MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 19 February 2026, 4:18 am Digital Edition : Medak Today

కులం పేరుతో మహిళను దూషించిన ఘటనలో నిందితుల రిమాండ్- మెదక్ డి.ఎస్.పి

మెదక్,ఫిబ్రవరి,18,మెదక్ టుడే న్యూస్:ప్రతినిధి.మెదక్ పట్టణంలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా రాజకీయ మద్దతు విషయంలో ఏర్పడిన వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కులం పేరుతో మహిళను దూషించడమే కాకుండా, ఎమ్మెల్యే వాహనంపై రాళ్లతో దాడి చేసి చంపాలనే ప్రయత్నం చెసిన ఘటనకు సంబంధించి నిందితులను రిమాండ్‌కు తరలిస్తున్నట్లు మెదక్ డియస్పి డి. ప్రసన్నకుమార్ తెలిపారు.మెదక్ డియస్పి డి. ప్రసన్నకుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం.కాంగ్రెస్ పార్టీ మహిళ కార్యకర్త మున్సిపల్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ప్రచారం నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో 15వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి భర్త మల్లికార్జున్ గౌడ్ మరియు అతని అనుచరులు ఆమెను బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరారు. అయితే ఆమె ఇందుకు నిరాకరించడంతో, 09-02-2026 తేదీ రాత్రి సుమారు 10 గంటల సమయంలో మల్లిఖర్జున్ గౌడ్ ఆమెను కులం పేరుతో దూషిస్తూ బూతు మాటలు మాట్లాడినట్లు ఫిర్యాదు అందినట్లు తెలిపారు.ఈ ఘటన విషయమై బాధితురాలు స్థానిక ఎమ్మెల్యే కి ఫోన్ ద్వారా సమాచారం అందించారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే ఆమెను పరామర్శించేందుకు బయలుదేరిన సమయంలో, పిట్లం బేస్ చెరువు కట్ట వద్ద బీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్యకర్తలు మల్లిఖర్జున్ గౌడ్, జీవన్ రావు, వేణు, హబీబ్, మల్లేష్ తదితరులు కలిపి మొత్తం 23 మంది కలిసి ఎమ్మెల్యే వాహనంపై రాళ్లతో దాడి చేసి చంపాలనే ప్రయత్నం చేసినట్లు తెలిపారు. ఈ దాడిలో వాహనానికి నష్టం వాటిల్లడంతో పాటు ఎమ్మెల్యే కి మరియు ఆయన అనుచరులకు గాయాలు అయినట్లు పేర్కొన్నారు. దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఓ మహిళపై మల్లికార్జున్ గౌడ్ ఛాతిపై చేయి వేసి తోసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. గోదాల అఖిలను కులం పేరుతో దూషించిన ఘటనపై సంబంధిత సెక్షన్లతో పాటు ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేసి నిందితులను రిమాండ్‌కు తరలిస్తున్నట్లు డియస్పి గారు తెలిపారు. ఈ కేసులో కొందరు నిందితులు పరారీలో ఉన్నారని, వారిని త్వరలోనే అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలిస్తామని ఆయన స్పష్టం చేశారు. శాంతిభద్రతలకు భంగం కలిగించేలా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తప్పవని తెలిపారు.