📄 ePaper
Sunday, September 20, 2026
ADS
Home Blog Page 32

సెన్సెస్-2027 ఇండ్ల గణనకు ప్రజలు సహకరించాలి-చేగుంట తాసిల్దార్ శివప్రసాద్ పిలుపు.

0

చేగుంట,మే,9,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలం, ‘సెన్సెస్-2027’ మొదటి దశలో భాగంగా మే 11 నుండి ప్రారంభం కానున్న ఇండ్ల గణన ప్రక్రియపై చేగుంట మండలంలోని రెడ్డిపల్లి గ్రామంలో శనివారం గ్రామస్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తాసిల్దార్ శివప్రసాద్ మాట్లాడుతూ, గణన కోసం వచ్చే ఎనిమరేటర్లకు ప్రజలు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించాలని కోరారు. ఈ ప్రక్రియకు ప్రభుత్వ పథకాలకు ఎలాంటి సంబంధం లేదని, ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దని స్పష్టం చేశారు. ముఖ్యంగా గణన సమయంలో గోప్యతా నియమాల దృష్ట్యా ఆధార్ నంబర్ గాని, ఓటీపీ గాని చెప్పవలసిన అవసరం లేదని, కేవలం ఇంటి నంబరు, ఇంటికి సంబంధించిన వివరాలు మాత్రమే తెలపాలని సూచించారు. అలాగే ప్రజలు స్వయంగా ‘సెల్ఫ్ ఎనిమరేషన్’ చేసుకునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఓ భూమేష్, సర్పంచ్ నర్సింహా, ఉపసర్పంచ్ స్వామి, పంచాయతీ సెక్రటరీలు, వార్డు మెంబర్లు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అదేవిధంగా, మండలంలోని ప్రతి ఓటరు తమ ఓటర్ మ్యాపింగ్, ప్రోజెనీ వివరాలను తప్పనిసరిగా పూర్తి చేయించుకోవాలని తాసిల్దార్ సూచించారు. ప్రస్తుతం ఈ కార్యక్రమం బూత్ స్థాయి అధికారుల ( బి ఎల్ వో ) ద్వారా నిర్వహించబడుతోందని, వివరాలు అందించని యెడల భవిష్యత్తులో ఓటు తొలగించబడే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. ప్రజాప్రతినిధులు, పత్రికా మిత్రులు ఈ విషయాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

చేగుంట లోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో రక్షణ ఏర్పాట్లు.

0

చేగుంట,మే,9,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండల కేంద్రంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ సంరక్షణకు,భక్తులను ఇబ్బంది పెడుతున్న కోతుల బెడదను నివారించేందుకు స్థానిక శ్రీ వెంకటేశ్వర మెడికల్ హాల్ యాజమాన్యం గొప్ప మనసు చాటుకున్నారు. శ్రీమతి చొల్లేటి సుజాత కృష్ణమూర్తి కుటుంబం ఆలయ భద్రత దృష్ట్యా అవసరమైన రక్షణ ఏర్పాట్లను తమ సొంత ఖర్చులతో ఏర్పాటు చేయించారు. ఆలయ పరిసరాల్లో భక్తులకు ఇబ్బంది కలగకుండా, కోతుల నుండి ఉపశమనం పొందేలా ఈ సౌకర్యాలను కల్పించారు. ఇందుకు సంబంధించిన పూర్తి ఖర్చును శ్రీ వెంకటేశ్వర మెడికల్ హాల్ కుటుంబ సభ్యులే భరించారు. దైవ కార్యాల పట్ల వారు చూపిస్తున్న చొరవను, వారి సేవా గుణాన్ని ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు ప్రత్యేకంగా అభినందించారు. స్వామి వారి కృప ఆ కుటుంబంపై ఎల్లవేళలా ఉండాలని వారు ఆకాంక్షించారు.

