📄 ePaper
Tuesday, September 15, 2026
ADS
Home Blog Page 77

కేంద్ర మంత్రి సంతకం ఫోర్జరీ చేసి నకిలీ అరెస్ట్ వారెంట్.. రూ.99 లక్షలు కొట్టేసిన కేటుగాడు..

0

(స్టేట్ బ్యూరో) పూణే, నవంబర్ 12 మెదక్ టుడే న్యూస్:

•కేంద్ర మంత్రి సంతకం ఫోర్జరీ చేసి నకిలీ అరెస్ట్ వారెంట్.. రూ.99 లక్షలు కొట్టేసిన కేటుగాడు

•పుణే వృద్ధురాలికి డిజిటల్ అరెస్ట్ పేరుతో బెదిరింపులు

•నిర్మలా సీతారామన్ సంతకంతో కూడిన వారెంట్ పంపిన సైబర్ నేరస్థులు

•బ్యాంకు ఖాతాలోని సొమ్మంతా బదలాయించుకుని ఫోన్ స్విచ్చాఫ్ చేసిన వైనం

•పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు

సైబర్ నేరస్థులు రోజురోజుకూ తెలివిమీరిపోతున్నారు. సరికొత్త ఎత్తులతో ఉన్నత విద్యావంతులనూ మోసం చేస్తున్నారు. డిజిటల్ అరెస్ట్ నేరాలపై ప్రజల్లో అవగాహన పెరగడంతో మరో కొత్త వ్యూహంతో మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా పుణేకు చెందిన ఓ వృద్ధురాలిని డిజిటల్ అరెస్టు పేరుతో బెదిరించి రూ.99 లక్షలు కాజేశారు. ఇందుకోసం కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ సంతకాన్ని ఫోర్జరీ చేసి ఓ అరెస్ట్ వారెంట్ ను సృష్టించారు. దీంతో ఉన్నతవిద్యావంతురాలు, ఎల్ఐసీ మాజీ ఉన్నతాధికారి అయిన ఆ వృద్ధురాలు నమ్మి మోసపోయారు. పుణే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.పూణేకు చెందిన 62 ఏళ్ల మహిళ ఎల్ఐసీలో ఉన్నతోద్యోగం చేసి పదవీ విరమణ చేశారు. ఇటీవల ఆమెకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఆమె ఆధార్ కార్డ్ తో లింక్ అయిన ఓ ఫోన్ నెంబర్ తో దుండగులు ఆర్థిక మోసాలకు పాల్పడ్డారని అవతలి వ్యక్తి బెదిరింపులకు గురిచేశాడు. ఈ విషయంపై సీనియర్ ఆఫీసర్ వీడియో కాల్ లో మాట్లాడతారంటూ ఫోన్ పెట్టేశాడు. కాసేపటి తర్వాత సీనియర్ పోలీస్ ఆఫీసర్ జార్జ్ మాథ్యూ పేరుతో మరో దుండగుడు వాట్సాప్ వీడియో కాల్ చేశాడు. ఆమె ఆధార్ కార్డ్ తో లింక్ అయిన ఫోన్ నెంబర్ తో ఆర్థిక మోసాలు జరిగాయని, ఈ కారణంగా మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేశామని చెప్పాడు.ఇందుకు సంబంధించి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ సంతకంతో జారీ అయిన ఓ నకిలీ అరెస్ట్ వారెంట్ ను వాట్సాప్ చేశాడు. మనీలాండరింగ్ కేసు కావడంతో దర్యాప్తు కోసం బ్యాంకులో ఉన్న నగదు మొత్తం తాము సూచించిన ఖాతాకు బదిలీ చేయాలని, ఆర్బీఐ తనిఖీ తర్వాత ఆ మొత్తం తిరిగి ఆమె ఖాతాలో జమ అవుతుందని నమ్మబలికాడు. నిధులు బదిలీ చేయకుంటే జైలుకు వెళ్లాల్సి వస్తుందని బెదిరించడంతో భయాందోళనకు గురైన బాధితురాలు దుండగుడు చెప్పిన బ్యాంకు ఖాతాలకు రూ.99 లక్షలు బదిలీ చేసింది. ఆ తర్వాత దుండగుడికి ఫోన్ చేసేందుకు ప్రయత్నించగా స్విచ్ఛాఫ్ వచ్చింది. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు వెంటనే పోలీసులను ఆశ్రయించింది. పుణే సైబర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

