విద్యార్థుల ఆందోళనలపై బలప్రయోగం తగదు: తాండ్ర విశాల శ్రావణ్ రెడ్డి
(స్పెషల్ కరస్పాండెంట్)
షాద్‌నగర్,జులై,21,మెదక్ టుడే న్యూస్:నీట్ పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ ఆరోపణల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో బాధ్యత వహించి, దేశ ప్రజలకు వాస్తవాలను వెల్లడించాలని కేశంపేట మాజీ జెడ్పీటీసీ తాండ్ర విశాల శ్రావణ్ రెడ్డి డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితం చేసే ఇలాంటి ఘటనలపై పారదర్శక విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.తమ న్యాయమైన డిమాండ్ల కోసం శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులపై పోలీసుల బలప్రయోగం చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని ఆయన విమర్శించారు. విద్యార్థుల సమస్యలను అణచివేయడం కాకుండా, వారి ఆందోళనలను ప్రభుత్వం సానుకూలంగా స్వీకరించి పరిష్కార మార్గాలను అన్వేషించాలని సూచించారు.ఈ సందర్భంగా న్యూఢిల్లీలో లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ చేపట్టిన నిరసన కార్యక్రమానికి తన పూర్తి మద్దతు ప్రకటించారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా నీట్ పరీక్షల నిర్వహణలో పారదర్శకత, విశ్వసనీయత అత్యంత కీలకమని అన్నారు.విద్యార్థుల హక్కుల పరిరక్షణ, పరీక్షల నిష్పక్షపాత నిర్వహణ, బాధ్యులపై చర్యలు తీసుకోవడం వంటి అంశాల్లో కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. దేశ యువతకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ విద్యార్థుల తరఫున పోరాటం కొనసాగిస్తుందని పేర్కొన్నారు.ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువలను కాపాడే ఈ ఉద్యమానికి కాంగ్రెస్ శ్రేణులు, ప్రజాస్వామ్యవాదులు, విద్యార్థి సంఘాలు, ప్రజలు మద్దతు ఇవ్వాలని తాండ్ర విశాల శ్రావణ్ రెడ్డి పిలుపునిచ్చారు.