బాలికల, మహిళలపై నేరాలకు పాల్పడేవారిపై చట్టం కఠినంగా వ్యవరిస్తుంది
పోక్సో కేసులో నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన పోలీసు సిబ్బందిని అభినంధించిన మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు, ఐపీఎస్
మెదక్,జూలై,20,(మెదక్ టుడే న్యూస్ ప్రతినిధి)
మెదక్ జిల్లా హవేళి ఘనపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 17 సంవత్సరాల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడు చాకలి ప్రవీణ్ (21 సంవత్సరాలు)కు జిల్లా పొక్సో ఫాస్ట్ ట్రాక్ కోర్టు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.5,000 జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించినట్లు మెదక్ జిల్లా ఎస్పీ. డి. వి. శ్రీనివాస రావు ఐపీఎస్ తెలిపారు.కేసు వివరాలు వెల్లడిస్తూ.నిందితుడు చకలి ప్రవీణ్ అదే ప్రాంతానికి చెందిన 17 సంవత్సరాల ఇంటర్మీడియట్ చదువుతున్న బాలికను బెదిరించి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. దాని ఫలితంగా బాధిత బాలిక గర్భం దాల్చింది. తన మేనత్త వద్ద ఉంటూ చదువుకుంటున్న బాలికను, ఆమె స్నానం చేస్తున్న సమయంలో కడుపు ఎత్తుగా కనిపించడంతో అనుమానం వచ్చిన మేనత్త ప్రశ్నించగా, నిందితుడు ఇంట్లోకి వచ్చి బెదిరిస్తూ పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు బాలిక వెల్లడించింది.కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు హవేళి ఘనపూర్ పోలీస్ స్టేషన్‌లో అప్పటి ఏఎస్సై డి. విఠల్ కేసు నమోదు చేశారు. అనంతరం అప్పటి దర్యాప్తు అధికారులు, మెదక్ రూరల్ సీఐ పలవెల్లి, అప్పటి మెదక్ డియస్పి కృష్ణ మూర్తి కేసును సమగ్రంగా దర్యాప్తు చేసి, అవసరమైన సాక్ష్యాధారాలను సేకరించి న్యాయస్థానంలో ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. కేసు విచారణ సందర్భంగా భరోసా లీగల్ అడ్వైజర్ శ్వేత బాధిత బాలికకు సాక్ష్యం చెప్పే విషయంలో అవసరమైన సహకారం అందించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ బాలయ్య బలమైన వాదనలు వినిపించారు. సమర్పించిన సాక్ష్యాధారాలను పరిశీలించిన జిల్లా పొక్సో ఫాస్ట్ ట్రాక్ కోర్టు న్యాయమూర్తి నిందితుడిపై అభియోగాలు రుజువైనట్లు నిర్ధారించి, 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.5,000 జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించిన్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ కేసులో లైజనింగ్ అధికారి ఎస్సై విఠల్, కానిస్టేబుల్ కృష్ణ, సీడీవో గౌస్ కేసు లో సహకరించారు. ఈ కేసులో శిక్ష పడేవిధంగా కృషి చేసిన సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు, ఐపీఎస్ మాట్లాడుతూ,బాలికలు, మహిళలపై లైంగిక నేరాలకు పాల్పడే వ్యక్తుల పట్ల చట్టం ఎలాంటి ఉపేక్ష చూపదని, పోక్సో చట్టం కింద నమోదయ్యే కేసుల్లో మెదక్ జిల్లా పోలీసులు వేగవంతమైన, శాస్త్రీయ దర్యాప్తు చేపట్టి నిందితులకు కఠిన శిక్షలు పడేలా అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. చిన్నారులపై ఎలాంటి లైంగిక వేధింపులు, దాడులు లేదా దుర్వినియోగం జరిగినా భయపడకుండా వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు, డయల్-100, డయల్-112 లేదా 1098 చైల్డ్ హెల్ప్‌లైన్కు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు. బాధిత చిన్నారులకు చట్టపరమైన, వైద్యపరమైన మరియు మానసిక సహాయాన్ని అందించేందుకు పోలీసు శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని జిల్లా ఎస్పీ తెలిపారు.

