📄 ePaper
Tuesday, September 15, 2026
ADS
HomeTelanganaమీ సేవ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్...

మీ సేవ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ సందీప్.

📰 Generate e-Paper Clip

అధిక రుసుములు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవు:

ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ సందీప్
తప్పుగా డాక్యుమెంట్లు అప్లోడ్ చేసినా చర్యలు –

ఇకపై మీ సేవలో డిజిటల్ రశీదులు

మెదక్,జూలై,21,(మెదక్ టుడే న్యూస్ ప్రతినిధి)

మెదక్ జిల్లా పరిధిలోని పలు మీ సేవ కేంద్రాలను ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ సందీప్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా కొత్తగా అందుబాటులోకి వచ్చిన (ఎస్ ఎస్ సి) మెమో ప్రింట్, యూరియా బుకింగ్, ఫార్మర్ రిజిస్ట్రేషన్, వ్యవసాయేతర మార్కెట్ విలువ తదితర సేవలపై నిర్వాహకులకు అవగాహన కల్పించారు.ప్రతి దరఖాస్తును అత్యంత జాగ్రత్తగా నమోదు చేయాలని,తప్పుగా డాక్యుమెంట్లు అప్లోడ్ చేస్తే సంబంధిత ఆపరేటర్లపై చర్యలు తప్పవని హెచ్చరించారు.సాంకేతిక సమస్యలు ఎదురైతే వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు.కులం,ఆదాయం, నివాసం, జనన, మరణం, కుటుంబ సభ్యుల ధ్రువీకరణ పత్రం, నేటివిటీ, గ్యాప్, నాన్-క్రీమీ లేయర్ వంటి సర్టిఫికెట్లను అవసరమైనన్ని సార్లు పొందే అవకాశం ఉందని పేర్కొన్నారు.ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం మీ సేవ కేంద్రాలు పనిచేయాలని, ఆపరేటర్లు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండి మీ సేవ, భూభారతి సహా అన్ని ఆన్‌లైన్ సేవలను సమర్థంగా అందించాలని సూచించారు. ప్రతి కేంద్రంలో సిటిజన్ చార్టర్, భూభారతి ఫ్లెక్సీలు, మీ సేవ లోగోతో పాటు తహసీల్దార్, ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్, పరిష్కారం కాల్ సెంటర్ ఫోన్ నంబర్లు తప్పనిసరిగా ప్రదర్శించాలని ఆదేశించారు.కళ్యాణలక్ష్మి,యూడీఐడీ (సదరం), జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు ఎలాంటి పొరపాట్లు లేకుండా నమోదు చేయాలని సూచించారు.ప్రజల పట్ల మర్యాదగా వ్యవహరిస్తూ నాణ్యమైన సేవలు అందించాలని ఆపరేటర్లకు సూచించారు.నిర్ణీత ప్రభుత్వ రుసుము కంటే అధికంగా వసూలు చేసినట్లు తేలితే సంబంధిత మీ సేవ కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ స్పష్టం చేశారు.రాష్ట్ర ప్రభుత్వం పౌర సేవలను మరింత పారదర్శకంగా, వేగవంతంగా అందించేందుకు పూర్తి ఆన్‌లైన్, కాగిత రహిత విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చిందని తెలిపారు.గ్రామ పాలనాధికారులు,రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ల కోసం ప్రత్యేక మొబైల్ యాప్‌లు అందుబాటులోకి వచ్చాయని,దరఖాస్తుల స్వీకరణ నుంచి తహసీల్దార్ ఆమోదం వరకు మొత్తం ప్రక్రియ ఆన్‌లైన్‌లోనే కొనసాగుతుందని వివరించారు.కొత్త విధానం ప్రకారం మీ సేవ కేంద్రంలో దరఖాస్తు చేసిన వెంటనే దరఖాస్తుదారుడి నమోదిత మొబైల్ నంబర్‌కు డిజిటల్ రశీదు (ఎస్ఎంఎస్) అందుతుందని తెలిపారు. అందులో అప్లికేషన్ నంబర్, సేవ పేరు, చెల్లించిన ఫీజు వివరాలు, రశీదు డౌన్‌లోడ్ చేసుకునేందుకు హైపర్‌లింక్ ఉంటుందని చెప్పారు.ఆ లింక్ ద్వారా రశీదును ఎప్పుడైనా వీక్షించవచ్చు, డౌన్‌లోడ్ చేసుకోవచ్చు లేదా ప్రింట్ తీసుకోవచ్చని తెలిపారు.ఈడిజిటల్ విధానం వల్ల కాగితపు రశీదులు పోగొట్టుకునే సమస్య ఉండదని, అవసరమైతే అదే సందేశాన్ని మళ్లీ పంపించుకునే సౌకర్యాన్ని కూడా ప్రభుత్వం కల్పించిందని ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ సందీప్ వెల్లడించారు.ఈతనిఖీల్లో పలువురు మీ సేవ కేంద్రాల నిర్వాహకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular