తూప్రాన్‌లో ఛాతినొప్పితో కుప్పకూలి.. మేడ్చల్‌లో చికిత్స పొందుతూ కన్నుమూత
సహచరుల్లో విషాదం.. నేడు మల్కాపూర్‌లో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు
మెదక్,సెప్టెంబర్,8,మెదక్ టుడే న్యూస్:విధి నిర్వహణకు వెళ్లిన మెదక్ జిల్లా ఏఆర్ హెడ్‌క్వార్టర్స్ క్యూఆర్టీలో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ ఆనందం (54) ఆకస్మికంగా మృతి చెందారు. మంగళవారం చెక్‌పోస్ట్ విధుల నిమిత్తం తూప్రాన్ వెళ్లిన ఆయనకు అక్కడ ఛాతినొప్పి రావడంతో ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లారు.వైద్యులు ఈసీజీ నిర్వహిస్తున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో ఆస్పత్రి సిబ్బంది వెంటనే సీపీఆర్ చేశారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం మేడ్చల్‌లోని మెడినోవా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆనందం మృతి చెందారు.ఆనందం అందరితో కలిసిమెలిసి, సరదాగా ఉంటూ సహచరులతో ఆత్మీయంగా మెలిగేవారని తోటి సిబ్బంది తెలిపారు. విధుల్లో చురుగ్గా ఉంటూ సహచరులకు అందుబాటులో ఉండేవారని పేర్కొన్నారు. ఆయన మృతివార్తతో పోలీసు సిబ్బంది తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆనందంతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ పలువురు కన్నీటిపర్యంతమయ్యారు.హెడ్ కానిస్టేబుల్ ఆనందం మృతిపట్ల జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు, ఐపీఎస్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పోలీసు శాఖకు ఆనందం అందించిన సేవలను గుర్తుచేసుకున్నారు.బుధవారం ఉదయం 10 గంటలకు సంగారెడ్డి జిల్లా మల్కాపూర్ గ్రామంలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఎస్పీ తెలిపారు.