భూటాన్ నుంచి నేరుగా ఆసుపత్రికి ప్రధాని మోదీ…

0

(స్టేట్ బ్యూరో) నవంబర్ 12 మెదక్ టుడే న్యూస్:

భూటాన్ నుంచి నేరుగా ఆసుపత్రికి ప్రధాని మోదీ…

•ఎర్రకోట పేలుడు బాధితులకు పరామర్శ

•భూటాన్ పర్యటన ముగించుకుని తిరిగొచ్చిన ప్రధాని మోదీ

•ఢిల్లీలోని లోక్ నాయక్ జైప్రకాశ్ ఆసుపత్రిలో బాధితులతో మాట్లాడిన వైనం

•త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష

భూటాన్ పర్యటన ముగించుకుని నేడు దేశానికి తిరిగి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, విమానాశ్రయం నుంచి నేరుగా ఢిల్లీలోని లోక్‌నాయక్ జై ప్రకాశ్ నారాయణ్ ఆసుపత్రికి వెళ్లారు. ఎర్రకోట వద్ద జరిగిన కారు బాంబు పేలుడులో గాయపడి అక్కడ చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు.రెండు రోజుల భూటాన్ పర్యటన అనంతరం మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకున్న ప్రధాని, ఆసుపత్రిలో బాధితులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఘటనకు సంబంధించిన వివరాలను, బాధితులకు అందుతున్న వైద్యాన్ని గురించి వైద్యులు, అధికారులను అడిగి తెలుసుకున్నారు.అంతకుముందు భూటాన్‌ పర్యటనలో ఉండగానే ప్రధాని మోదీ ఢిల్లీ పేలుడు ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిపై అత్యంత కఠినమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.”ఢిల్లీలో ఒక విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఆప్తులను కోల్పోయిన కుటుంబాల బాధను నేను అర్థం చేసుకోగలను. ఎంతో భారమైన హృదయంతో ఇక్కడికి వచ్చాను. ఈ దుఃఖ సమయంలో దేశం మొత్తం బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తుంది. మన ఏజెన్సీలు ఈ ఘటనపై సమగ్రంగా దర్యాప్తు చేస్తాయి. బాధ్యులైన వారందరినీ చట్టం ముందు నిలబెడతాం” అని భూటాన్ రాజధాని థింఫులో ప్రధాని వ్యాఖ్యానించారు.

•దర్యాప్తు ముమ్మరం చేసిన ఎన్ఐఏ

మరోవైపు, ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో జరిగిన ఈ పేలుడు ఘటన దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ముమ్మరం చేసింది. కేసు విచారణ కోసం 10 మంది అధికారులతో కూడిన ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఎన్ఐఏ ఏడీజీ విజయ్ సఖారే నేతృత్వంలోని ఈ బృందంలో ఒక ఐజీ, ఇద్దరు డీఐజీలు, ముగ్గురు ఎస్పీలు, మిగిలిన వారు డీఎస్పీ స్థాయి అధికారులు ఉన్నారని అధికార వర్గాలు బుధవారం తెలిపాయి. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ మంగళవారం ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను ఎన్ఐఏకి అప్పగించిన విషయం తెలిసిందే.కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం ఉన్నతస్థాయి భద్రతాధికారులతో సమావేశమై దర్యాప్తు పురోగతిని సమీక్షించారు. కుట్ర వెనుక ఉన్న సూత్రధారులను వీలైనంత త్వరగా పట్టుకోవాలని కఠిన ఆదేశాలు జారీ చేశారు. “దోషులను పట్టుకోవడంలో ఏ ఒక్క అంశాన్నీ విడిచిపెట్టం” అని ఆయన స్పష్టం చేశారు. ఎన్ఐఏ, ఐబీ, ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ కలిసికట్టుగా పనిచేయాలని ఆదేశించారు.ఇది గరిష్ఠ నష్టం కలిగించే లక్ష్యంతో జరిపిన ఆత్మాహుతి దాడి అయి ఉండవచ్చని దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. వెయ్యికి పైగా సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నామని, సోషల్ మీడియా కార్యకలాపాలను కూడా పర్యవేక్షిస్తున్నామని ఢిల్లీ పోలీసు వర్గాలు తెలిపాయి. పేలుడు జరిగిన ప్రాంతంలోని మొబైల్ ఫోన్ డంప్ డేటాను సేకరించి విశ్లేషిస్తున్నారు.ఈ ఘటన నేపథ్యంలో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్, ముంబై నగరాల్లో హై అలర్ట్ ప్రకటించారు. రద్దీగా ఉండే ప్రాంతాలు, ప్రార్థనా స్థలాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవు కలెక్టర్..

