15 నిమిషాల్లో సభా ప్రాంగణం ఖాళీ చేయాలంటూ మౌఖిక ఆదేశాలు.. సమాచార సేకరణ హక్కుకు విఘాతం అంటూ మీడియా వర్గాల ఆవేదన

సంగారెడ్డి ప్రతినిధి, జూలై 20 (మెదక్ టుడే న్యూస్):
ఉమ్మడి మెదక్ జిల్లాలో వర్షాభావ పరిస్థితులపై జిల్లా ఇన్చార్జి మంత్రి అధ్యక్షతన సోమవారం నిర్వహించిన సమీక్ష సమావేశం సందర్భంగా మీడియా కవరేజీకి సంబంధించిన వ్యవహారం వివాదాస్పదంగా మారింది. కార్యక్రమాన్ని కవర్ చేయడానికి వచ్చిన జిల్లా ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లకు కార్యక్రమం ప్రారంభానికి ముందే కేవలం 15 నిమిషాల్లో చిత్రీకరణ పూర్తి చేసి సభా ప్రాంగణాన్ని విడిచిపెట్టాలని సంగారెడ్డి జిల్లా ప్రజా సంబంధాల అధికారి (డిపిఅర్ఓ) మౌఖికంగా సూచించినట్లు మీడియా ప్రతినిధులు తెలిపారు.
ప్రజలకు ప్రభుత్వ కార్యక్రమాలపై పూర్తి సమాచారాన్ని చేరవేయడం మీడియా బాధ్యత కాగా, ఇలాంటి పరిమితులు ఎందుకు విధించారనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఆదేశాలపై వివరణ కోరగా, “అడిషనల్ కలెక్టర్, జిల్లా కలెక్టర్‌ను అడగండి” అని డిపిఅర్ఓ సమాధానం ఇచ్చినట్లు అక్కడున్న మీడియా ప్రతినిధులు పేర్కొన్నారు.
అధికారిక కార్యక్రమాలను పూర్తిస్థాయిలో చిత్రీకరించి ప్రజలకు వాస్తవ సమాచారాన్ని అందించడం మీడియా విధి అని, మౌఖిక ఆదేశాల ద్వారా సమయ పరిమితులు విధించడం సమాచార సేకరణ స్వేచ్ఛకు విఘాతం కలిగిస్తోందని ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణలో పారదర్శకతకు భంగం కలిగే అవకాశం ఉందని కూడా వారు అభిప్రాయపడ్డారు.
డిపిఅర్ఓ తీరుపై ప్రశ్నలు
జిల్లా అధికారిక కార్యక్రమాల్లో ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లపై క్రమశిక్షణ పేరుతో పరిమితులు విధిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లపై చేసిన ఆరోపణలకు ఆధారాలు ఏమిటి?
ఇప్పటివరకు ఏవైనా వ్రాతపూర్వక హెచ్చరికలు జారీ చేశారా?
క్రమశిక్షణా చర్యలు తీసుకున్నట్లయితే వాటి వివరాలు ఏమిటి?
మౌఖిక ఆదేశాలకే పరిమితం కావడానికి కారణమేంటి?
మీడియాపై పరిమితులు విధించేందుకు అధికారిక ఉత్తర్వులు ఉన్నాయా?
నిజంగా క్రమశిక్షణా లోపాలు జరిగి ఉంటే సంబంధిత రికార్డులు, తేదీలు, చర్యల వివరాలను అధికారికంగా వెల్లడించాలని మీడియా ప్రతినిధులు కోరుతున్నారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం ఒక వృత్తి వర్గం ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రమాదం ఉందని వారు పేర్కొన్నారు.ప్రభుత్వ కార్యక్రమాల్లో సమాచార సేకరణకు అనుకూల వాతావరణం కల్పించడం, పారదర్శకతను పాటించడం, మీడియాతో సమన్వయంతో వ్యవహరించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి అవసరమని మీడియా వర్గాలు అభిప్రాయపడ్డాయి. ఈ వ్యవహారంపై జిల్లా యంత్రాంగం అధికారికంగా స్పందించి స్పష్టత ఇవ్వాలని వారు కోరుతున్నారు.



