MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 26 March 2026, 6:22 am Digital Edition : Medak Today

మారిన పాలన.. మారని రాత! దయారాలో నరకప్రాయంగా డ్రైనేజీ వ్యవస్థ.

• మురికి నీటిలోనే అమ్మవారి దర్శనం.. అంగన్‌వాడీకి వెళ్లాలన్నా తప్పని తిప్పలు.

• పంచాయతీ నుంచి జిహెచ్ఎంసి కి.. సమస్యలు మాత్రం తీరని వైనం.

• పట్టించుకోని అధికారులు.. దయారా గ్రామస్తుల తీవ్ర ఆగ్రహం.

అమీన్‌పూర్,మార్చి,26,(మెదక్ టుడే) న్యూస్:ప్రతినిధి.సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలోని అమీన్‌పూర్ జిహెచ్ఎంసి పరిధిలోని, దయారా గ్రామంలో ప్రజల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. గ్రామం పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా రూపాంతరం చెందినా, డ్రైనేజీ సమస్య మాత్రం దశాబ్దాల వెనుకబడే ఉంది. దయారాలోని పోచమ్మ దేవాలయం, వివేకానంద విగ్రహం, అంగన్‌వాడీ పాఠశాల సమీపంలో డ్రైనేజీ నీరు రోడ్లపై పొంగిపొర్లుతుండటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

మురికి నీటిలోనే భక్తి.. చిన్నారుల అవస్థలు:

గ్రామస్తులు పవిత్రంగా భావించే పోచమ్మ అమ్మవారి ఆలయానికి వెళ్లాలన్నా భక్తులు మురికి నీటిలో నడుచుకుంటూ వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. మరోవైపు, అంగన్‌వాడీ పాఠశాలకు వెళ్లే చిన్నారులు కూడా ఈ మురుగు నీటిని దాటుకుంటూ వెళ్తుండటంతో తల్లిదండ్రులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. మురుగు నీరు నిలవ ఉండటంతో దుర్వాసన వెదజల్లడమే కాకుండా, అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని వారు ఆవేదన చెందుతున్నారు.

అధికారుల నిర్లక్ష్యంపై నిప్పులు:

“పంచాయతీ పోయి మున్సిపల్ వచ్చింది.. మున్సిపల్ నుంచి జీహెచ్‌ఎంసీ పరిధిలోకి వెళ్తున్నాం అంటున్నారు.. కానీ మా తిప్పలు మాత్రం తీరడం లేదు” అంటూ గ్రామస్తులు అధికారుల తీరుపై మండిపడుతున్నారు. ఎన్నో రోజులుగా డ్రైనేజీ సమస్యపై ఫిర్యాదులు చేస్తున్నా, సంబంధిత అధికారులు కనీసం ఇటువైపు కన్నెత్తి చూడటం లేదని వారు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, దయారా గ్రామంలోని డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు.