శ్రీవారి నగర్లో అంగరంగ వైభవంగా గణనాథుడి నిమజ్జన శోభాయాత్ర
రికార్డు స్థాయిలో రూ. 5,51,000లకు స్వామివారి లడ్డూ ప్రసాదం కైవసం
భక్తిశ్రద్ధలతో దక్కించుకున్న ఆర్. తిరుపతి రాథోడ్
అమీన్పూర్, సెప్టెంబర్ 25:(మెదక్ టుడే) న్యూస్ ప్రతినిధి.సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పరిధిలోని అమీన్పూర్ సర్కిల్ పరిధిలోని శ్రీవారి నగర్ వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గత 11 రోజులుగా విశేష పూజలందుకున్న శ్రీ వినాయక స్వామివారి నిమజ్జన మహోత్సవం, శోభాయాత్ర అత్యంత వైభవంగా, నేత్రపర్వంగా సాగాయి. కాలనీ వాసుల జయజయధ్వానాలు, డప్పు వాయిద్యాలు, కోలాటాలు, భజనల నడుమ శోభాయాత్ర అంగరంగ వైభవంగా కొనసాగింది.హోరాహోరీగా లడ్డూ వేలం పాట:నిమజ్జనానికి ముందు కమిటీ నిర్వహించిన స్వామివారి పవిత్ర లడ్డూ వేలం పాట భక్తుల పోటాపోటీ నడుమ అత్యంత ఉత్సాహభరితంగా సాగింది. కాలనీ చరిత్రలోనే రికార్డు స్థాయిలో రూ. 5,51,000/- (ఐదు లక్షల యాభై ఒక్క వేల రూపాయలు) పలికిన ఈ దివ్య లడ్డూ ప్రసాదాన్ని శ్రీవారి నగర్ కాలనీకి చెందిన ఆర్. తిరుపతి రాథోడ్ గారు దక్కించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు సహకరించిన బృంద సభ్యులకు కాలనీవాసులు హర్షధ్వానాలతో అభినందనలు తెలిపారు.కాలనీ సుభిక్షంగా ఉండాలి: ఆర్. తిరుపతి రాథోడ్ లడ్డూ ప్రసాదాన్ని దక్కించుకున్న అనంతరం ఆర్. తిరుపతి రాథోడ్ మాట్లాడుతూ… “గణనాథుడి కృపాకటాక్షాలతోనే ఈ పవిత్ర ప్రసాదాన్ని పొందే భాగ్యం లభించింది. శ్రీవారి నగర్ కాలనీ ప్రజలందరూ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, కాలనీలోని ప్రతి ఇంటా శుభాలు వెల్లివిరియాలని స్వామివారిని వేడుకుంటున్నాను” అని తెలిపారు. అలాగే తనకు సహకరించిన మిత్రులు, శ్రేయోభిలాషులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.ఉత్సవ కమిటీ సభ్యుల ప్రసంగం:
ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ.11 రోజుల పాటు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉత్సవాలు ఇంత ఘనంగా విజయవంతం కావడానికి స్థానిక కాలనీ పెద్దలు, మహిళలు, యువత, పిల్లల ఐకమత్యమే కారణమని కొనియాడారు. కాలనీపై స్వామివారి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షిస్తూ, రికార్డు ధరకు లడ్డూను దక్కించుకున్న తిరుపతి రాథోడ్ గారికి మరియు వారి బృందానికి కమిటీ తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో శ్రీవారి నగర్ వినాయక ఉత్సవ కమిటీ ముఖ్య ప్రతినిధులు, కాలనీ పెద్దలు, మహిళలు, యువకులు భారీ సంఖ్యలో పాల్గొని శోభాయాత్రను విజయవంతం చేశారు.