0

మెదక్, నవంబర్, 12, మెదక్ టుడే న్యూస్:

ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవు కలెక్టర్.

•అన్ని సెంటర్లలో టార్పాలిన్స్ అందుబాటులో ఉంచాలి.

•అన్ని మీల్స్ వద్ద ఒక రెవెన్యూ అధికారి ద్వారా పర్యవేక్షణ.

•కలెక్టరేట్లో కొనుగోలు కేంద్ర నిర్వాహణపై అదనపు కలెక్టర్ నగేష్ తో కలిసి సివిల్ సప్లై మార్కెటింగ్, వ్యవసాయ, సహకార శాఖ, డి ఆర్ డి ఏ, అధికారులతో కలెక్టర్ సమీక్ష

జిల్లాలో కొనుగోలు కేంద్రాల నిర్వహణపై నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు.బుధవారం కలెక్టర్ ఛాంబర్ లో ధాన్యం కొనుగోలు కేంద్రల నిర్వహణపై అధికారులతో సమీక్షించారు.ఈ సందర్భంగా కలెక్టర్ పలు సూచనలు చేస్తూ ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని అధికారులు నిత్యం క్షేత్రస్థాయిలో పర్యటించి పర్యవేక్షించాలని, జిల్లాలో
ప్రస్తుతం వాతావరణ అనుకూల ప్రభావంగా ఉన్నందున కొనుగోలు వేగం పుంజుకుని రైతులకు లబ్ధి చేకూర్చాలన్నారు. 69 రైస్ మిల్లుల వద్ద ఒక రెవెన్యూ ఆఫీసర్ నియమించి లారీల దిగుమతి పర్యవేక్షణ చేసే విధంగా కార్యాచరణ తయారు చేయాలన్నారు..
అన్ని కొనుగోలు కేంద్రాలలో ప్రస్తుతం
స్టాక్ ఉన్న టార్పలిన్ వివరాలను సమగ్ర సమాచారంతో ఫార్మాట్ రూపొందించాలన్నారు కొనుగోలు కేంద్రాల వద్ద హమాలీలను పెంచి వేగంగా కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఆటోమేటిక్ ప్యాడి క్లీనర్స్ ఉన్న మండలాలలో రైతులు ధాన్యం శుభ్రం చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. రవాణా లారీల విషయంలో సంబంధిత ట్రాన్స్పోర్ట్ అధికారులతో సమన్వయంతో ముందుకు పోవాలన్నారు. సీఎంఆర్ పెండింగ్ విషయంలో పౌరసరఫరాల అధికారులు దృష్టి సారించాలన్నారు.ఈ సమావేశంలో డి ఆర్ డి ఎ పి డి శ్రీనివాసరావు, జిల్లా వ్యవసాయ అధికారి, జిల్లా పౌర సరఫరాధికారి నిత్యానంద్, డిఎం సివిల్ సప్లై జగదీష్, మార్కెటింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

వ‌డ్లు అమ్మిన రైతుకు ఇబ్బందులు లేకుండా స‌కాలంలో డ‌బ్బులు అందేలా చ‌ర్య‌లు కలెక్టర్..

0

మెదక్, నవంబర్, 12, మెదక్ టుడే న్యూస్:

•వ‌డ్లు అమ్మిన రైతుకు ఇబ్బందులు లేకుండా స‌కాలంలో డ‌బ్బులు అందేలా చ‌ర్య‌లు కలెక్టర్

•ధాన్యం దిగుమతి చేయడంలో ‌ మిల్లర్లు వేగం పెంచాలి.

•తాసిల్దార్లు తరచూ ‌ రైస్ మిల్లును తనిఖీ చేయాలి.

