•నిబంధనలకు విరుద్ధంగా విక్రయించినా, వినియోగించినా కఠిన చట్టపరమైన చర్యలు.
•కరెంట్ స్థంభాలకు దూరంగా, సురక్షితమైన మైదానాల్లోనే గాలిపటాలు ఎగురవేయాలి.
•జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు.
మెదక్,జనవరి,6,మెదక్ టుడే న్యూస్:ప్రతినిధి,జిల్లా పరిధిలో చైనా మంజాను పూర్తిగా నిషేధించినట్లు జిల్లా ఎస్పీ శ్రీ డి.వి. శ్రీనివాస రావు, ఐపీఎస్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విధించిన నిషేధాన్ని ఉల్లంఘిస్తూ చైనా మంజాను విక్రయించినా, వినియోగించినా లేదా దాని వల్ల ఎవరికైనా ప్రమాదం సంభవించినట్లయితే సంబంధిత వ్యక్తులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.రాబోయే సంక్రాంతి పండుగను దృష్టిలో ఉంచుకుని, జిల్లా వ్యాప్తంగా సీసీఎస్ పోలీసుల, స్థానిక పోలీస్ల ఆధ్వర్యంలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. నైలాన్, సింథటిక్ దారాలతో తయారయ్యే చైనా మంజా పర్యావరణానికి తీవ్ర హాని కలిగించడంతో పాటు, ప్రజలు, వాహనదారులు, పక్షులకు ప్రాణాపాయం కలిగించే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.గతంలో చైనా మంజాతో గాలిపటాలు ఎగురవేసే సమయంలో అనేక ప్రమాదాలు చోటు చేసుకున్నాయని, కొన్నిసార్లు గాలిపటాలు ఎగురవేసే వ్యక్తులు కూడా తీవ్రంగా గాయపడిన ఘటనలు నమోదయ్యాయని తెలిపారు. ఈ కారణాల దృష్ట్యానే చైనా మంజాపై సంపూర్ణ నిషేధం విధించబడిందని జిల్లా ఎస్పీ వివరించారు.చైనా మంజా విక్రయాలు, వినియోగంపై పర్యావరణ పరిరక్షణ చట్టం–1986 ప్రకారం కేసులు నమోదు చేయనున్నట్లు తెలిపారు. జిల్లా పరిధిలో ఎక్కడా చైనా మంజా విక్రయాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.ప్రజలు చైనా మంజాను ఉపయోగించకుండా, ఎవరికీ హాని కలగని సాధారణ దారాలతో గాలిపటాలు ఎగురవేయాలని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు.గాలిపటాలు ఎగురవేసే వారు తప్పనిసరిగా కరెంట్ స్థంభాలకు దూరంగా, మైదానాలు వంటి సురక్షితమైన ప్రదేశాల్లోనే గాలిపటాలు ఎగురవేయాలని సూచించారు. అలాగే బిల్డింగులపై నుంచి గాలిపటాలు ఎగురవేసే వారు తగిన భద్రతా చర్యలు పాటించి అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని కోరారు.ఎవరైనా చైనా మంజా విక్రయాలు లేదా వినియోగం గమనించినట్లయితే వెంటనే డయల్–100కు సమాచారం ఇవ్వాలని జిల్లా ఎస్పీ ప్రజలను కోరారు.
