మండపాల ఏర్పాటుకు ముందస్తు అనుమతి తప్పనిసరి
పటాన్‌చెరు సీఐ రవీందర్ స్పష్టీకరణ
పటాన్‌చెరు, సెప్టెంబర్,1:(మెదక్ టుడే న్యూస్ ప్రతినిధి.గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, ప్రశాంత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని పటాన్‌చెరు సీఐ రవీందర్ నిర్వాహకులకు పిలుపునిచ్చారు. రామచంద్రాపురం ఏసీపీ శ్రీనివాస్ ఆదేశాల మేరకు బుధవారం సాయంత్రం పటాన్‌చెరు లో ముదిరాజ్ సంఘం భవనంలో మండపాల నిర్వాహకులతో శాంతిభద్రతల సమన్వయ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. పటాన్‌చెరు పరిధిలో గత ఏడాది 495 మండపాలు ఏర్పాటు చేశారని, ఈ ఏడాది కూడా విగ్రహ ప్రతిష్ఠాపన చేసే నిర్వాహకులు తప్పనిసరిగా పోలీసు శాఖ నుంచి ముందస్తు అనుమతులు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రధాన రహదారులపై మండపాలు నిర్మించి ట్రాఫిక్‌కు ఆటంకం కలిగించవద్దని సూచించారు.డీజే రహితంగా ఉత్సవాలు:నవరాత్రుల్లో డీజేలకు ఎలాంటి అనుమతి లేదని సీఐ తేల్చిచెప్పారు. అధిక శబ్దం వెలువరించే ప్యాడ్ బ్యాండ్లు, మిక్సర్ల వాడకాన్ని నిషేధించామని, నిబంధనల ప్రకారం కేవలం ఒక్క స్పీకర్‌తో నడిచే మండపాలకే అనుమతి ఉంటుందని తెలిపారు. పటాన్‌చెరును డీజే రహిత ప్రాంతంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.ఈ నెల 14వ తేదీ నుంచి నిమజ్జనోత్సవాలు ముగిసేంత వరకు పట్టణంలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో ఎస్సైలు మహేశ్వర్ రెడ్డి, వినోద్, అభిమాన్ సింగ్, పోలీస్ సిబ్బందితో పాటు వివిధ గ్రామాల ఉత్సవ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.