చేగుంటలో ఘనంగా మన్యం వీరుడు అల్లూరిసీతారామరాజు వర్ధంతి:

0

పూలమాలలు వేసి నివాళులర్పించిన నాయకులు

చేగుంట,మే,7,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలం, భారత స్వాతంత్ర్య సమరయోధుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతిని పురస్కరించుకుని చేగుంట మండల కేంద్రంలోని స్థానిక గాంధీ చౌరస్తా వద్ద నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉప సర్పంచ్ రఫీ మాట్లాడుతూ, అల్లూరి సీతారామరాజు విశాఖపట్నం జిల్లా పాండ్రంగి (జూలై 4, 1897). జన్మించారు. ఆయన గిరిజనుల హక్కుల కోసం బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా అగ్గిపిడుగులా పోరాడిన గొప్ప దేశభక్తుడు అల్లూరి అని కొనియాడారు. కేవలం 25 ఏళ్ల చిన్న వయసులోనే వేలాది మంది గిరిజనులను ఏకం చేసి, విల్లులు, బాణాలు, నాటు తుపాకులతో బ్రిటిష్ పోలీస్ స్టేషన్లపై దాడులు చేస్తూ వారి వెన్నులో వణుకు పుట్టించారని గుర్తు చేశారు. 1924 మే 7న బ్రిటిష్ వారు ఆయన్ను మోసపూరితంగా పట్టుకుని కాల్చి చంపిన రోజని, అందుకే ఏటా ఈ రోజున ఆయన బలిదానాన్ని స్మరించుకుంటామని తెలిపారు. ప్రధానమంత్రి మోదీ సైతం అల్లూరి సేవలను గుర్తించి భీమవరంలో 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించడం గర్వకారణమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చేగుంట ఉపసర్పంచ్ మొహమ్మద్ రఫీ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు సండ్రుగు సతీష్, గ్రామ పాలకవర్గ సభ్యులు సాయిబాబా, సుఖేందర్, రవి, గ్రామస్తులు లింగం, శ్రీను, సోమ సత్యనారాయణ, విష్ణు తదితరులు పాల్గొన్నారు.

మాజీ పోలీసు అధికారుల సమక్షంలో ఘనంగా రాహుల్ – అపూర్వ వివాహ విందు.

0

(స్పెషల్ కరస్పాండెంట్)
హైదరాబాద్,మే,7,మెదక్ టుడే న్యూస్:
మాజీ అదనపు పోలీసు అధికారి యోహాన్ కుమారుడు రాహుల్ మరియు అపూర్వల వివాహ విందు కార్యక్రమం మంగళవారం హైదరాబాద్ యూసుఫ్‌గూడలోని శౌర్య కన్వెన్షన్ లో అత్యంత వైభవంగా జరిగింది. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, అభిమానులు, మాజీ పోలీసు అధికారులు పెద్ద సంఖ్యలో హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ఈ వేడుకకు 1976 సంవత్సరపు బ్యాచ్‌కు చెందిన మాజీ ఉప నిరీక్షకులు, మాజీ పోలీసు అధికారులు విశేషంగా హాజరుకావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ మాజీ సహచరులు ఆత్మీయంగా కలుసుకొని ఆనందాన్ని పంచుకున్నారు. కార్యక్రమం ఆప్యాయ వాతావరణంలో కొనసాగింది.
ఈ వివాహ విందుకు మాజీ అదనపు పోలీసు అధికారులు సత్యనారాయణ, విజయ్ సింగ్, సంతోష్ కరుణాకర్, హరిచందర్, రాజరత్నం, సీహెచ్ రాజయ్య, బి. నరసింహులు, రంగారావు, హీరామంజి, పండరీనాథ్, వజ్రలింగం, మాజీ ఉప పోలీసు అధికారులు పీఎస్‌ఎస్‌పీ బాబు, రామకిషన్ రావు, ప్రముఖ సామాజికవేత్త డాక్టర్ కొమ్ము వెంకన్న బాబు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాజీ అదనపు పోలీసు అధికారి విజయ్ సింగ్ మాట్లాడుతూ, “రాహుల్ – అపూర్వల దాంపత్య జీవితం ఆనందంగా, ఆదర్శవంతంగా కొనసాగాలని కోరుకుంటున్నాను. పరస్పర గౌరవం, ప్రేమాభిమానాలు, కుటుంబ విలువలతో ముందుకు సాగితే జీవితంలో ఉన్నత స్థానాలను చేరుకుంటారు” అని ఆశీర్వదించారు.
అలాగే సామాజికవేత్త డాక్టర్ కొమ్ము వెంకన్న బాబు మాట్లాడుతూ, “కుటుంబ వేడుకలు బంధాలను మరింత బలపరుస్తాయి. నూతన దంపతులు సుఖసంతోషాలతో జీవిస్తూ సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షిస్తున్నాను” అని తెలిపారు.
వివాహ విందు సందర్భంగా అతిథులకు ప్రత్యేక భోజన వసతులు ఏర్పాటు చేయగా, హాజరైన వారంతా నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు. కుటుంబ సభ్యుల సమన్వయంతో కార్యక్రమం అత్యంత విజయవంతంగా ముగిసింది.

