MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 02 June 2026, 5:15 pm Digital Edition : Shiva Kumar

తెలంగాణ ఆశయాలు నెరవేరాలి.

బీజేపీ కార్యాలయంలో వేడుకలు
కాంగ్రెస్, బీఆర్ఎస్‌పై విమర్శలు
బీజేపీకి అవకాశం ఇవ్వాలి
మంత్రి బండి సంజయ్ కుమార్

హైదరాబాద్,జూన్,2,(మెదక్ టుడే న్యూస్ ప్రతినిధి) తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి తెలంగాణ అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సాధించినప్పటికీ ఉద్యమ ఆశయాలు, లక్ష్యాలు మాత్రం పూర్తిస్థాయిలో నెరవేరలేదని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. తెలంగాణ కోసం వేలాది మంది యువకులు, విద్యార్థులు పోరాడి ప్రాణత్యాగాలు చేశారని, వారి ఆకాంక్షలకు అనుగుణంగా పాలన జరగలేదని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనపై తీవ్ర విమర్శలు చేసిన ఆయన, తెలంగాణ అమరవీరుల త్యాగాల ఫలితంగా అధికారంలోకి వచ్చిన కేసీఆర్ కుటుంబ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇచ్చారని ఆరోపించారు. రాష్ట్రాన్ని భారీ అప్పుల ఊబిలోకి నెట్టారని విమర్శించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరకుండా పోయాయని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపైనా బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. ప్రస్తుత కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని, ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుంచి వస్తున్న నిధులను కూడా సమర్థంగా వినియోగించుకోవడంలో ప్రభుత్వం విఫలమవుతోందని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ‘వికసిత్ భారత్’ లక్ష్యంతో తెలంగాణకు భారీగా నిధులు కేటాయిస్తోందని చెప్పారు. మౌలిక సదుపాయాలు, జాతీయ రహదారులు, రైల్వేలు, విద్య, వైద్యం తదితర రంగాల్లో కేంద్రం తెలంగాణ అభివృద్ధికి సహకరిస్తోందని వివరించారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రజలు కొత్త ప్రత్యామ్నాయాన్ని ఆలోచించాల్సిన సమయం వచ్చిందని బండి సంజయ్ అన్నారు. మోసం చేసిన హస్తం, ద్రోహం చేసిన కారుకు ప్రజలు ఇప్పటికే సమాధానం చెప్పారని పేర్కొన్నారు. కేంద్ర నిధులను సమర్థంగా వినియోగిస్తూ నిజాయితీతో పని చేసే బీజేపీకి ఒక అవకాశం ఇవ్వాలని తెలంగాణ సమాజాన్ని కోరారు.
తెలంగాణ అమరవీరుల ఆశయాల సాధన, రాష్ట్ర సమగ్రాభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాలు, రైతుల సంక్షేమం కోసం బీజేపీ కట్టుబడి పనిచేస్తుందని బండి సంజయ్ స్పష్టం చేశారు. తెలంగాణను దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని తెలిపారు.