•కొల్చారం మండలంలో సత్య సాయి రైస్ మిల్, వరిగుంతం ఫ్యాక్స్ కొనుగోలు కేంద్ర పరిశీలనలో కలెక్టర్ వెల్లడి

•జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

వడ్లు అమ్మిన రైతులకు ఇబ్బందులు లేకుండా సకాలంలో డబ్బులు జమ అయ్యేవిధంగా పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు.కొల్చారం మండలంలో బుధవారం విస్తృతంగా పర్యటించిన కలెక్టర్ ముందుగా సత్యసాయి రైస్ మిల్లును ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రాల నుండి ఎన్ని లారీల ధాన్యం పంపించారు, వాటిని ఎప్పుడు దిగుమతి చేసుకున్నారు వంటి అంశాలను ఆయన క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించారు. ఈ తనిఖీలో ధాన్యం సేకరణ, నిల్వ ప్రక్రియలపై ఆయన ఆరా తీశారు.రైస్ మిల్లులో ధాన్యం దించుకుంటున్న విధానాన్ని పరిశీలించారు.ఏ లారీ కూడా 24గంటలకు మించివెయిటింగ్ లో ఉండకూడదని అందుకు తగ్గట్టు గా రైస్ మిల్లర్లు హమాలీలని ఏర్పాటు చేసుకోవాలన్నారు.
అనంతరం ‌ వరిగుంతం ఫ్యాక్స్ కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి కొనుగోలు నిర్వహణ తీరు సంబంధిత వివరాలను ‌ నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ
ఇప్పటివరకు జిల్లాలో 82 వేల 481 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందని21,277
మంది రైతులకు గాను 54 కోట్ల 52 లక్షల రూపాయలను రైతుల ఖాతాలలో జమ చేయడం జరిగిందన్నారు.
రైతులు అహర్నిశలు కాయ కష్టం చేసి
పండించిన పంటను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అమ్మి మద్దతు ధర పొంది ‌ ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు పంపించడం జరుగుతుందని మిల్లర్లు సహకరించిత్వరితగతిన ధాన్యాన్ని దిగుమతి చేసుకొని వెంటనే లారీలను పంపించాలని ‌ సూచించారు.
వ‌డ్లు అమ్మిన రైతుకు ఇబ్బందులు లేకుండా స‌కాలంలో డ‌బ్బులు అందేలా చ‌ర్య‌లు తీసుకోవాలన్నారు. రైతు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తెచ్చాక నిబంధనల ప్రకారం.. తేమ, తాలు చూసుకొని వెంటనే తూకం చేయాలని సూచించారు. అంతేకాకుండా రైతులు ఇబ్బందులు లేకుండా అవసరమైన అన్ని వివరాలు సేకరించి వాటి ఆధారంగా రైతుకు సంబంధించిన ధాన్యం వివరాలు ఆన్లైన్ లో అప్లోడ్ చేసి త్వరగా డబ్బులు అకౌంట్ లో పడే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.రైతులకు నాణ్యమైన ధాన్యం విషయంలో అవగాహన కల్పించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో , డిప్యూటీ తాసిల్దార్ నాగవర్ధన్, రెవెన్యూ సిబ్బంది, కొనుగోలు కేంద్ర నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

త్రికూటాద్రి ” శ్రీ త్రికోటేశ్వర స్వామి ఆలయం : కోటప్పకొండ..

0

(స్టేట్ బ్యూరో) గుంటూరు జిల్లా,నవంబర్, 12, మెదక్ టుడే న్యూస్:

•త్రికూటాద్రి ” శ్రీ త్రికోటేశ్వర స్వామి ఆలయం : కోటప్పకొండ (గుంటూరు జిల్లా)

•కాకులు దూరని కారడవి అనే పదం మీరు వినే ఉంటారు. కానీ కాకులు వాలని కొండ గురించి ఎప్పుడూ విని ఉండరు.

అవును ఈ కొండపై కాకులు వాలవు. #సాధారణంగా కొండ ప్రాంతాలపై ప్రతి చెట్టుపై కాకులు కనిపిస్తాయి. కానీ గుంటూరు జిల్లా నరసరావుపేటకు సమీపంలో ఉన్న కోటప్ప కొండపై మాత్రం కాకులు వాలవు. దీనికి కారణం కాకులకు ఉన్నటువంటి శాపం ఆ స్థానికుల అభిప్రాయం. అసలు ఈ కొండపై కాకులు వాలకపోవడానికి కారణం ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే ముందుగా కోటప్ప కొండ చరిత్ర గురించి తెలుసుకోవాలి.

కోటప్పకొండను త్రికోటేశ్వరాయలం, త్రికుటాద్రి అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఏ దిశలో చూసినా రుద్ర శిఖరం, బ్రహ్మ శిఖరం, విష్ణు శిఖరం అనే మూడు శిఖరాలు దర్శనమిస్తాయి.

