MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 23 May 2026, 3:18 am Digital Edition : Shiva Kumar

జ్ఞాన సేవకు జీవంత ప్రతిరూపం–షాద్‌నగర్ గ్రంథాలయంలో సరస్వతీ దేవి విగ్రహావిష్కరణ ఘనంగావిగ్రహ దాతలు సరాపు రమేష్ దంపతులు.

ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
(స్పెషల్ కరస్పాండెంట్)
షాద్‌నగర్,మే,22,మెదక్ టుడే న్యూస్:తెలంగాణ ప్రభుత్వ పౌర గ్రంథాలయ శాఖ ఆధ్వర్యంలోని షాద్‌నగర్ గ్రేడ్-1 శాఖ గ్రంథాలయంలో శ్రీ సరస్వతీ దేవి విగ్రహావిష్కరణ మహోత్సవం గురువారం అత్యంత వైభవంగా నిర్వహించారు. పరాభవ నామ సంవత్సర జ్యేష్ఠ మాస శుద్ధ పంచమి సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో షాద్‌నగర్ ఎమ్మెల్యే, ప్రభుత్వరంగ సంస్థల కమిటీ చైర్మన్ శ్రీ వీర్లపల్లి శంకరయ్య ముఖ్య అతిథిగా పాల్గొని సరస్వతీ మాత విగ్రహాన్ని ఆవిష్కరించారు. రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి గౌరవ అతిథిగా హాజరై విద్యా వికాసంలో గ్రంథాలయాల పాత్రను వివరించారు.
ఈ సందర్భంగా విగ్రహ దాతలైన ప్రముఖ వ్యాపారవేత్త, సీనియర్ జర్నలిస్టు, సామాజిక సేవకుడు శ్రీ సరాపు రమేష్ కుమార్ సేవలను వక్తలు విశేషంగా కొనియాడారు. స్వర్గీయ సరాపు మణెమ్మ–మల్లయ్య, స్వర్గీయ కొండూరు లక్ష్మమ్మ–శంకరయ్యల జ్ఞాపకార్థం ఆయన తన సతీమణి శ్రీమతి అనంతలక్ష్మితో కలిసి ఈ విగ్రహాన్ని సమర్పించడం అభినందనీయమని తెలిపారు. ఆంధ్రప్రభ సీనియర్ జర్నలిస్టుగా పత్రికారంగంలో విశేష సేవలందించిన రమేష్ కుమార్, షాద్‌నగర్ ఆర్యవైశ్య సంఘం మాజీ అధ్యక్షుడిగా వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయ అభివృద్ధికి కీలకంగా కృషి చేశారని, సంఘానికి స్థిర ఆదాయం వచ్చే విధంగా పలు ఆర్థిక వనరులను సమకూర్చి ఆదర్శ నాయకత్వాన్ని చాటారని వక్తలు ప్రశంసించారు. రంగారెడ్డి జిల్లా ఆర్యవైశ్య మహాసభ మాజీ ప్రధాన కార్యదర్శిగా సంఘ ఐక్యతకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.
ప్రముఖ సామాజికవేత్త డాక్టర్ కొమ్ము వెంకన్న బాబు మాట్లాడుతూ, “పాత్రికేయుడిగా నిజాయితీ, వ్యాపారవేత్తగా విశ్వసనీయత, సంఘ నాయకుడిగా సేవాభావం కలగలిపిన అరుదైన వ్యక్తిత్వం సరాపు రమేష్ కుమార్‌ది” అని కొనియాడారు. విద్యాసంస్థల నిర్వహణలో ఆయన చూపుతున్న సేవాస్ఫూర్తి నేటి యువతకు ఆదర్శమని పేర్కొన్నారు.
తన ప్రసంగంలో శ్రీ సరాపు రమేష్ కుమార్ భావోద్వేగంగా మాట్లాడుతూ, “ఈ స్థాయికి రావడానికి నా అర్థాంగి అనంతలక్ష్మి పూర్తి సహకారమే ప్రధాన బలం” అని పేర్కొన్నారు. కుటుంబ బాధ్యతలతో పాటు తన సామాజిక సేవా కార్యక్రమాలకు ఆమె అండగా నిలిచిందని తెలిపారు. ముగ్గురు కుమార్తెలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దడంలో తన సతీమణి పాత్ర అపారమని, ఒకరు అమెరికాలో స్థిరపడగా, మరొకరు ఎం.డి పీడియాట్రిషన్ పూర్తి చేశారని, చిన్న కుమార్తె అమెరికాలో ఎం.ఎస్ చదువుతున్నదని గర్వంగా వివరించారు. కుటుంబ విలువలు, విద్య, సేవాభావం కలిసినప్పుడే సమాజంలో గౌరవం లభిస్తుందని ఆయన అన్నారు.కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బసవేశ్వర్, మార్కెట్ కమిటీ చైర్మన్ సులోచన కృష్ణారెడ్డి, వైస్ చైర్మన్లు అందె మోహన్, మహ్మద్ అలీఖాన్ బాబర్, జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి పి.జి.వి రాణి, కౌన్సిలర్ జి.టి వసంత శ్రీనివాస్, లైబ్రేరియన్ ఎం. ప్రతాప్, గ్రంథాలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ కొప్పుల మదన్‌మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పట్టణ ప్రముఖులు, విద్యార్థులు, పాఠకులు అధిక సంఖ్యలో హాజరై సరస్వతీ మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. విద్య, జ్ఞానానికి ప్రతీకగా నిలిచే ఈ విగ్రహం గ్రంథాలయానికి మరింత శోభను తెచ్చిందని సభలో వక్తలు అభిప్రాయపడ్డారు.