– ఎర్రవల్లిలో బీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం
– అసెంబ్లీ వ్యూహాలపై ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం
– ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని పిలుపు
– జలాలు, రైతు సమస్యలపై పోరాటం ఉధృతం చేయాలని సూచన
సిద్దిపేట,సెప్టెంబర్,6,మెదక్ టుడే న్యూస్:కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో అన్ని రంగాల్లో విఫలమైందని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విమర్శించారు. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలో ఆయన అధ్యక్షతన జరిగిన బీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. సమావేశానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావుతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ప్రజా సమస్యలపై మరింత దూకుడుగా పోరాడాలని కేసీఆర్ పార్టీ శ్రేణులకు సూచించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన కేసీఆర్, తమ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తుందనే భయంతో కాంగ్రెస్ నాయకులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో పాలన సరిగా నిర్వహించలేకపోతున్న ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో వ్యక్తిగత విమర్శలకు ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపిస్తూ, ప్రజా సమస్యలపై చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజాస్వామ్య వేదికలను రాజకీయ ఆరోపణలకు ఉపయోగించడం సరికాదని పేర్కొన్నారు. రాష్ట్రంలోని రైతులు, సాగునీటి సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కేసీఆర్ ఆరోపించారు. కృష్ణా, గోదావరి జలాల అంశంపై బీఆర్ఎస్ సభ్యులు ఉధృతంగా పోరాడాలని సూచించారు. రైతులకు అవసరమైన సాగునీరు అందక ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఈ అంశాన్ని అసెంబ్లీలో బలంగా ప్రస్తావించాలని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాల్లో ప్రభుత్వం వైఖరిని ప్రజల ముందుంచాలని పిలుపునిచ్చారు.
కాలేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి వంటి కీలక ప్రాజెక్టుల నిర్వహణపై కూడా కేసీఆర్ ప్రశ్నలు లేవనెత్తారు. ఈ ప్రాజెక్టుల సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించడం లేదని ఆరోపించారు. ప్రాజెక్టుల పనితీరు, నీటి వినియోగం, సాగునీటి పంపిణీ అంశాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర అభివృద్ధికి కీలకమైన ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు.
అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలకు పార్టీ సభ్యులంతా తప్పనిసరిగా హాజరుకావాలని కేసీఆర్ సూచించారు. ప్రతి చర్చలో చురుగ్గా పాల్గొని ప్రజల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని ఆదేశించారు. కాంగ్రెస్, బీజేపీ విధానాలను ఉభయసభల్లో ఎండగట్టాలని, ప్రజలకు సంబంధించిన అంశాలను ప్రధానంగా ప్రస్తావించాలని అన్నారు. సభల్లో బీఆర్ఎస్ వైఖరి ప్రజా ప్రయోజనాలకే అంకితమై ఉండాలని స్పష్టం చేశారు. అసెంబ్లీలో ప్రజల అజెండానే బీఆర్ఎస్ అజెండా కావాలని కేసీఆర్ పేర్కొన్నారు. నిరుద్యోగం, రైతు సమస్యలు, సాగునీరు, సంక్షేమ పథకాలు, ఆర్థిక పరిస్థితి వంటి అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని పార్టీ సభ్యులకు సూచించారు.రానున్న సమావేశాల్లో ప్రజల సమస్యలను బలంగా వినిపిస్తూ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందుకు తీసుకురావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ భవిష్యత్ కార్యాచరణ, రాజకీయ పరిస్థితులు, అసెంబ్లీ వ్యూహాలపై విస్తృతంగా చర్చించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.