#అందుకే దీనిని “త్రికుటాద్రి” అని పిలుస్తారు. కోటప్ప కొండ గొప్ప శైవ క్షేత్రంగా కీర్తి పొందింది. #మహశివరాత్రికి ఘనంగా అభిషేకాలు, పూజలు జరుగుతాయి. ఇక్కడికి చుట్టుపక్కల గ్రామాల నుండి అనేక విద్యుత్ ప్రభలు వస్తాయి. కొండపై “చతుర్ముఖ బ్రహ్మ” ఆకృతి భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది.#ఈ ప్రధాన మండపంలో స్వామికి ఎదురుగా నందీశ్వరుడు ఒక పక్క వినాయకుడు మరొక ప్రక్క కుమార స్వామి, మధ్యలో మోద దక్షిణామూర్తి అయిన శివుడ్ని ఆరాధిస్తూ, సేవిస్తూ ఉన్న ఋషి పుంగవులు దర్శనం ఇస్తారు. ఎడమ ప్రక్క పద్మాసనం మీద ఉన్న ధ్యాన శివుడి విగ్రహం గల “ధ్యాన మందిరం” ఉంది. యాగశాల, నవగ్రహ మండపం కూడా ఉన్నవి.

దక్షయజ్ఞము వల్ల సతీదేవి వియోగం తర్వాత పరమ శివుడు పిచ్చివాడై ముల్లోకాలు తిరుగుతుండగా ఆ శివుడ్ని ఆకర్షించి, ఆశ్రయమిచ్చి, బాల దక్షిణామూర్తి రూపంలో 12 సంవత్సరాలు ధ్యాన నిమగుడ్ని గావించిన స్థలమే ఈ త్రికోటేశ్వరాలయం. #ఈ క్షేత్రం మీద శివుడు తపస్సు చేస్తుండగా “ఆనంద వల్లి” అనే గొల్లభామ పాలు, తేనెలతో సేవించుచుండెను. శాలంకయ్య అనే రైతు శివుడు తపస్సు చేసే ప్రాంతానికి రావటంతో అతనికి బాలయోగి రూపంలో ఉన్న శివుడు కనిపించాడు. శివుడికి భక్తితో నమస్కరించి తన దగ్గర ఉన్న పండ్లను స్వామికి సమర్పించాడు.

ఒకసారి గొల్లభామ శివుడ్ని సేవించడానికి పాలను తీసుకువెళ్తూ అలుపు వల్ల తట్టను, పాల కుండలను ఒక గట్టు మీద ఉంచి సమీపంలో ఉన్న చెట్టు పూలను కోస్తూ ఉండగా ఒక కాకి వచ్చి పాల కుండలపై వ్రాలి పాలను ఒలకబోయటంతో అది చూచి గొల్లభామ కోపంతో “ఈ ప్రాంతంలో కాకులు ఉండకూడదు” అని శపించెను.

ఒకనాడు శాలంకయ్య శివుని వద్దకు వచ్చి “తన యింటికి వచ్చి ఆతిధ్యం స్వీకరించమని” వేడుకున్నాడు. అప్పుడు స్వామి “అలాగే వస్తానని, నువ్వు యింటికి వెళ్లమని” చెప్పారు. గొల్లభామ గర్భవతై “కొండకు రాలేకపోతున్నాను తండ్రీ, నీవే క్రిందకు రా!” అని శివుడ్ని వేడుకొనెను. #ఆమె మొర విని శివుడు గొల్లభామతో నేను క్రిందకు దిగునంత వరకు నీవు వెనుతిరిగి చూడరాదు” అని అనగా, “సరే” అంటూ ఆ గొల్లభామ పద ముందుకు నడుచుకుంటూ పోతూ ఉండగా సాంబశివుడు వెనుకగా బయలుదేరాడు.

