హుస్నాబాద్‌కు కొత్త భవనం
ములకనూరుకు ఆధునిక సదుపాయాలు
రైతులకు మెరుగైన సేవలు
మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్,జూన్,2,(మెదక్ టుడే న్యూస్ ప్రతినిధి) హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. పశుపోషక రైతులకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో హుస్నాబాద్ ఏరియా పశువైద్యశాలకు, హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం ములకనూరు పశువైద్యశాలకు నూతన భవనాల నిర్మాణం కోసం మొత్తం రూ.1.40 కోట్ల నిధులను మంజూరు చేస్తూ పరిపాలనా అనుమతులు జారీ చేసింది. రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఈ నిధులను విడుదల చేశారు. ప్రభుత్వం జి.ఓ.ఆర్.టి. నెం.36, తేదీ 02-06-2026 ద్వారా అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఆధునిక సదుపాయాలతో కూడిన నూతన భవనాల నిర్మాణం పూర్తయితే పశువులకు మరింత నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ హుస్నాబాద్ ప్రాంతంలో పశుసంపద అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పశుపోషణ రైతుల జీవనాధారంగా మారిన నేపథ్యంలో వారికి అవసరమైన వైద్య సదుపాయాలను మెరుగుపరచడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.నూతన భవనాల ద్వారా పశువైద్య సేవలు మరింత సమర్థవంతంగా అందించడంతో పాటు అత్యవసర చికిత్సలు, వ్యాధి నిర్ధారణ, టీకాల కార్యక్రమాలు, పశు సంరక్షణ సేవలు మెరుగుపడతాయని అధికారులు తెలిపారు. ఆధునిక వసతులతో నిర్మించనున్న ఈ భవనాలు రైతులకు ఎంతో ఉపయోగపడనున్నాయని పేర్కొన్నారు. హుస్నాబాద్ అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో ప్రజాపాలన ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తూ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ నిధుల మంజూరుకు సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరికి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పశుపోషక రైతుల సంక్షేమం, పశుసంపద అభివృద్ధి కోసం ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.
