📄 ePaper
Thursday, June 4, 2026
ADS
HomePOITICAL NEWSతెలంగాణలో జనసేన పోటీ ఖాయం-పవన్ కల్యాణ్.

తెలంగాణలో జనసేన పోటీ ఖాయం-పవన్ కల్యాణ్.

📰 Generate e-Paper Clip

-తెలంగాణపై ప్రేమే కారణం

-విమర్శలకు ఘాటు సమాధానం

-ఎన్నికల్లో జనసేన బరిలోకి

    హైదరాబాద్,జూన్,2,(మెదక్ టుడే న్యూస్)తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామానికి తెరలేపుతూ జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సంచలన ప్రకటన చేశారు. ఇకపై తెలంగాణలో జరిగే ఎన్నికల్లో జనసేన పార్టీ తప్పకుండా పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, తనపై వస్తున్న విమర్శలు, బెదిరింపులు, తెలంగాణపై చేస్తున్న దుష్ప్రచారానికి ఘాటుగా బదులిచ్చారు. తెలంగాణ తనకు ఎంతో ఆత్మీయమైన నేల అని, ఈ ప్రాంతంపై తనకు ఎనలేని ప్రేమ ఉందని పేర్కొన్నారు. కొందరు రాజకీయ నాయకులు, విశ్లేషకులు ఉద్దేశపూర్వకంగా తనపై ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
    తాను ఎన్నడూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించలేదని పవన్ కల్యాణ్ మరోసారి స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన జరిగిన తీరును మాత్రమే ప్రశ్నించానని, ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా పార్లమెంట్‌లో వ్యవహరించిన విధానాన్ని తప్పుపట్టానని చెప్పారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ఎప్పుడూ గౌరవించానని, సామాజిక న్యాయంతో కూడిన తెలంగాణ తన కల అని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన యువత, అమరవీరుల త్యాగాలకు తనకు అపార గౌరవం ఉందన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా కొందరు తనను తెలంగాణ వ్యతిరేకిగా చిత్రీకరించడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
    తనపై వస్తున్న భూకబ్జా ఆరోపణలపైనా పవన్ తీవ్రంగా స్పందించారు. హైదరాబాద్‌లో తాను చెరువు భూమిని ఆక్రమించానంటూ చేస్తున్న ప్రచారాన్ని ఖండిస్తూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఆ భూమిని పరిశీలించాలని సవాల్ విసిరారు. తాను భూమి ఆక్రమించినట్లు నిరూపితమైతే ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకోవచ్చని, తనపై చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చని ప్రకటించారు. అధికార పదవుల కోసం రాజకీయాలు చేయడం తన లక్ష్యం కాదని, వ్యవస్థలో మార్పు తీసుకురావడమే తన ధ్యేయమని స్పష్టం చేశారు. తెలంగాణలో ముఖ్యమంత్రి అవ్వాలనే ఆశ తనకు లేదని, ప్రజల సమస్యల పరిష్కారమే తన రాజకీయాల ఉద్దేశమని తెలిపారు.
    తెలంగాణలో జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని కార్యకర్తలు, నాయకులు ఎప్పటి నుంచో కోరుతున్నారని పవన్ తెలిపారు. అందుకే ఇకపై రాష్ట్రవ్యాప్తంగా స్వయంగా పర్యటించి పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్తానని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో జనసేన తప్పకుండా పోటీ చేస్తుందని, ఎవరి బెదిరింపులకు భయపడబోదని హెచ్చరించారు. తెలంగాణలో ప్రజా సమస్యలపై మాట్లాడతామని, అన్యాయాలను ప్రశ్నిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ భారతదేశంలో అంతర్భాగమని, ఎవరూ తమ ఇష్టానుసారం ఎవరికైనా ప్రవేశం నిరాకరించలేరని పేర్కొన్నారు.
    ప్రజా గాయకుడు గద్దర్‌తో తనకు ఉన్న అనుబంధాన్ని కూడా పవన్ భావోద్వేగంగా గుర్తు చేసుకున్నారు. గద్దర్ జీవించి ఉన్న సమయంలో ఆయనకు అవసరమైన సహాయం చేశానని, ఆయన తనను ఎంతో ఆప్యాయంగా చూసేవారని చెప్పారు. గద్దర్ బతికున్నప్పుడు పట్టించుకోని వారు ఇప్పుడు ఆయన పేరును రాజకీయాల కోసం ఉపయోగించుకోవడం విచారకరమన్నారు. తనకు వామపక్షాలు, కుడిపక్షాలు అనే భావజాలాల కంటే మానవతా విలువలే ముఖ్యమని తెలిపారు. గద్దర్ చివరి రోజుల్లో కూడా యువత భవిష్యత్తుపై ఆలోచించారని, ఆ సందేశాన్ని సమాజానికి చేరవేయడం మన బాధ్యత అని అన్నారు.
    ఆంధ్రా, తెలంగాణ ప్రజల మధ్య కొందరు కావాలనే విద్వేషాలు రెచ్చగొడుతున్నారని పవన్ కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. నాయకుల తప్పులను ప్రజలపై మోపడం సరికాదని, ప్రాంతీయ ద్వేషాలు దేశ సమగ్రతకు హానికరమని హెచ్చరించారు. తెలంగాణలో పరిశ్రమలు రాకపోయినా, ఉపాధి సమస్యలు ఉన్నా వాటికి ఆంధ్ర ప్రజలను బాధ్యులను చేయడం సరైన విధానం కాదన్నారు. ప్రజలు వేరు, పాలకులు వేరు అనే విషయాన్ని గుర్తించాలని సూచించారు. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల ప్రజలు పరస్పర గౌరవంతో జీవించాలని, భారతీయులుగా ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. తెలంగాణపై తన ప్రేమను ఎవరూ ప్రశ్నించలేరని, రాష్ట్ర ప్రజలతో కలిసి పనిచేయడం కొనసాగిస్తానని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

    RELATED ARTICLES
    - Advertisment -ADS

    Most Popular