శివుని పాద ధాటికి కొండలు పగిలి భయానకం కలిగించగా, ఆ గొల్లభామ వెనుకకు తిరిగి చూచినది. ఆమె చూడగానే పరమ శివుడు “లింగ రూపంగా మారాడు. #ఆ గొల్లభామ “శిల” రూపంగా మారినది. ఆ సమయంలో శాలంకయ్య “స్వామి ఆతిధ్యానికి” ఇంకా రాలేదని కొండ మీదకు రాగా ఈ దృశ్యం కనబడింది. శాలంకయ్య ఆశ్చర్యపోయి చూస్తూ విలపిస్తుంటే శివలింగం నుండి “ఈ కొండ క్రిందకు కోటి ప్రభలు ఏపుడు వస్తాయో, అప్పుడు నేను కొండ దిగి వస్తాను” అనే మాటలు వినిపించాయి. అప్పుడు శాలంకయ్య తన గ్రామం అయిన యలమందకు వచ్చి భక్తి శ్రద్ధలతో ఒక ప్రభను తయారు చేసి, దాని గురించి ప్రజలకు వివరించి, “మీరు ప్రభలు కట్టుకొని స్వామి దగ్గరకు రమ్మని” చెప్పెను.

అప్పటి నుండి ప్రభలు కట్టుకొని భక్తులు వస్తున్నారు. స్వామి వారి అనుగ్రహంతో కొండవీడుని జయించిన శ్రీకృష్ణ దేవరాయులు కోటప్పకొండకు వచ్చి విలువైన కానుకలు సమర్పించి, నిత్య ధూప దీప నైవేధ్యాలకు “కొండ కావూరు” అనే గ్రామాన్ని వ్రాసి యిచ్చాడు. #ఇక్కడ గొల్లభామ ఆనందవల్లికి ఆలయం ఉన్నది. ఈ ఆలయమును, స్వామి వారి ఆలయమును శాలంకయ్య నిర్మించాడు. శాలంకయ్య అమ్మవారి ఆలయం కట్టించాలని అనుకున్నాడు. కాని. స్వామి వారు శాలంకయ్య కలలోకి వచ్చి “సతీ దేవి వియోగంలో ఉన్న వాడిని, ఆమెకు గుడి కట్టించవద్దు” అని చెప్పుటవలన అమ్మ వారి గుడి కట్టించలేదు.

మహాశివరాత్రి, కార్తీక మాస సమయాల్లో కోటప్ప కొండ క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతుంది. #శివుడు దక్షిణామూర్తిగా, బ్రహ్మచారిగా వెలిసిన ఈ శిఖరంలో అమ్మవారి దేవాలయాలు ఉండవు. కాబట్టి ఇక్కడ పెళ్లిళ్లు కూడా జరగవు. #పరమ శివుడు దక్షిణామూర్తి స్వరూపంతో ఉన్న ఏకైక క్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇదొక్కటే.*

ఇది నరసరావుపేటకి 12 కి.మీ.

గుంటూరుకి 56 కి.మీ. దూరంలో ఉంది.

పూతన పేరు వినగానే చిన్ని కృష్ణునికి విషపు పాలిచ్చి, అతని చేతిలో చనిపోయిన రాక్షస స్త్రీ అని అందరికీ గుర్తు వచ్చేస్తుంది.

0

(స్టేట్ బ్యూరో)నవంబర్,12,మెదక్ టుడే న్యూస్:

పూతన…..

