
షాద్‌నగర్ శివారులో సంచలనం సృష్టించిన హత్య కేసును ఛేదించిన పోలీసులు
నిందితుల అరెస్ట్.. పోలీసులకు డీసీపీ శిరీష ప్రశంసలు, రివార్డులు
(స్పెషల్ కరస్పాండెంట్)
షాద్‌నగర్,మే,12,మెదక్ టుడే న్యూస్: మద్యం మత్తు, మహిళ వ్యామోహం ఓ వ్యక్తి ప్రాణాలను బలితీసుకున్న ఘటన రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ శివారులో సంచలనం సృష్టించింది. కేవలం జేబులో ఉన్న పదివేల రూపాయల కోసం ఓ మహిళతో కలిసి మరో వ్యక్తి పన్నిన పథకం చివరకు దారుణ హత్యకు దారితీసింది. అయితే ఈ కేసును పోలీసులు అత్యంత చాకచక్యంగా విచారించి కేవలం కొద్ది గంటల్లోనే నిందితులను అదుపులోకి తీసుకుని కేసును ఛేదించారు.ఈ కేసులో నిందితులైన పుల్లం గోవిల బజారన్న, బైన్ల యాదమ్మలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.పోలీసుల కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం సర్ధార్ నగర్‌కు చెందిన కేశవులు శ్రీనివాసరావుకు చెందిన ఫామ్‌హౌస్‌లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 9వ తేదీన తన భూమి వివాదానికి సంబంధించిన పని నిమిత్తం యజమాని వద్ద నుంచి రూ.50 వేల తీసుకుని పరిగికి వెళ్లాడు. అక్కడ న్యాయవాదికి రూ.40 వేల చెల్లించి మిగిలిన రూ.10 వేలతో తిరిగి రాత్రి షాద్‌నగర్‌కు చేరుకున్నాడు.
రాత్రి 9:30 గంటల సమయంలో షాద్‌నగర్ బస్టాండ్‌లో దిగిన కేశవులు ఇంటికి వస్తున్నానని భార్య పద్మకు ఫోన్ ద్వారా తెలిపాడు. అనంతరం ఆమె పలుమార్లు ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. మరుసటి రోజు వీర్లపల్లి రోడ్డులోని ఓ వెంచర్ ప్రాంతంలో కేశవులు మృతదేహం కనిపించడంతో ఘటన వెలుగులోకి వచ్చింది.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అనంతరం ఏసీపీ లక్ష్మీనారాయణ పర్యవేక్షణలో సీఐ సీతారాం ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు దర్యాప్తు ప్రారంభించాయి.
దర్యాప్తులో భాగంగా సంఘటనా స్థల సమీపంలో రక్తపు మరకలతో పడివున్న ఓ షర్టు పోలీసులకు కీలక ఆధారంగా మారింది. ఆ షర్టు ఆధారంగా నిందితుడు బజారన్నను గుర్తించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజాలు బయటపడ్డాయి.
పోలీసుల విచారణలో వెల్లడైన వివరాల ప్రకారం.. షాద్‌నగర్‌కు వచ్చిన కేశవులు ముందుగా లక్కీ వైన్స్ వద్ద మద్యం సేవించాడు. అక్కడే అతనికి బజారన్న పరిచయం అయ్యాడు. కేశవుల వద్ద డబ్బులు ఉన్నాయని గుర్తించిన బజారన్న వాటిని దోచుకోవాలని యోచించాడు. ఇద్దరూ కలిసి మద్యం సేవించిన తర్వాత అక్కడికి వచ్చిన బైన్ల యాదమ్మను చూసి కేశవులు ఆకర్షితుడయ్యాడు. అదే అవకాశంగా భావించిన బజారన్న యాదమ్మతో కలిసి పథకం రచించాడు.
వెయ్యి రూపాయలు ఇస్తానని చెప్పి యాదమ్మను కేశవులతో కలిసి వీర్లపల్లి రోడ్డులోని ఓ వెంచర్ ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ కేశవులు అప్రమత్తంగా లేని సమయంలో బండరాయితో తలపై మోది హత్య చేశారు. అనంతరం అతని వద్ద ఉన్న డబ్బులను తీసుకుని పరారయ్యారు.
హత్య అనంతరం బజారన్న గద్వాలకు వెళ్లి మరుసటి రోజు తిరిగి వచ్చాడు. అయితే అప్పటికే అతని కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు ఇంటి వద్దే అతడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నేరాన్ని ఒప్పుకోవడంతో అతని వద్ద నుంచి రూ.3900 స్వాధీనం చేసుకున్నారు. అనంతరం యాదమ్మను కూడా అరెస్టు చేసి ఇద్దరినీ రిమాండ్‌కు తరలించారు.
ఈ కేసును అత్యంత వేగంగా ఛేదించిన పోలీసు బృందాన్ని షాద్‌నగర్ డీసీపీ శిరీష ప్రత్యేకంగా అభినందించారు. కేసు దర్యాప్తులో ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులకు, సిబ్బందికి ఆమె రివార్డులు అందజేసి అభినందించారు.
