పాపన్నపేట ప్రభుత్వ ఆస్పత్రి దయనీయ పరిస్థితి
పైకప్పు పెచ్చులు ఊడి.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వైద్యం! నూతన ఆసుపత్రికి మోక్షం ఎప్పుడో.
పాపన్నపేట,జూలై 10 (మెదక్ టుడే న్యూస్): మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) భవనం అధ్వాన్న స్థితికి చేరింది. ఆస్పత్రి గదుల పైకప్పు పెచ్చులు ఊడిపోతుండగా, వర్షపు నీరు కారడంతో గోడలు తడిసి శిథిలావస్థకు చేరుకున్నాయి. దీంతో వైద్యం కోసం వచ్చే రోగులు, గర్భిణీలు, చిన్నారులు భయాందోళనకు గురవుతున్నారు.
భవనంలోని గదుల సీలింగ్‌లో పెద్ద ఎత్తున పగుళ్లు ఏర్పడటంతో ఎప్పుడు పెచ్చులు ఊడి పడతాయోననే ఆందోళన నెలకొంది. కొన్ని చోట్ల ఫ్యాన్ సమీపంలోనే పైకప్పు దెబ్బతినడం మరింత ప్రమాదకరంగా మారింది. అయినప్పటికీ ఇదే భవనంలో వైద్య సేవలు కొనసాగుతుండటం పట్ల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రతిరోజూ వందలాది మంది ప్రజలు చికిత్స కోసం వచ్చే ఈ ప్రభుత్వ ఆస్పత్రికి తక్షణమే మరమ్మతులు చేపట్టి, అవసరమైతే కొత్త భవనం నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు. ప్రమాదం జరిగే వరకు అధికారులు వేచి చూడకుండా వెంటనే స్పందించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.



