ఘనంగా ‘గ్రీన్ మెడోస్ మహిళా సంక్షేమ సంఘం’ ఆవిర్భావం
అధ్యక్షురాలిగా కే. దీపిక ఎన్నిక
అమీన్పూర్, సెప్టెంబర్ 27:(మెదక్ టుడే) న్యూస్ ప్రతినిధి.సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పరిధిలోని బీరంగూడ డివిజన్- 270 పరిధిలోని గ్రీన్ మెడోస్ కాలనీలో మహిళల ఐక్యత, సంక్షేమం మరియు సమగ్ర కాలనీ అభివృద్ధే ధ్యేయంగా నూతనంగా ‘గ్రీన్ మెడోస్ మహిళా సంక్షేమ సంఘం’ ఏర్పాటైంది. ఆదివారం కాలనీవాసుల సమక్షంలో జరిగిన సమావేశంలో సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గత కొన్నేళ్లుగా కాలనీలో పలు కార్యక్రమాలు కొద్దిమందికే పరిమితం కావడం, అందరికీ సమాన భాగస్వామ్యం దక్కకపోవడం గమనించిన మహిళలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. ఎలాంటి వర్గ విభేదాలకు తావులేకుండా, అత్యంత పారదర్శక పద్ధతిలో అందరినీ కలుపుకుని వెళ్లాలనే బలమైన సంకల్పంతో ఈ సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ.కాలనీలో రాబోయే వినాయక చవితి, బతుకమ్మ ఉత్సవాలు, జాతీయ పర్వదినాలు, సాంస్కృతిక వేడుకల్లో ప్రతి కుటుంబం, ముఖ్యంగా మహిళలు, పిల్లలు పూర్తిస్థాయిలో పాల్గొనేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ మహిళా సంక్షేమ పథకాలు, డ్వాక్రా/స్వయం సహాయక బృందాల ద్వారా లభించే ప్రయోజనాలపై అవగాహన కల్పించి, అర్హులైన ప్రతి ఒక్కరికీ అవి అందేలా అధికారులతో సమన్వయం చేసుకుంటామని స్పష్టం చేశారు. అలాగే పిల్లల్లోని అంతర్గత ప్రతిభను వెలికితీసేలా ప్రత్యేక సాంస్కృతిక, సామాజిక వేదికలు కల్పిస్తామన్నారు.ముఖ్యంగా కాలనీలోని రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాలు, పార్కుల నిర్వహణ వంటి మౌలిక వసతుల సమస్యలను ఎప్పటికప్పుడు స్థానిక అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడంలో మహిళలు ముందుంటారని పేర్కొన్నారు. చుట్టుపక్కల కాలనీలకే తమ అసోసియేషన్ ఒక ఆదర్శ వేదికగా నిలవాలన్నదే తమ లక్ష్యమని వివరించారు.*నూతన కార్యవర్గం వివరాలు:అధ్యక్షురాలు: కే. దీపికఉపాధ్యక్షురాలు: ఏ. సబితప్రధాన కార్యదర్శులు: జాహ్నవి, లావణ్య సంయుక్త కార్యదర్శి: సుహాసిని కోశాధికారులు: సిందోల్ మాధవి, స్వాతి కార్యవర్గ సభ్యులు: అవంతి, హిమబిందు, మాధవి.నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ప్రతినిధులకు కాలనీ ప్రజలు, మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై అభినందనలు తెలిపారు. “మహిళల ఐక్యతే మన బలం – మహిళా శక్తే మన ప్రగతి బాట” అంటూ కాలనీ అభివృద్ధి కోసం ఈ సంఘం చిత్తశుద్ధితో కృషి చేయాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అమీన్పూర్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి టెంపుల్ డైరెక్టర్,దండు నిర్మల, అమీన్ పూర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నందారం నరసింహ గౌడ్ సతీమణి నందారం ఉమారాణి, కాలనీ ప్రెసిడెంట్ రఘుపతి రెడ్డి సతీమణి సుధా, కాలనీ మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
