గ్రామసభలకు ప్రత్యేక ప్రాధాన్యం
ప్రజల్లో అవగాహన కల్పించాలి
శాఖల సమన్వయంతో ముందుకు
హైదరాబాద్,జూన్,2,(మెదక్ టుడే న్యూస్ ప్రతినిధి) రాష్ట్రంలో 99 రోజుల ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమాల అమలుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. పర్యావరణ వారోత్సవాల నిర్వహణ, ప్రజా అవగాహన కార్యక్రమాలు, గ్రామసభలు, వార్డు సభల నిర్వహణపై పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ నెల 4, 6, 8, 10 తేదీలలో రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, పట్టణ వార్డుల్లో గ్రామసభలు, వార్డు సభలు నిర్వహించాలని ప్రధాన కార్యదర్శి సూచించారు. ప్రభుత్వ కార్యక్రమాలు, అభివృద్ధి ప్రణాళికలు, ప్రజా భాగస్వామ్యంపై అవగాహన కల్పించేందుకు ఈ సభలను సమర్థవంతమైన వేదికగా వినియోగించాలని అధికారులను ఆదేశించారు.భారత ఎన్నికల సంఘం చేపడుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంపై ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని కలెక్టర్లకు సూచించారు. ఓటరు నమోదు, సవరణ ప్రక్రియలో ప్రతి అర్హ పౌరుడు పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని, ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి ఇది కీలకమని పేర్కొన్నారు. వ్యవసాయ రంగానికి సంబంధించి పంటల వైవిధ్యీకరణపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. తక్కువ నీటితో సాగయ్యే పంటలు, ఆదాయాన్ని పెంచే ప్రత్యామ్నాయ పంటలపై రైతులను చైతన్యవంతం చేయాలని చెప్పారు. వర్షాకాల సన్నద్ధత, ప్రకృతి విపత్తుల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. పారిశుద్ధ్యం, పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధాన కార్యదర్శి పేర్కొన్నారు. నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవడంతో పాటు మొక్కల నాటకం, ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని సూచించారు. గ్రామాలు, పట్టణాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజల భాగస్వామ్యం పెంచాలని కోరారు.ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో ఇప్పటికే అమలవుతున్న అంశాలకే కాకుండా గ్రామసభలు, వార్డు సభల ద్వారా అదనపు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పారు. ప్రభుత్వ శాఖలన్నీ సమన్వయంతో పనిచేసి కార్యక్రమాలను ప్రజలకు మరింత చేరువ చేయాలని ఆదేశించారు. ప్రజాప్రతినిధులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, సామాజిక నాయకులు, ఇతర వర్గాలను ఈ కార్యక్రమాల్లో భాగస్వాములను చేయాలని సూచించారు.వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ సీవీ ఆనంద్ మాట్లాడుతూ జిల్లా స్థాయిలో పోలీసు శాఖ ఇతర ప్రభుత్వ శాఖలతో సమన్వయం పెంచాలని అన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల విజయవంతమైన అమలు, ప్రజా కార్యక్రమాల నిర్వహణకు పరస్పర సహకారం అవసరమని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్, అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి అహ్మద్ నదీమ్, ప్రణాళిక శాఖ కార్యదర్శి గౌరవ్ ఉప్పల్, వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్, నీటిపారుదల శాఖ కార్యదర్శి ఈ. శ్రీధర్, పంచాయతీరాజ్ కమిషనర్ దివ్య, కార్మిక శాఖ కార్యదర్శి హరిచందన, వ్యవసాయ శాఖ సంచాలకుడు గోపీతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు పాల్గొన్నారు.

