5 లక్షల మంది భక్తులకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు – దక్షిణ కాశీలో వైభవంగా ఉత్సవాలు
అమీన్ పూర్ ఫిబ్రవరి 14:(మెదక్ టుడే) న్యూస్ ప్రతినిధి.ఆధ్యాత్మికతకు నిలయం, భక్తుల కొంగుబంగారం.. పటాన్‌చెరు నియోజకవర్గంలోని బీరంగూడ గుట్ట శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. సుమారు 1500 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ పుణ్యక్షేత్రం, భక్తుల పాలిట “తెలంగాణ శ్రీశైలం”గా విరాజిల్లుతోంది. ఈ నెల 14 నుండి 18 వరకు జరిగే ఉత్సవాలకు 5 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్న ఆలయ యంత్రాంగం, అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లను పూర్తి చేసింది.అభిషేకం చేస్తే శ్రీశైలం వెళ్ళినంత పుణ్యం!
ఈ ఆలయ విశిష్టత అనన్యం. బీరంగూడ స్వామివారికి అభిషేకం చేస్తే శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకున్నంత ఫలితం దక్కుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఐదవ శతాబ్దంలో బృగు మహర్షి స్వయంగా ఇక్కడ తపస్సు చేసి శివలింగాన్ని ప్రతిష్టించారని ఆలయ చరిత్ర చెబుతోంది. ఇక్కడి రావి మరియు మర్రి చెట్టుకు 300 ఏళ్లకు పైగా చరిత్ర ఉండటం విశేషం.
అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు.
ఆలయ చైర్మన్ బైసా సుధాకర్ యాదవ్, ఈవో శశిధర్ ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో భక్తులకు సౌకర్యాలు కల్పిస్తున్నారు:
ట్రాఫిక్ & పోలీస్: ట్రాఫిక్ డీసీపీ, డీఎస్పీల పర్యవేక్షణలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 4-5 లక్షల మంది వస్తున్నారు కాబట్టి పార్కింగ్ మరియు క్యూ లైన్ల వద్ద ఎక్కడా ఇబ్బంది కలగకుండా సీసీ కెమెరాల నిఘా ఉంచారు.రెవెన్యూ & మున్సిపల్: అమీన్‌పూర్ ఎంఆర్వో వెంకటేష్, జీహెచ్‌ఎంసీ డీసీ ప్రదీప్ కుమార్ ఆధ్వర్యంలో పారిశుధ్యం, నీడ కోసం షెడ్లు మరియు తాగునీటి సౌకర్యం కల్పించారు.
ఆర్టీసీ: భక్తుల రద్దీ దృష్ట్యా వివిధ ప్రాంతాల నుండి ప్రత్యేక బస్సులను నడుపుతున్నారు.
ఉత్సవాల ముఖ్య ఘట్టాలు
ఫిబ్రవరి 14: అఖండ దీపారాధనతో బ్రహ్మోత్సవాల శ్రీకారం.
ఫిబ్రవరి 15 (శివరాత్రి): అర్ధరాత్రి 12 గంటలకు లింగోద్భవ కాల రుద్రాభిషేకం.
ఫిబ్రవరి 16 (సోమవారం): ఉదయం 10:45కు స్వామివారి కళ్యాణం, సాయంత్రం రథోత్సవం.
ఫిబ్రవరి 18: పూర్ణాహుతితో ఉత్సవాల ముగింపు.
ప్రత్యేక ఆకర్షణ – కాలభైరవ, హనుమంతుని దర్శనం
ఈ క్షేత్రంలో మల్లికార్జున స్వామితో పాటు భ్రమరాంబ అమ్మవారు, గణపతి, సుబ్రహ్మణ్య స్వామి దర్శనమిస్తారు. ఇక్కడి కాలభైరవ స్వామికి అమావాస్య రోజున గుమ్మడికాయ దీపాలు వెలిగిస్తే భూమి వివాదాలు తొలగుతాయని, అలాగే శని దోష నివారణకు శనివారం హనుమంతుడికి ప్రదక్షిణలు చేయడం ఇక్కడి ప్రత్యేకత.
భక్తులకు విజ్ఞప్తి:
దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులు క్రమశిక్షణతో దర్శనం చేసుకోవాలని, ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నప్రసాద వితరణలో పాల్గొనాలని చైర్మన్ సుధాకర్ యాదవ్ కోరారు.
ఆలయ ఈవో శశిధర్ మాట్లాడుతూ.

“ఈ ఏడాది మహాశివరాత్రికి రికార్డు స్థాయిలో 4 నుంచి 5 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాము. భక్తుల రద్దీని క్రమబద్ధీకరించడానికి ట్రాఫిక్ డీసీపీ మరియు డీఎస్పీ సహకారంతో ప్రత్యేక క్యూ లైన్లు, పార్కింగ్ వసతులు ఏర్పాటు చేశాము. ముఖ్యంగా శివరాత్రి రోజున భక్తులకు ఇబ్బంది కలగకుండా మంచినీరు, విద్యుత్ సరఫరా నిరంతరం ఉండేలా చూస్తున్నాము. గడ్డపోతారం మున్సిపాలిటీ, అమీన్‌పూర్ రెవెన్యూ మరియు పోలీస్ శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. ఆలయ ప్రాంగణమంతా సీసీ కెమెరాల నిఘాలో ఉంటుంది” అని తెలిపారు.
ఆలయ చైర్మన్ సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ:

బీరంగూడ గుట్టను దక్షిణ కాశీగా భక్తులు కొలుస్తారు. ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే శ్రీశైలం వెళ్ళినంత పుణ్యం దక్కుతుందని ప్రతీతి. భక్తుల కోసం ఈ నెల 14 నుండి 18 వరకు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గారి సహకారంతో భక్తులందరికీ అన్నప్రసాద వితరణ, వైద్య సదుపాయాలు కూడా అందుబాటులో ఉంచాము. భక్తులు అధికారులకు, ఆలయ సిబ్బందికి సహకరించి స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరుతున్నాను. ముఖ్యంగా సోమవారం జరిగే స్వామివారి కళ్యాణ మహోత్సవం మరియు రథోత్సవానికి భక్తులు భారీగా తరలిరావాలి” అని పిలుపునిచ్చారు.


