చట్టం అందరికీ సమానమే కదా? బీరంగూడ-కిష్టారెడ్డిపేట్ మార్గంలో యథేచ్ఛగా ఆక్రమణలు.. అధికారుల మౌనం వెనుక ఆంతర్యమేమిటి?
అమీన్‌పూర్,మే,29,(మెదక్ టుడే) న్యూస్ ప్రతినిధి.సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం అమీన్‌పూర్ జిహెచ్ఎంసి పరిధిలో రోడ్డు ఆక్రమణల తొలగింపు విషయంలో అధికారులు అనుసరిస్తున్న ద్వంద్వ ప్రమాణాలపై వ్యాపారులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా బీరంగూడ మెయిన్ మార్కెట్ నుండి కిష్టారెడ్డిపేట్ వెళ్లే ప్రధాన రహదారి పక్కన వెలిసిన ఆక్రమణలు, అధికారుల పనితీరుపై అనేక అనుమానాలకు తావిస్తున్నాయి.సమస్య ఏమిటంటే:గత 20 రోజుల క్రితం, జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ అధికారులు హడావిడిగా రంగంలోకి దిగి, జేసీబీల సాయంతో రోడ్డు పక్కన ఉన్న అనేక చిన్న వ్యాపారాలను తొలగించారు. ఆ సమయంలో అధికారులు తమ వద్దకు పదే పదే వచ్చి, షాపులు ఖాళీ చేయాలని హెచ్చరించారని బాధితులు వాపోతున్నారు.అయితే, ప్రస్తుతం బీరంగూడ మార్కెట్ నుండి కిష్టారెడ్డిపేట్ వెళ్లే రహదారిపై పరిస్థితి చూస్తుంటే, అధికారులు కొన్ని షాపుల పట్ల మాత్రమే కఠినంగా ఉండి, మరికొన్నింటిని చూసీచూడనట్లు వదిలేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. రోడ్డుకు అడ్డంగా వెలుస్తున్న ఈ వ్యాపారాల వల్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నా, అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదనేది ఇప్పుడు స్థానికంగా పెద్ద చర్చగా మారింది.వ్యాపారుల ఆరోపణలు:మా షాపులు తీయించిన
అధికారులు, ప్రస్తుతం రోడ్ల మీద యథేచ్ఛగా నడుస్తున్న ఈ వ్యాపారాల మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? వారి దగ్గర నుంచి పెద్ద మొత్తంలో మామూళ్లు ముట్టాయా? అందుకే వారికి కొమ్ము కాస్తూ, మా పొట్ట కొడుతున్నారా?” అని పలువురు వ్యాపారులు టౌన్ ప్లానింగ్ అధికారులపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.అధికారులకు విజ్ఞప్తి:ఈ వ్యవహారంలో ఉన్నతాధికారులు తక్షణమే జోక్యం చేసుకోవాలని, ఆక్రమణల తొలగింపు విషయంలో అందరికీ సమానమైన నిబంధనలు అమలు చేయాలని స్థానికులు, వ్యాపారవేత్తలు కోరుతున్నారు. పక్షపాత ధోరణితో వ్యవహరిస్తూ, నిబంధనలను పక్కన పెడుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని, రోడ్లను సులభతరం చేసేలా తగిన చర్యలు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
