ఒకేరోజు రూ.84 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
ప్రతి మున్సిపాలిటీకి రూ.15 కోట్ల భారీ నిధుల విడుదల

పటాన్‌చెరు,మే,19,(మెదక్ టుడే)న్యూస్ ప్రతినిధి.సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర కార్మిక, ఉపాధి, గనుల శాఖ మంత్రి డా. గడ్డం వివేక్ వెంకటస్వామి నేడు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. పటాన్‌చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీ కాట శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో కాంగ్రెస్ శ్రేణులు, స్థానిక ప్రజలు వేలాదిగా తరలివచ్చి మంత్రికి ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా ఇస్నాపూర్, ఇంద్రేశం, జిన్నారం, గుమ్మడిదల, గడ్డపోతారం మున్సిపాలిటీలకు రూ.15 కోట్ల చొప్పున పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. మొత్తంగా నియోజకవర్గవ్యాప్తంగా సుమారు రూ.84 కోట్లకు పైగా వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అలాగే భానూర్‌లో రూ.8.30 కోట్ల వ్యయంతో విశాఖ పీడబ్ల్యూడీ రోడ్డు నుండి శంకరపల్లి–పటాన్‌చెరు రోడ్డు వరకు కంచర్లగూడెం మీదుగా నిర్మించనున్న బీటీ రోడ్డుకు మంత్రి శంకుస్థాపన చేశారు.తెల్లాపూర్ జిహెచ్ఎంసి పరిధిలోని ఉస్మాన్‌నగర్ కేజీబీవీలో రూ.60.94 లక్షలు, జిన్నారం కేజీబీవీలో రూ.70.95 లక్షల వ్యయంతో నిర్మించనున్న అదనపు తరగతి గదుల పనులకు శంకుస్థాపన చేసి, సోలక్‌పల్లిలో ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి డా. గడ్డం వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.1985లో స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈ ప్రాంతానికి బీడీఎల్, ఓడీఎఫ్ వంటి ప్రతిష్టాత్మక రక్షణ రంగ పరిశ్రమలను తీసుకువచ్చారని గుర్తుచేశారు. ఆమె సేవలను స్మరించుకుంటూ ఈ ప్రాంతంలో ఇందిరమ్మ విగ్రహాన్ని ఏర్పాటుచేయడంసముచితమన్నారు.భానూర్ కార్మికుల హౌసింగ్ సొసైటీకి స్థల కేటాయింపు చేపడతామని, పటాన్‌చెరు నుండి శంకర్‌పల్లి వరకు 100 ఫీట్ల రహదారి నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గత పదేళ్లలో లేని విధంగా ప్రజా ప్రభుత్వంలో అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు అందజేస్తామని, జూన్ 2వ తేదీ నుండి కొత్త పింఛన్ల పంపిణీ ప్రారంభిస్తామని తెలిపారు.పటాన్‌చెరు కాంగ్రెస్ ఇంచార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం పటాన్‌చెరు అభివృద్ధికి, ముఖ్యంగా విద్యా మరియు మౌలిక వసతుల రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఒకేరోజు రూ.84 కోట్లకు పైగా అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం చారిత్రాత్మకమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో టీ జీ ఐ ఐ సి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి , స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.
