మెదక్,డిసెంబర్,21,మెదక్ టుడే న్యూస్:ప్రతినిధి జిల్లాలో పొగమంచు నేపథ్యంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలి.వాహనాలను నెమ్మదిగా నడిపి గమ్యస్థానాలకు సురక్షితంగా చేరాలి:జిల్లా ఎస్ పి. శ్రీనివాస రావుజిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో పాటు వాతావరణంలో దట్టమైన పొగమంచు ఏర్పడుతున్న నేపథ్యంలో వాహనదారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు ఐపీఎస్ ప్రజలకు ఒక ప్రకటనలో తెలిపారు.పొగమంచు తీవ్రత పెరగడం వల్ల రాత్రి మరియు తెల్లవారుజామున రహదారులపై ఎదురుగా వచ్చే వాహనాలు, పాదచారులు స్పష్టంగా కనిపించక రోడ్డు ప్రమాదాలు సంభవించే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ఈ పరిస్థితుల్లో చిన్నపాటి నిర్లక్ష్యం కూడా ప్రాణాంతక ప్రమాదాలకు దారితీయవచ్చని హెచ్చరించారు. అందువల్ల అత్యవసరమైతే తప్ప ఈ సమయాల్లో ప్రయాణాలు చేయకుండా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.అత్యవసరంగా ప్రయాణించాల్సి వచ్చినప్పుడు వాహనాలను నెమ్మదిగా, జాగ్రత్తగా నడపాలని సూచించారు.తక్కువ వీక్షణ సామర్థ్యం కారణంగా మలుపులు, ఇతర వాహనాలు సరిగా కనిపించక ప్రమాదాలు జరగవచ్చని పేర్కొన్నారు.ఈ సమయంలో హెడ్‌లైట్లను లో బీమ్‌లో ఉంచి, ఫాగ్ లైట్లను వినియోగించాలని సూచించారు.ప్రయాణానికి ముందు వాహనాల స్థితిని తప్పనిసరిగా పరిశీలించుకోవాలని, ముఖ్యంగా బ్రేకులు, లైట్లు, టైర్లు సక్రమంగా ఉన్నాయో లేదో తనిఖీ చేసుకోవాలని తెలిపారు. డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వినియోగం, ఆకస్మిక ఓవర్‌టేక్, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండాలని ఎస్ పి తెలిపారు.
పోలీసుల సూచనలు, ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ ప్రతి వాహనదారుడు తమ గమ్యస్థానాలకు క్షేమంగా చేరుకోవాలని జిల్లా ఎస్ పి వెల్లడించారు.