MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 24 May 2026, 3:29 am Digital Edition : Shiva Kumar

ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు,బీ ఆర్ఎస్ నాయకులు ఆగ్రహం.

చేగుంట,మే,23,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండల కేంద్రంలో శనివారం బీఆర్‌ఎస్ (బిఆర్ఎస్) పార్టీ ముఖ్య నాయకులు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ మండల అధ్యక్షుడు నారాయణరెడ్డి, చేగుంట మాజీ సర్పంచ్ మంచికట్ల శ్రీనివాస్ మరియు సీనియర్ నాయకుడు సోమ సత్యనారాయణ కాంగ్రెస్ ప్రభుత్వంపై, ఆ పార్టీ స్థానిక నాయకుల తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తమ ఉనికి కోసం కొందరు కాంగ్రెస్ నాయకులు స్థానిక ఎమ్మెల్యేను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, ఎమ్మెల్యే కాలి గోటికి కూడా సరిపోని వారికి ఆయనను విమర్శించే స్థాయిగానీ, అర్హతగానీ లేదని మండిపడుతూ, అనవసరంగా నోరుపారేసుకుంటే సాక్ష్యాలతో సహా గుట్టు రచ్చకీడుస్తామని “ఖబర్దార్” అంటూ ఘాటుగా హెచ్చరించారు. ఎన్నికల వేళ ప్రజలకు వందలాది హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కనీసం మూడు నాలుగు హామీలను కూడా సరిగ్గా నెరవేర్చలేకపోయిందని, నేడు గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లు, బీడీ పెన్షన్ల పేరుతో కాంగ్రెస్ నేతలు లంచాలు వసూలు చేస్తూ అవినీతికి పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. గత కేసీఆర్ హయాంలో రైతులను కళ్లల్లో పెట్టుకుని చూసుకుంటూ 24 గంటల ఉచిత విద్యుత్ అందించి, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం సజావుగా కొనుగోలు చేశారని గుర్తు చేస్తూ.. ప్రస్తుత రేవంత్ రెడ్డి పాలనలో ఎరువుల కొరత సృష్టించి రూ. 1,350 బస్తాను రూ. 1,550కి బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నారని, రుక్మాపూర్, అన్నసారం లాంటి కొనుగోలు కేంద్రాల వద్ద తడిసిన వడ్లతో రైతులు రోడ్లపై పడి అష్టకష్టాలు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఎమ్మెల్యే నిరంతరం ఊరూరా తిరుగుతూ కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులను పలకరిస్తూ, రైతులను ఓదార్చుతూ అండగా నిలుస్తున్నారని కొనియాడుతూ, గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో జరిగిన సంక్షేమం, అభివృద్ధిపై కాంగ్రెస్ నాయకులకు దమ్ముంటే చేగుంట, దుబ్బాక, దౌల్తాబాద్ లేదా మెదక్.. ఇలా ఏ నియోజకవర్గంలోనైనా బహిరంగ చర్చకు రావాలని, చేతలైతే మొదట ఎంపీపీ స్థానానికి అవిశ్వాస తీర్మానం పెట్టి గెలవాలని సవాల్ విసిరారు. ఈ మీడియా సమావేశంలో చేగుంట బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు నారాయణరెడ్డి, చేగుంట మాజీ సర్పంచ్ మంచి కట్ల శ్రీనివాస్, చేగుంట పట్టణ అధ్యక్షులు ఎర్ర యాదగిరి, రాజగోపాల్, డిష్ రాజు, మహమ్మద్ అలీ, కటికే రాజేష్, పట్నం తనీషా, సోమ సత్యనారాయణ, బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.