-తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ: కాట సుధా శ్రీనివాస్ గౌడ్
-ఆడపడుచుల ఆత్మగౌరవ పండుగ: దండు నిర్మల రమేష్ యాదవ్
అమీన్పూర్, అక్టోబర్ 14:(మెదక్ టుడే) న్యూస్ ప్రతినిధి.తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు నిలువెత్తు ప్రతీకగా నిలిచే తీరొక్క పూల పండుగ బతుకమ్మ వేడుకలను గాంధీ భవన్లో తెలంగాణ ప్రదేశ్ మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో గురువారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాట సుధా శ్రీనివాస్ గౌడ్, అమీన్పూర్ పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దండు నిర్మల రమేష్ యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరై సందడి చేశారు.గాంధీ భవన్ ప్రాంగణంలో రంగురంగుల పూలతో పేర్చిన భారీ బతుకమ్మల చుట్టూ రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చిన మహిళా నేతలు, కార్యకర్తలతో కలిసి కాట సుధా శ్రీనివాస్ గౌడ్, దండు నిర్మల రమేష్ యాదవ్ సాంప్రదాయ పాటలు పాడుతూ ఉత్సాహంగా లయబద్ధంగా బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు ప్రత్యేకంగా సమావేశమై మహిళా సాధికారత, పార్టీ బలోపేతంలో మహిళల పాత్ర తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాట సుధా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రకృతిని ఆరాధిస్తూ, పూలను పూజించే అరుదైన విశిష్ట సంస్కృతి తెలంగాణకే సొంతమని కొనియాడారు. బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ఐక్యతకు సజీవ సాక్ష్యమని పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వంలో మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని, కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ మహిళల అభివృద్ధికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. అనంతరం అమీన్పూర్ పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దండు నిర్మల రమేష్ యాదవ్ మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవ ప్రతీక అని అన్నారు. రాష్ట్రంలోని మహిళలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని గౌరమ్మను వేడుకున్నట్లు తెలిపారు. మహిళా సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లడంలో మహిళా కాంగ్రెస్ శ్రేణులు చురుగ్గా పనిచేస్తున్నాయని వెల్లడించారు.గాంధీ భవన్ ప్రాంగణం మహిళా నేతల కోలాటాలు, బతుకమ్మ పాటలతో పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ముఖ్య నేతలు, సంగారెడ్డి, అమీన్పూర్ పరిధిలోని పలువురు మహిళా ప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
