MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 02 June 2026, 4:55 pm Digital Edition : Shiva Kumar

ప్రజల రాష్ట్రంగా తెలంగాణ.

అమరవీరుల త్యాగాలకు నివాళి
సంక్షేమంతో అభివృద్ధి లక్ష్యం
ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ దిశగా అడుగులు
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు

ఖమ్మం,జూన్,2,(మెదక్ టుడే న్యూస్ ప్రతినిధి) తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అమరవీరుల త్యాగాల ఫలితంగా సాధించిన తెలంగాణను సామాజిక, ఆర్థిక, రాజకీయన్యాయం అందించే ప్రజల రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన అమరవీరుల ఆశయాలను సాకారం చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమన్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం, సమగ్రాభివృద్ధిని కేంద్రంగా చేసుకుని ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు. ప్రతి వర్గానికి అభివృద్ధి ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా, ఇందిరమ్మ ఇళ్లు, మహిళా సాధికారత కార్యక్రమాలు, రైతు సంక్షేమ పథకాలు రాష్ట్రంలో సామాజిక భద్రతను బలోపేతం చేస్తున్నాయని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. పేద కుటుంబాలకు భద్రత, గౌరవప్రదమైన జీవనం కల్పించడంలో ఈ పథకాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు.విద్య, వైద్యం, విద్యుత్, హరిత ఇంధన రంగాల్లో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు తెలంగాణను దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా నిలబెడుతున్నాయని భట్టి విక్రమార్క వివరించారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా భవిష్యత్ తరాలకు బలమైన పునాది వేస్తున్నామని తెలిపారు. ప్రతి కుటుంబానికి ఆర్థిక భద్రత, ప్రతి యువకుడికి అవకాశం, ప్రతి రైతుకు భరోసా, ప్రతి మహిళకు ఆర్థిక స్వావలంబన కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. అభివృద్ధి ఫలాలు గ్రామీణ ప్రాంతాల వరకు చేరేలా సమగ్ర కార్యాచరణ అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.ప్రజల భాగస్వామ్యంతో తెలంగాణను ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం దృఢ సంకల్పంతో ముందుకు సాగుతోందని భట్టి విక్రమార్క అన్నారు. అభివృద్ధి, సంక్షేమం సమన్వయంతో తెలంగాణను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రజల సహకారం అవసరమని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రాష్ట్ర చరిత్రలో చిరస్మరణీయమైన రోజని పేర్కొన్న ఉప ముఖ్యమంత్రి, అమరవీరుల త్యాగ స్ఫూర్తితో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలపాలని ఆకాంక్షించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన అందిస్తూ అభివృద్ధి పథంలో తెలంగాణను ముందుకు నడిపిస్తామని స్పష్టం చేశారు.