📄 ePaper
Saturday, September 19, 2026
ADS
HomePOITICAL NEWSభూపోరాటానికి కవిత పిలుపు.

భూపోరాటానికి కవిత పిలుపు.

📰 Generate e-Paper Clip

జూలై 2న భారీ ఉద్యమం
జయశంకర్ విగ్రహం ఏర్పాటు చేయాలి
ఉద్యమకారుల హక్కుల కోసం పోరాటం

హైదరాబాద్,జూన్,2,(మెదక్ టుడే న్యూస్ ప్రతినిధి) తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బంజారాహిల్స్‌లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కల్వకుంట్ల కవిత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి తెలంగాణ అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగాలు చేసిన అమరవీరులను స్మరించుకుంటూ, తెలంగాణ ఉద్యమం మరో స్వాతంత్ర్య పోరాటాన్ని తలపించే మహత్తర ఉద్యమమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన కవిత తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పన్నెండు సంవత్సరాలు పూర్తయినా ఉద్యమ ఆశయాల సాధన ఇంకా పూర్తి కాలేదని అన్నారు. వేలాది మంది యువత, విద్యార్థులు, ఉద్యోగులు తమ భవిష్యత్తును పణంగా పెట్టి తెలంగాణ కోసం పోరాడారని, వారి త్యాగాలను తరతరాలకు గుర్తు చేసే బాధ్యత సమాజంపై ఉందన్నారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం జరిగిన ఉద్యమాన్ని ప్రతి కుటుంబం గుర్తుంచుకోవాలని, జూన్ 2ను కేవలం సెలవు రోజుగా కాకుండా ఆత్మగౌరవ దినోత్సవంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు.తెలంగాణ ఉద్యమానికి సైద్ధాంతిక పునాదులు వేసిన ప్రొఫెసర్ జయశంకర్ సేవలను ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రస్తావించిన కవిత, ఆయన విగ్రహం ఇప్పటికీ రాష్ట్ర రాజధానిలో లేకపోవడం బాధాకరమని అన్నారు. తెలంగాణ ఆలోచనకు రూపకల్పన చేసిన మహనీయుడైన జయశంకర్‌కు తగిన గౌరవం ఇవ్వాల్సిన సమయం వచ్చిందన్నారు. ఆగస్టు 6న ఆయన జయంతి నాటికి ట్యాంక్‌బండ్‌పై విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అవసరమైతే విగ్రహ నిర్మాణ వ్యయంతో పాటు నిర్వహణ బాధ్యతను కూడా తెలంగాణ జాగృతి భరిస్తుందని స్పష్టం చేశారు. ఉద్యమకారులకు ఇచ్చిన హామీల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడం దురదృష్టకరమని కవిత విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారికి గౌరవం, గుర్తింపు, సంక్షేమం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా ఈ అంశాలపై ముఖ్యమంత్రి ప్రకటన చేస్తారని ఆశించామని, కానీ అలాంటి ప్రకటన రాకపోవడం నిరాశ కలిగించిందన్నారు.ఉద్యమకారుల సమస్యలు, భూముల అంశాలపై ప్రభుత్వం స్పందించకపోతే ప్రజా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. జూలై 2న ఉప్పల్ భగాయత్‌లో భారీ భూపోరాటం నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఇది ఏ ఒక్క పార్టీ కార్యక్రమం కాదని, తెలంగాణ భవిష్యత్తు కోసం జరిగే ప్రజా ఉద్యమమని పేర్కొన్నారు. మేధావులు, విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, మహిళలు, న్యాయవాదులు, ఉద్యమకారులు, అన్ని వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. మిలియన్ మార్చ్‌ను గుర్తు చేసే స్థాయిలో ఈ భూపోరాటం జరుగుతుందని కవిత పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కనిపించిన ప్రజా చైతన్యాన్ని మరోసారి ప్రదర్శించే సమయం వచ్చిందన్నారు. అమరవీరుల కుటుంబాలకు గౌరవం, ఉద్యమకారులకు గుర్తింపు, తెలంగాణ ఆశయాల సాధన కోసం ఈ ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి వచ్చిన తర్వాత అమరవీరుల కుటుంబాలకు కోటి రూపాయల ఆర్థిక సహాయం అందిస్తామని, ఉద్యమకారులను రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములను చేస్తామని కవిత హామీ ఇచ్చారు. తెలంగాణ కోసం పోరాడిన ప్రతి ఒక్కరికీ సముచిత గౌరవం దక్కే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేస్తూ, తెలంగాణ ప్రజలందరికీ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular