మూడు రోజుల్లో 6 లక్షల మందికి పైగా భక్తుల దర్శనం: ఆలయ ఈవో శశిధర్, చైర్మన్ సుధాకర్ యాదవ్.
- శాస్త్రోక్తంగా కళ్యాణ మహోత్సవం.. కన్నుల పండువగా రథోత్సవం
- విజయవంతం చేసిన అన్ని శాఖలకు, పోలీస్ యంత్రాంగానికి ధన్యవాదాలు

అమీన్ పూర్,ఫిబ్రవరి,16,(మెదక్ టుడే) న్యూస్:ప్రతినిధి,ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బీరంగూడలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఆధ్యాత్మిక వైభవంతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడవ రోజు ఆలయ ప్రాంగణంలో శ్రీ శివపార్వతుల దివ్య కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వేలాది మంది భక్తుల సమక్షంలో స్వామివారి కళ్యాణ ఘట్టాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు..
ఘనంగా కళ్యాణం – రథోత్సవం:
ఆలయ ప్రధానార్చకులు ప్రహ్లాద్ శర్మ ఆధ్వర్యంలో వేదమంత్రాల నడుమ కళ్యాణాన్ని నిర్వహించగా, ఆలయ ఈవో శశిధర్ దంపతులు, ఆలయ చైర్మన్ సుధాకర్ యాదవ్ దంపతులు మరియు ఆలయ కమిటీ సభ్యులు తమ దంపతులతో కలిసి పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని జరిపించారు. అనంతరం భక్తులందరికీ భారీ స్థాయిలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం వేళ శివపార్వతుల ఉత్సవ విగ్రహాలను సుందరంగా అలంకరించిన రథంపై ఉంచి గ్రామ పురవీధుల్లో రథోత్సవం (ఊరేగింపు) అత్యంత వైభవంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయ ఈవో శశిధర్ మరియు చైర్మన్ సుధాకర్ యాదవ్ సంయుక్తంగా మాట్లాడుతూ.. “గత మూడు రోజులుగా శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ మూడు రోజుల్లో సుమారు 5 నుంచి 6 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని తెలిపారు. ఈసారి భక్తుల రద్దీ ఊహించని విధంగా ఉన్నప్పటికీ, ప్రభుత్వంలోని అన్ని శాఖల సమన్వయంతో ఉత్సవాలను విజయవంతంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.”
పోలీస్ శాఖకు కృతజ్ఞతలు:
బ్రహ్మోత్సవాల విజయవంతానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ వారు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా భారీగా తరలివచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, ట్రాఫిక్ సమస్యలు లేకుండా అహర్నిశలు శ్రమించిన పోలీస్ శాఖ వారికి, అలాగే ఇతర ప్రభుత్వ శాఖల అధికారులకు, స్వచ్ఛంద సేవకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ మెంబర్స్, వేలాదిమంది భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