పూతన పేరు వినగానే చిన్ని కృష్ణునికి విషపు పాలిచ్చి, అతని చేతిలో చనిపోయిన రాక్షస స్త్రీ అని అందరికీ గుర్తు వచ్చేస్తుంది. చిన్ని కృష్ణుని చేతిలో చనిపోయినవారిలో పూతనకు ఒక ప్రత్యేకత ఉంది. రాజైన కంసుని ఆజ్ఞ దాటలేక ఆమె ఎంతోమంది శిశువులను చంపింది. తన బిడ్డను తనే స్వయంగా చంపుకుంది. కంసుడు చివరగా నంద కుమారుడైన కృష్ణుని చంపమన్నాడు. స్త్రీలందరూ తనను చూసి భయపడుతున్నారని, శిశుహంతకి అని నిందిస్తున్నారని, ప్రతి శిశువులో తన బిడ్డ దీనాలాపాలు వినిపిస్తున్నాయని ఇంక తానీ దారుణం చేయలేనని ఆమె కంసుని వేడుకుంటుంది. కంసుడు తన ఆజ్ఞ పాటించకపోతే ఆమెనే చంపేస్తానంటాడు.దేవకీ దేవి అష్టమ గర్భాన పుట్టే శిశువు తన మరణానికి కారకుడవుతాడన్న ఆకాశవాణి పలుకులు విని కంసుడికి భయం పట్టుకుంటుంది. దేవకీ వసుదేవులను చెరసాలలో బంధిస్తాడు. వారికి పుట్టిన ఆరుగురు శిశువులను చంపిస్తాడు. కృష్ణుడికి అగ్రజుడుగా పుట్టవలసిన ఏడవ శిశువు దేవకి గర్భంలో పెరుగుతుండగా యోగ మాయ రోహిణి గర్భంలో ప్రవేశపెడుతుంది. అతడే బలరాముడు.శ్రీకృష్ణ జననం కారాగారంలో కన్నులపండుగగా జరుగుతుంది. విష్ణుమాయతో ద్వారపాలకులంతా గాఢనిద్రలో ఉండగా, వసుదేవుడు చిన్ని కృష్ణుని తట్టలో పెట్టుకుని, యమునా నది దాటి, గోకులానికి వెళ్లి నందుడికి అప్పగిస్తాడు. బదులుగా పసిపాప ఉన్న తట్టను తీసుకువచ్చి దేవకి పక్కన పడుకోబెడతాడు. ఆమె యోగమాయ. యోగమాయ కంసుని చంపే మృత్యువు వేరే చోట పెరుగుతున్నాడని హెచ్చరిస్తుంది. దాంతో ఆ సమయంలో పుట్టిన శిశువులందరినీ కంసుడు చంపిస్తాడు. కంసుని ఆజ్ఞతో పూతన అందమైన స్త్రీ రూపంలో గోకులానికి మహా దేవుని పూజకని చెప్పివస్తుంది. స్త్రీలంతా ఆమెను సాదరంగా ఆహ్వానిస్తారు. చిన్ని కృష్ణుని లాలించి, ముద్దాడి పాలు ఇస్తున్నట్లుగా, విషపు పాలు ఇస్తుంది. చిన్ని కృష్ణుడు పాలతోపాటు ఆమె ప్రాణాలు పీల్చివేస్తాడు. పూతన నిజరూపంతో నేలకూలుతుంది. పూతన గత జన్మలో బలి చక్రవర్తి కూతురు రత్నమాల. శ్రీహరి వామన రూపంలో బలి దగ్గరకు వచ్చినప్పుడు రత్నమాల అతని ముగ్ధమనోహర రూపం చూసి ఈ అమృత మూర్తికి పాలిచ్చే భాగ్యం లేకపోయిందే అని బాధపడిందట. హరి ఆమె మనసు గ్రహించి, ద్వాపర యుగంలో పూతనగా జన్మించిన ఆమెవద్ద పాలు తాగి ఆమె కోరిక తీర్చాడు. తాగింది విషమైనా, తనకు పాలిచ్చిన తల్లిగా భావించి ఆమెకు మోక్షాన్ని ప్రసాదించాడు. తనకు విషాన్నిచ్చిన వారికి అమృతత్వాన్ని ప్రసాదించిన కరుణామూర్తి శ్రీకృష్ణ పరమాత్మ! ఆ దివ్యమూర్తి కరుణను పొందిన ధన్యజీవి పూతన.

హైదరాబాద్: స్ట్రాంగ్ రూమ్లో ఈవీఎంలు,భారీ భద్రత..

0

హైదరాబాద్: స్ట్రాంగ్ రూమ్లో ఈవీఎంలు.. భారీ భద్రత..

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో భాగంగా పోలింగ్ స్టేషన్ల నుంచి ఎన్నికల సిబ్బంది ఈవీఎంలను యూసుఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్కు తరలించారు. కేంద్ర సాయుధ బలగాల భద్రత నడుమ కేటాయించిన రూట్లలో ప్రత్యేక బస్సుల్లో సిబ్బంది ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్కు భద్రంగా చేర్చారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో పటిష్ఠ భద్రతను అధికారులు ఏర్పాటు చేశారు.

మళ్లీ మహిళలకు షాకిస్తున్న బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే..

0

(స్టేట్ బ్యూరో) నవంబర్ 12 మెదక్ టుడే న్యూస్:

•మళ్లీ మహిళలకు షాకిస్తున్న బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే..

