అమీన్‌పూర్,మే,28,మెదక్ టుడే న్యూస్:ప్రతినిధి.అమీన్‌పూర్ జీహెచ్‌ఎంసీ పరిధిలోని బిహెచ్‌ఎల్ మెట్రో కాలనీలో అక్రమ నిర్మాణాల జోరు పెరిగింది. నిబంధనలను బేఖాతరు చేస్తూ, అనుమతికి మించిన అంతస్తులతో పాటు, వాణిజ్య అవసరాల కోసం అడ్డగోలుగా షట్టర్ల నిర్మాణాన్ని చేపట్టడంపై స్థానిక కాలనీవాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.స్థానిక సమాచారం మేరకు, సదరు భవన యజమానికి అధికారులు కేవలం జి+2 అంతస్తుల నిర్మాణానికి మాత్రమే అనుమతులు మంజూరు చేశారు. అయితే, ఆ నిబంధనలను గాలికి వదిలేసిన యజమాని, అంతకు మించి అదనపు నిర్మాణాలు చేపట్టినట్లు ఆరోపణలు వస్తున్నాయి. కేవలం నివాస అవసరాల కోసం అనుమతి పొంది, ఆ భవనం గ్రౌండ్ ఫ్లోర్‌లో అక్రమంగా షట్టర్లు ఏర్పాటు చేసి వాణిజ్య అవసరాలకు సిద్ధం చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.ప్రశ్నిస్తున్న స్థానికులు:“నివాస గృహాల అనుమతి పొంది, షట్టర్లు వేసి వ్యాపార సముదాయాలుగా మార్చడం వెనుక అంత ధైర్యం ఎక్కడిది?” అని కాలనీవాసులు నిలదీస్తున్నారు.
నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న ఈ నిర్మాణాన్ని టౌన్ ప్లానింగ్ అధికారులు చూసీచూడనట్లు వదిలేయడం వెనుక ఆంతర్యమేమిటని స్థానికులు మండిపడుతున్నారు.కాలనీ రోడ్లపై ట్రాఫిక్ సమస్యలకు దారితీసే విధంగా, పార్కింగ్ స్థలాన్ని ఆక్రమించి ఇలాంటి కమర్షియల్ షట్టర్లు నిర్మించడం వల్ల కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అధికారుల జాప్యంపై అనుమానాలు!అక్రమ కట్టడాలను నివారించాల్సిన టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు, యజమానితో కుమ్మక్కయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఫిర్యాదులు చేసినా పట్టించుకోని అధికారుల తీరుపై కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ మరియు జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులు స్పందించి, నిబంధనలను అతిక్రమించిన సదరు భవన యజమానిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అక్రమ షట్టర్లను తొలగించాలని కాలనీవాసులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.చట్టం అందరికీ సమానమేనని అధికారులు నిరూపించుకోవాలి. అక్రమాలను ప్రోత్సహిస్తే ఊరుకునేది లేదు” అని స్థానికులు హెచ్చరిస్తున్నారు.