అమీన్ పూర్, జూన్ 23:(మెదక్ టుడే) న్యూస్ ప్రతినిధి
బీరంగూడ డివిజన్ పరిధిలో వర్షాలు అపార్ట్‌మెంట్ వాసుల పాలిట శాపంగా మారాయి. అస్తవ్యస్తమైన డ్రైనేజీ వ్యవస్థ, అక్రమ నిర్మాణాల కారణంగా ప్రతి వర్షానికి స్థానికులు నరకం చూస్తున్నారు. తాజాగా శ్రీ గురు రాఘవేంద్ర అపార్ట్‌మెంట్, నవ్య ప్రైడ్ అపార్ట్‌మెంట్లలో నివాసితులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
*సెల్లార్లలోకి వరద.. మునిగిన వాహనాలు*
సుమారు 36 కుటుంబాలు నివసించే శ్రీ గురు రాఘవేంద్ర అపార్ట్‌మెంట్ సెల్లార్‌లోకి భారీగా వర్షపు నీరు చేరడంతో అక్కడ పార్క్ చేసిన మూడు కార్లు పూర్తిగా నీట మునిగాయి. మోటార్ల సాయంతో నీటిని బయటకు పంపేందుకు స్థానికులు పడుతున్న కష్టాలు వర్ణనాతీతం. ఇక నవ్య ప్రైడ్ అపార్ట్‌మెంట్ వద్ద పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. అపార్ట్‌మెంట్ పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో మెయిన్ రోడ్డు పైనుంచి వస్తున్న నీరంతా వచ్చి చేరుతోంది. అక్కడి నుంచి ఆ నీరు నేరుగా సెల్లార్‌లోకి వెళ్లడంతో ఏకంగా 15 కార్లు నీట మునిగిపోయాయి. 24 కుటుంబాలు నివసించే ఈ అపార్ట్‌మెంట్‌లో అత్యవసర పరిస్థితిలో కూడా బయటకు రాలేని దుస్థితి నెలకొంది.
*అక్రమ నిర్మాణాలే ప్రధాన కారణమా?*
డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో పాటు, పాత డ్రైనేజీలను పక్కనపెట్టి నిర్మించిన అక్రమ నిర్మాణాలు నీటి ప్రవాహానికి అడ్డుపడుతున్నాయని నివాసితులు ఆరోపిస్తున్నారు. “ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రతి వర్షానికి ఇదే తంతు” అని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెస్క్యూ టీమ్‌లు వచ్చి నీటిని బయటకు తోడేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ, శాశ్వత పరిష్కారం లేకపోవడంతో పరిస్థితి మళ్ళీ మొదటికే వస్తోందని వారు వాపోతున్నారు.
*స్పందించాలని అధికారులకు విజ్ఞప్తి*
జిహెచ్ఎంసి అధికారులు తక్షణమే స్పందించి, నాలాలను క్లియర్ చేయించాలని, అక్రమ నిర్మాణాలను తొలగించి శాశ్వత డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో, తమకు జరుగుతున్న భారీ ఆస్తి నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా యంత్రాంగం కళ్ళు తెరిచి, వర్షకాలం ముగిసేలోపు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.

