ఎర్రవల్లి ఘటనపై భగ్గుమన్న పటాన్‌చెరు కాంగ్రెస్ శ్రేణులు
దేవానందం ఆధ్వర్యంలో ఘాటుగా విలేకరుల సమావేశం
కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు బేషరతుగా క్షమాపణ చెప్పాలి: కాంగ్రెస్ సీనియర్ నేత దేవానందం డిమాండ్
పటాన్‌చెరు,సెప్టెంబర్,11,(మెదక్ టుడే) న్యూస్ ప్రతినిధి.మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్ వద్ద నిరసన తెలిపిన దళితులపై బీఆర్‌ఎస్ నాయకులు ప్రదర్శించిన కుల వివక్ష, అహంకారపూరిత వైఖరిపై పటాన్‌చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. దళితులు నడిచిన ప్రదేశాన్ని పసుపు నీళ్లతో కడిగి ‘శుద్ధి’ చేయడం ప్రజాస్వామ్య సమాజంలో అత్యంత హేయమైన చర్య అని మండిపడ్డారు. పటాన్‌చెరు కాంగ్రెస్ ఇన్‌చార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ ఆదేశాల మేరకు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేవానందం ఆధ్వర్యంలో పటాన్‌చెరు పట్టణంలో విస్తృత స్థాయి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేవానందం మాట్లాడుతూ… బీఆర్‌ఎస్ నాయకుల భూస్వామ్య, ఫ్యూడల్ అహంకారం ఎర్రవల్లి ఘటనతో మరోసారి బట్టబయలైందని తీవ్రంగా దుయ్యబట్టారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ దేశ పౌరులందరికీ సమాన హక్కులు, ఆత్మగౌరవం కల్పిస్తే, బీఆర్‌ఎస్ నాయకులు మాత్రం దళితులను అపవిత్రులుగా చూస్తూ, రాక్షస జాతితో పోల్చడం క్షమించరాని నేరమన్నారు. ఒక వర్గాన్ని ఇలా బహిరంగంగా కించపరచడం వారి నీచ మనస్తత్వానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎర్రవల్లి ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు వెంటనే రాష్ట్ర దళిత సమాజానికి బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని దేవానందం డిమాండ్ చేశారు. అలాగే రాజ్యాంగబద్ధమైన శాసనసభ స్పీకర్ స్థానంలో ఉన్న గడ్డం ప్రసాద్ కుమార్‌పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ చేసిన వ్యాఖ్యలను వారు తీవ్రంగా ఖండించారు. దళిత వర్గానికి చెందిన నాయకుడు అత్యున్నత సభాధ్యక్ష స్థానంలో ఉండటాన్ని బీఆర్‌ఎస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని ఆరోపించారు. భవిష్యత్తులో దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ప్రవర్తిస్తే తెలంగాణవ్యాప్తంగా దళిత, ప్రజా సంఘాలను ఏకం చేసి బీఆర్‌ఎస్ నాయకులను రోడ్లపై తిరగనివ్వకుండా పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ విలేకరుల సమావేశంలో పటాన్‌చెరు మార్కెట్ కమిటీ చైర్మన్ శివానందం, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సుధాకర్ గౌడ్, తెల్లాపూర్ మాజీ కౌన్సిలర్ భరత్, నాయకులు యాదగిరి, జైశ్రీ, మహేష్, శంకరయ్య, పీటర్, నాగేష్, చంద్రయ్య, ప్రవీణ్, రవి, సందీప్, హనుమంతు, కిరణ్, శ్రీను, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