జయలక్ష్మి నగర్‌లో తైక్వాండో అకాడమీ ప్రారంభం.

0

ముఖ్య అతిథిగా హాజరైన బిఆర్ఎస్ యువ నాయకులు తుమ్మల రుష్వంత్ రెడ్డి

అమీన్ పూర్,మే,6,(మెదక్ టుడే ) న్యూస్ ప్రతినిధి:సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం పరిధిలోని అమీన్పూర్ జిహెచ్ఎంసి పరిధిలోని బీరంగూడ డివిజన్ పరిధిలోని జయలక్ష్మి నగర్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన తైక్వాండో అకాడమీ గురువారం ఘనంగా ప్రారంభమైంది. మాజీ కౌన్సిలర్ బోయిని బాలమణి బాలరాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ అకాడమీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి అమీన్‌పూర్ బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు తుమ్మల రుష్వంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, అకాడమీని ప్రారంభించారు.ఈ సందర్భంగా రుష్వంత్ రెడ్డి మాట్లాడుతూ.. నేటి సమాజంలో ఆత్మరక్షణ విద్యల అవసరం ఎంతో ఉందని, ముఖ్యంగా విద్యార్థులకు, యువతకు తైక్వాండో వంటి క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణను అలవరుస్తాయని పేర్కొన్నారు. స్థానికంగా ఇలాంటి అకాడమీలను ఏర్పాటు చేయడం వల్ల యువతలో ఉన్న ప్రతిభను వెలికితీయవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో తైక్వాండో అకాడమీ మాస్టర్ హేమంత్, బోయిని సందీప్, సుశాంత్ రెడ్డి, సతీష్ రెడ్డి, అకాడమీ నిర్వాహకులు, స్థానిక నాయకులు మరియు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

అమీన్‌పూర్‌లో సీలింగ్ భూముల పరిశీలన: ఆక్రమణలు ఉంటే కూల్చివేతలు తప్పవు – ఎమ్మార్వో వెంకటేష్.

0

అమీన్‌పూర్,మే,6,(మెదక్ టుడే) న్యూస్ ప్రతినిధి)సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండల పరిధిలోని ప్రభుత్వ సీలింగ్ భూములను రెవెన్యూ అధికారులు బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మండలంలోని సర్వే నంబర్లు 1042, 1043 లో ఉన్న సీలింగ్ భూములను అమీన్‌పూర్ తహసీల్దార్ వెంకటేష్, ఆర్.ఐ సంగీత, సర్వేయర్ మరియు ఇతర రెవెన్యూ సిబ్బందితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మార్వో వెంకటేష్ మాట్లాడుతూ గతంలోనే నోటీసులు: సదరు సర్వే నంబర్లలోని భూములపై గతంలోనే ఆక్రమణదారులకు నోటీసులు జారీ చేసినట్లు ఎమ్మార్వో తెలిపారు.సర్వే నిర్వహణ: ఈ భూములకు సంబంధించి త్వరలోనే పూర్తిస్థాయి సర్వే ప్రక్రియను ముగించి, హద్దులను నిర్ణయిస్తామని అధికారులు పేర్కొన్నారు.
కఠిన చర్యలు: సర్వే పూర్తయిన వెంటనే పోలీసు బందోబస్తు మధ్య ఆక్రమణలను తొలగించి, ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంటామని ఎమ్మార్వో హెచ్చరించారు.ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని, ఎవరూ కూడా ఇటువంటి ప్రయత్నాలు చేయవద్దని ఈ సందర్భంగా అధికారులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది మరియు సర్వే అధికారులు పాల్గొన్నారు.

పసికందును అమ్మేసిన నర్సు.

0

-తల్లిని మోసం చేసి రూ.లక్షన్నరలకు నవజాత శిశువు విక్రయం

-మెదక్ జిల్లాలో అమానుష ఘటన కలకలం

-ఐదు రోజుల తర్వాత బతికే ఉందన్న విషయం తెలుసుకున్న తల్లి

మెదక్,మే-6,(మెదక్ టుడే న్యూస్ ప్రతినిధి):మెదక్ జిల్లాలో మానవత్వానికే మచ్చ తెచ్చే దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పుట్టిన పసికందు చనిపోయిందని ఓ తల్లిని నమ్మించిన నర్సు, ఆ నవజాత శిశువును రహస్యంగా రూ.1.50 లక్షలకు విక్రయించిన ఘటన సంచలనం సృష్టించింది. ఈ అమానుష ఘటన బయటపడటంతో జిల్లా వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పాపన్నపేట మండలం లక్ష్మీనగర్ తండాకు చెందిన నస్రా ఫాతిమా ప్రస్తుతం సికింద్రాబాద్ మౌలాలిలో నివసిస్తోంది. ఏడు నెలల గర్భిణిగా ఉన్న ఆమె ఇటీవల అత్తగారింటికి వెళ్లేందుకు మెదక్‌కు వచ్చింది. ఈ సమయంలో బస్టాండ్ వద్ద చేతిలో ఉన్న చిప్స్ ప్యాకెట్‌పై కోతులు దాడి చేయడంతో తీవ్ర భయానికి గురైంది. అక్కడున్న స్నేహితురాలు వెంటనే ఫాతిమాను సమీప ఆసుపత్రికి తరలించింది. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించగా ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న అక్తరీ బేగం అత్యంత దారుణంగా వ్యవహరించినట్లు ఆరోపణలు వెలువడ్డాయి.పుట్టిన పాప చనిపోయిందని ఫాతిమాను నమ్మించిన నర్సు, ఆమె దుఃఖంలో ఉండగానే శిశువును రహస్యంగా విక్రయించినట్లు సమాచారం. నర్సు మాటలను నమ్మిన బాధితురాలు కన్నీటి పర్యంతమై మూడు రోజుల తర్వాత ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్లిపోయింది. కానీ ఐదు రోజుల తర్వాత ఓ వ్యక్తి ద్వారా తన పాప బతికే ఉందన్న సమాచారం ఫాతిమాకు చేరింది. దీంతో ఒక్కసారిగా షాక్‌కు గురైన ఆమె వెంటనే పోలీసులను ఆశ్రయించి నర్సుపై ఫిర్యాదు చేసింది.

  • ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. శిశువును ఎవరికీ విక్రయించారు?, ఈ వ్యవహారంలో ఇంకా ఎవరెవరు ఉన్నారు?, ఆసుపత్రి సిబ్బంది పాత్ర ఉందా? అనే కోణాల్లో విచారణ కొనసాగుతోంది. పుట్టిన బిడ్డ కోసం తల్లి విలపిస్తుంటే, డబ్బుల కోసం పసికందును అమ్మేయడం అమానుషమని ప్రజలు మండిపడుతున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

చేగుంట రైతు వెదిక లో వ్యవసాయ వారోత్సవాలు.

