
అమీన్పూర్,ఫిబ్రవరి,20,(మెదక్ టుడే) న్యూస్:ప్రతినిధి.సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పరిధిలోని అమీన్పూర్లో మినీ మేడారంగా ప్రసిద్ధి చెందిన సమ్మక్క–సారలమ్మ దేవాలయంలో, ఆలయ చైర్మన్ నీలం బిక్షపతి ఆధ్వర్యంలో అమ్మవార్లకు ఒడిబియ్యం సమర్పణ మరియు అన్నదాన కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. మేడారం మహా జాతర ముగిసిన అనంతరం ప్రతి ఏటా నిర్వహించే సంప్రదాయం ప్రకారం, ఈ ఏడాది కూడా భక్తిశ్రద్ధలతో ఈ వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ నీలం బిక్షపతి తన కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం భక్తులందరికీ ఆశీస్సులు అందేలా ఒడిబియ్యం సమర్పణ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. అమ్మవార్ల దర్శనం కోసం భక్తులు పోటెత్తడంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది.అమ్మవార్ల కృప అందరికీ ఉండాలి – నీలం బిక్షపతి:కార్యక్రమం అనంతరం చైర్మన్ నీలం బిక్షపతి మాట్లాడుతూ.. “మేడారం జాతర తర్వాత అమ్మవార్లకు నైవేద్యం పెట్టి, ఒడిబియ్యం సమర్పించడం మా ఆలయ ఆనవాయితీ. లోకకళ్యాణం కోసం, భక్తులందరి చల్లని చూపు కోసం ఈ కార్యక్రమం చేపట్టాం. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదానంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం సంతోషకరం” అని తెలిపారు.పూజల అనంతరం భక్తులందరికీ ఆలయ కమిటీ తరఫున భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు, మహిళా భక్తులు మరియు అధిక సంఖ్యలో అమీన్పూర్ వాసులు పాల్గొని అమ్మవార్ల తీర్థప్రసాదాలను స్వీకరించారు.