డాలర్ విలువ పెరిగే కొద్దీ బంగారం ధర తగ్గుతుంది. దీనికి ప్రధాన కారణం డాలర్ విలువ పెరిగే కొద్దీ అమెరికా ఫెడరల్ రిజర్వు జారీ చేసే ట్రెజరీ బాండ్లను పెట్టుబడి పెట్టేందుకు ఇన్వెస్టర్లు ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. ఎందుకంటే..బంగారం ధరలు తగ్గినట్లే తగ్గి మళ్లీ షాకిస్తున్నాయి. క్రమంగా పెరుగుతూ వస్తోంది. గతంలో లక్షా 30 వేల వరకు వెళ్లిన తులం బంగారం ధర.. లక్షా 20 వేల దిగువన చేరుకుంది. కానీ మెల్లమెల్లగా మళ్లీ పెరుగుదల నమోదవుతోంది. మూడు రోజుల్లోనే కనీసం 2 వేల రూపాయల వరకు పెరిగింది. ప్రస్తుతం నవంబర్‌ 12వ తేదీన దేశంలో తులం బంగారం ధర రూ.1,25,850 వద్ద కొనసాగుతోంది.

చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,27,650 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,17,010 వద్ద కొనసాగుతోంది.

ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,27,850 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,15,360 ఉంది.

ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,25,980 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,15,510 ఉంది.

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,25,850

ఢిల్లీ బాంబు బ్లాస్ట్.. హైదరాబాద్ లో హై అలర్ట్..

0

(స్టేట్ బ్యూరో) నవంబర్ 12 మెదక్ టుడే న్యూస్:

•ఢిల్లీ బాంబు బ్లాస్ట్.. హైదరాబాద్ లో హై అలర్ట్..

•న్యూఢిల్లీ ఎర్రకోటలో బాంబ్ బ్లాస్ట్ దేశాన్ని వణికించింది.

•దీంతో మెయిన్ సిటీల్లో అధికారులు అలర్ట్ అయ్యారు.

SCR పరిధిలో భద్రతా తనిఖీలు కఠినం చేశారు. RPF, GRP బాంబు డిఫ్యూజ్ బృందాలు, డాగ్ స్క్వాడ్లు సికింద్రాబాద్, HYD, కాచిగూడ వంటి ప్రధాన స్టేషన్లలో తనిఖీలు చేపట్టాయి. సీసీటీవీ నిఘా బలోపేతం చేసి, ప్రయాణీకులు అనుమానాస్పద వస్తువులు గమనిస్తే వెంటనే రైల్వే సిబ్బందికి తెలియజేయాలని అధికారులు సూచించారు.

న్యాయం చేయమని వెళ్తే. లంచం. 50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో ములుగు ఎస్ ఐ, కానిస్టేబుల్‌..!!

0

(స్టేట్ బ్యూరో)నవంబర్,12,మెదక్ టుడే న్యూస్:

50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో ములుగు ఎస్సై, కానిస్టేబుల్‌..!!

ప్రభుత్వ డబుల్‌ బెడ్‌రూం ఇళ్లలో అక్రమంగా కబ్జా చేసిన కేసులో న్యాయం చేయాలంటే లంచం ఇవ్వాలని డిమాండ్ చేసిన ములుగు పోలీస్‌ స్టేషన్‌ ఎస్సై, కానిస్టేబుల్‌ ఏసీబీ వలలో చిక్కారు.ములుగు పోలీస్‌ స్టేషన్‌లో పనిచేస్తున్న ఎస్సై విజయ్‌కుమార్, కానిస్టేబుల్‌ రాజులు బాధితులపై ఒత్తిడి తెచ్చి లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ డబుల్ బెడ్‌రూం ఇల్లుపై ఇతరులు అక్రమంగా కబ్జా చేయడంతో బాధితులు కోర్టును ఆశ్రయించగా, కోర్టు వారి పక్షాన ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాల కాపీని ఎస్సై విజయ్‌కుమార్‌కు అందజేసి న్యాయం చేయమని బాధితులు కోరారు.అయితే, ఆ ఇంటిని అప్పగించాలంటే రూ.1 లక్ష లంచం ఇవ్వాలని ఎస్సై డిమాండ్ చేశాడు. బాధితులు ఆ మొత్తం ఇవ్వలేకపోవడంతో రూ.50,000కు ఒప్పుకున్నారు. వెంటనే ఏసీబీ అధికారులను సంప్రదించారు.ఏసీబీ ఏర్పాటు చేసిన ఉచ్చులో మంగళవారం సాయంత్రం కానిస్టేబుల్‌ రాజు బాధితుల నుంచి రూ.50,000 లంచం తీసుకుంటున్న సమయంలో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.తదుపరి విచారణ అనంతరం ఎస్సై విజయ్‌కుమార్‌, కానిస్టేబుల్‌ రాజులపై కేసు నమోదు చేసి రిమాండుకు తరలించినట్లు ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ తెలిపారు..