0

చేగుంట,మే,6,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండల కేంద్రంలోని రైతు వేదికలో ప్రజా పాలనలో – ప్రగతి ప్రణాళికలో 99 రోజుల ప్రణాళికలో భాగంగా చేగుంట వ్యవసాయ రైతు వేదికలో మార్కెట్ కమిటీ చైర్మన్ తాడెం వెంగళరావు అధ్యక్షతన అధ్వర్యంలో ఘనంగా రైతు వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ అవకాశాలు, బ్యాంకుల ద్వారా దీర్ఘకాలిక, స్వల్ప కాలిక పంట రుణాలు పైన రైతులకు అవగాహన కల్పించారు. రైతు శ్రేయస్సుకోసం రైతు సంక్షేమాన్ని ప్రజలకు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ అని కొనియాడారు. కార్యక్రమంలో తాసిల్దార్ శివప్రసాద్, ఎంపీడీఓ చిన్నారెడ్డి,అగ్రికల్చర్ ,డిసిసిబీ బ్యాంక్ మేనేజర్ శశికాంత్ రెడ్డి, వ్యవసాయ సైంటిస్ట్ డాక్టర్ రామాంజనేయులు, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్,మార్కెట్ కమిటీ డైరెక్టర్ లు, మొహమ్మద్ ముజామిల్, అన్నం ఆంజనేయులు, స్టాలిన్ నర్సిములు, బాల్ రెడ్డి, కాషాబోయిన శ్రీనివాస్, రఫీ, కుర్మ లక్ష్మి, లక్ష్మణ్ , రమేష్ , వివిధ గ్రామాల సర్పంచ్ లు ,క్లస్టర్ వ్యవసాయ అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి తాసిల్దార్ శివప్రసాద్.

0

చేగుంట,మే,6,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలంలోని మక్క రాజుపేట సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని చేగుంట తాసిల్దార్ శివప్రసాద్ పరిశీలించారు. వారు మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు జరిపించాలని, రైతులు అధైర్య పడవద్దు ప్రతి గింజ కొనుగోలు చేస్తాము అని అన్నారు. ఇక్కడికి వచ్చిన రైతులకు అవసరమైన వసతులు కల్పించాలని వారు అన్నారు.

అత్యాషాకు వెళ్ళి ఆర్థికంగా నష్టపోవద్దు,సైబర్ నేరాల నివారణలో అవగాహనే ముఖ్యం-పాపన్న పేట ఎస్ ఐ శ్రీనివాస్ గౌడ్..

0

పాపన్నపేట,మే,6,మెదక్ టుడే న్యూస్: అత్యషకు వెళ్ళి ఆర్థికంగా నష్ట పోవద్దని సైబర్ నేరాలు రోజురోజుకుపెరిగిపోతున్నాయని రైతులు, ప్రజలు అప్రమత్తం గా ఉండాలని పాపన్న పేట ఎస్ ఐ శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బుధవారం మండల కేంద్రమైన పాపన్న పేట సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న 99 రోజుల ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా, మెదక్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రైతులు, ప్రజలకు సైబర్ నేరాలు, దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆధునిక సాంకేతిక యుగంలో సైబర్ నేరాలు రోజురోజుకూ పెరుగుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా డిజిటల్ లావాదేవీల వినియోగంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అపరిచితుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, సందేశాలు, ఈ-మెయిల్స్, లింక్‌లను నమ్మవద్దని, వ్యక్తిగత సమాచారం, బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీ వంటి గోప్యమైన వివరాలను ఎవరికీ చెప్పకూడదని హెచ్చరించారు. అరుగాలం కష్టించి పండించిన ధాన్యం విక్రయించిన డబ్బులు రైతుల ఖాతాల లో ప్రభుత్వం వేయడంతో సైబర్ నేరగాళ్ళు లేని పోనీ లింకులు పంపుతూ, వ్యక్తిగత సమాచారం రాబట్టెందుకు కుతంత్రాలుపన్నుతారనిజాగ్రతగాఉండాలనిసూచించారు . రైతులు తెలిసి తెలియక సైబర్ నేరగాళ్ళ ఉచ్చులో పడి డబ్బులు పొడగొట్టు కుంటున్నారని. ఎవరైనా
సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేయాలని లేదా సమీప పోలీస్ స్టేషన్ ను సంప్రదించాలని సూచించారు.నకిలీ అకౌంట్ల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని కోరారు.ఈ కార్యక్రమం లో రైతులు, వివిధగ్రామాల ప్రజలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.