకేజీ కారణంగా ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలకు తగిన పరిహారం అందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. దేశవ్యాప్తంగా పారదర్శక పరీక్షా విధానాన్ని అమలు చేసి విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పించాలని పద్మా దేవేందర్‌రెడ్డి కోరారు.









