చేగుంట,మే,17,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలం, అఖిల భారత ఔషధ విక్రేతల సంఘం (ఏఐఓసీడీ ) పిలుపు మేరకు ఈ నెల 20వ తేదీ బుధవారం దేశవ్యాప్తంగా అన్ని మెడికల్ షాపుల బంద్ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ (టీటీసీడిఏ ) రాష్ట్ర అధ్యక్షులు కె. శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్ మెంబర్, మెదక్ జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అధ్యక్షులు టి. రాజు ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగానే ఈరోజు చేగుంట లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి టి రాజు మాట్లాడుతూ భారతదేశంలోని సుమారు 12.40 లాక్స్ ఔషధ విక్రేతలు పాల్గొంటున్న ఈ సమ్మెలో భాగంగా కేంద్ర ప్రభుత్వ నిబంధనలను (జి .స్ .ర్ . 817(ఈ)) ఉల్లంఘిస్తూ ఇంటర్నెట్ ద్వారా సాగుతున్న అక్రమ ఆన్‌లైన్ ఫార్మసీలను వెంటనే అరికట్టాలని వారు డిమాండ్ చేశారు; కార్పొరేట్ సంస్థల ప్రిడేటరీ ప్రైసింగ్ (భారీ డిస్కౌంట్లు) విధానాల వల్ల క్షేత్రస్థాయిలోని చిన్న, మధ్యతరహా రిటైల్,హోల్‌సేల్ వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారని, నిబంధనలకు విరుద్ధంగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఆన్‌లైన్‌లో యాంటీబయాటిక్స్ విక్రయించడం వల్ల యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ (ఏ ఎమ్ ఆర్ ) పెరిగి ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే కోవిడ్-19 సమయంలో అత్యవసర సేవల కోసం తెచ్చిన తాత్కాలిక సడలింపుల ఉత్తర్వులను (జి .స్ .ర్ . 220(ఈ )) వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. ప్రజల ప్రాణాలతో ముడిపడి ఉన్న ఔషధ రంగాన్ని కాపాడుకోవడానికి, నిరుపేద రోగులకు నకిలీ మందులు అందకుండా అడ్డుకోవడానికి నిర్వహిస్తున్న ఈ దేశవ్యాప్త సమ్మెకు ప్రజా బాహుళ్యం, వైద్యులు, ఔషధ తయారీదారులు పూర్తిస్థాయిలో సహకరించి జయప్రదం చేయాలని టీటీసీడీఏ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో అయిత రఘురాములు, వెంకటరమణ, కృష్ణమూర్తి, చంద్రశేఖర్ గౌడ్ , శ్రీనివాస్, సత్యనారాయణ , ప్రకాష్, తదితరులు కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ సోదరులు అందరు పాల్గొన్నారు.