పటాన్ చెరు,మే,26,(మెదక్ టుడే) న్యూస్ ప్రతినిధి.హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, గణిత, గణాంక శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని కస్ప శ్రీలత డాక్టరేట్ కు అర్హత సాధించారు. ‘నానోద్రవాలు, హైబ్రిడ్ నానోద్రవాలు అయస్కాంత-ద్రవగతి ప్రవాహ విశ్లేషణ’ చేసి, ఆమె సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు.ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ గణిత శాస్త్ర విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ శివారెడ్డి షేరి మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ డాక్టరల్ పరిశోధన, శక్తి వ్యవస్థలు, ఎలక్ట్రానిక్స్ శీతలీకరణ, పర్యావరణ నమూనా వంటి అధునాతన సాంకేతిక అనువర్తనాలలో ఉష్ణ, ద్రవ్యరాశి బదిలీ సామర్థ్యాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టినట్టు తెలియజేశారు.ఈ అధ్యయనం, నానోద్రవాలు, హైబ్రిడ్ నానోద్రవాలతో కూడిన సంక్లిష్ట నాన్-లీనియర్ ప్రవాహ వ్యవస్థలను విశ్లేషించడానికి గాలెర్కిన్ ఫైనైట్ ఎలిమెంట్ పద్ధతిని, మ్యాట్ లాబ్-ఆధారిత సిమ్యులేషన్లను ఉపయోగించిందన్నారు. ఈ పరిశోధన ఫలితాలు ఉష్ణ-ద్రవ వ్యవస్థలు, గతిశాస్త్ర పరిశోధనల పురోగతికి గణనీయంగా దోహదపడతాయని వివరించారు. డాక్టర్ శ్రీలత సిద్ధాంత వ్యాసం పీహెచ్.డీ. పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం హైదరాబాదు అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు, గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, స్కూల్ ఆఫ్ సైన్స్ డైరెక్టర్ డాక్టర్ ఎం.రెజా, గణిత, గణాంక శాస్త్ర విభాగాధిపతి డాక్టర జాదవ్ గణేష్, పలు విభాగాల అధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది తదితరులు అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
