దేవాలయ ఇనాం భూముల్లో ప్రైవేట్ స్కూల్ దందా?
పాపన్నపేటలో అక్రమంగా విద్యా సంస్థ నిర్వహణపై ఆరోపణలు
అధికారుల పర్యవేక్షణ ఏదీ..? అనుమతులు ఉన్నాయా అంటూ ప్రజల ప్రశ్న
స్కూల్‌లో అధిక ఫీజుల వసూళ్లపైనా విమర్శలు..సమగ్ర విచారణకు డిమాండ్
పాపన్నపేట,సెప్టెంబర్,5,మెదక్ టుడే న్యూస్:పాపన్నపేటలో దేవాలయ ఇనాం భూముల వినియోగంపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దేవాలయానికి సంబంధించిన ఇనాం భూముల్లో ప్రైవేట్ స్కూల్‌ను ఎలా నిర్వహిస్తున్నారని స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు. దేవాలయ భూములను ప్రైవేట్ విద్యా సంస్థకు వినియోగించేందుకు నిబంధనల ప్రకారం అనుమతులు ఉన్నాయా? లేదా అనే అంశంపై అధికారులు స్పష్టత ఇవ్వాలని వారు కోరుతున్నారు.ఇదిలా ఉండగా, సదరు ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థుల నుంచి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో భూముల వినియోగం,పాఠశాల నిర్వహణ, ఫీజుల వసూళ్లపై సంబంధిత అధికారులు సమగ్రంగా విచారణ చేపట్టాలని తల్లిదండ్రులు, స్థానికులు కోరుతున్నారు.దేవాలయ ఇనాం భూములు ప్రజా ప్రయోజనాలకు, దేవాలయ అవసరాలకు ఉపయోగపడాల్సి ఉండగా.. వాటిని ప్రైవేట్ సంస్థలకు వినియోగించే పరిస్థితి ఎలా ఏర్పడిందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇంతకాలం ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులు ఎందుకు దృష్టి సారించలేదని నిలదీస్తున్నారు.దేవాలయ భూముల రికార్డులను పరిశీలించి, పాఠశాల నిర్వహణకు సంబంధించిన అనుమతులు, భూమి వినియోగ హక్కులు, ఫీజుల వసూళ్లపై విచారణ జరిపి నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.ఈవ్యవహారంపై దేవాదాయ,రెవెన్యూ, విద్యాశాఖ అధికారులు స్పందించి వాస్తవాలను వెల్లడించాల్సిన అవసరం ఉందని స్థానికులు పేర్కొంటున్నారు.
(ఎపిసోడ్.1)

