ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం రేవంత్..
శ్వేతను శాలువాతో సత్కరించి, అభినందించిన కాంగ్రెస్ నేత నీలం మధు.
పటాన్ చెరు మే 27,(మెదక్ టుడే) న్యూస్ ప్రతినిధి.తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వంగా అన్ని వర్గాలకూ సమ న్యాయం చేస్తోందని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి నీలం మధు ముదిరాజ్ అన్నారు. తెలంగాణ సాయుధ పోరాట వీరనారి, బహుజన ఆత్మగౌరవ ప్రతీక చాకలి ఐలమ్మ వారసత్వాన్ని గౌరవిస్తూ, ఆమె మనవరాలు చిట్యాల శ్వేతను రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో, నూతనంగా నియమితులైన మహిళా కమిషన్ సభ్యురాలు చిట్యాల శ్వేత బుధవారం చిట్కుల్ లోని ఆయన కార్యాలయంలో నీలం మధు ముదిరాజ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమెకు శాలువా కప్పి, మిఠాయి తినిపించి నీలం మధు ఘనంగా సత్కరించి అభినందించారు.ఈ సందర్భంగా నీలం మధు ముదిరాజ్ మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమకారులకు, అమరవీరుల కుటుంబాలకు, సాయుధ పోరాట యోధులకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని కొనియాడారు.గతంలో ఇచ్చిన మాట ప్రకారం.. తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ కుటుంబానికి సముచిత స్థానం కల్పిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నేడు చిట్యాల శ్వేతను మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమించి తన చిత్తశుద్ధిని నిరూపించుకున్నారని కొనియాడారు. ఇది బహుజన వర్గాలకు, ముఖ్యంగా రజక సామాజిక వర్గానికి దక్కిన గౌరవంగా అభిప్రాయపడ్డారు.అనంతరం చిట్యాల శ్వేత మాట్లాడుతూ,తనపై నమ్మకంతో ఇంతటి బాధ్యతాయుతమైన పదవిని అప్పగించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు చిట్యాల శ్వేత ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తనను అభినందించిన నీలం మధు ముదిరాజ్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ,చాకలి ఐలమ్మ ఆశయాలకు అనుగుణంగా గతంలో చిట్కుల్ లో ఏర్పాటు చేసిన ఐలమ్మ కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఆమె గుర్తుచేసుకున్నారు, రాష్ట్రంలో మహిళల భద్రత, హక్కుల పరిరక్షణకు వారి సంక్షేమం కోసం అంకితభావంతో పనిచేస్తానని స్పష్టం చేశారు.

