రూ.50 వేల జరిమానా విధించిన పోక్సో ఫాస్ట్‌ట్రాక్ కోర్టు
చిన్నారుల భద్రతకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి
సోషల్ మీడియాలో చట్టవిరుద్ధ కంటెంట్ ప్రచారం చేస్తే కఠిన చర్యలు
మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు, ఐపీఎస్
మెదక్,జూలై,21,(మెదక్ టుడే న్యూస్ ప్రతినిధి)
చిన్నారులకు సంబంధించిన అశ్లీల వీడియోలను షేర్ చేయడం, సర్క్యులేట్ చేయడం వంటి నేరాలకు పాల్పడిన తూప్రాన్‌కు చెందిన అరిగే శివకుమార్ (20) కు పోక్సో ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఒక సంవత్సరం జైలు శిక్షతో పాటు రూ.50 వేల జరిమానా విధించినట్లు మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు తెలిపారు.తూప్రాన్ పట్టణానికి చెందిన శివకుమార్ డిగ్రీ చదువుతున్నాడు. చిన్నారులకు సంబంధించిన అశ్లీల వీడియోలను షేర్ చేస్తున్నాడనే అనుమానంతో పోలీసులు అతడి ఫోన్‌ను పరిశీలించగా, ఒక వ్యక్తి పేరుతో నకిలీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను సృష్టించి ఇతరులకు అశ్లీల కంటెంట్‌ను పంపుతున్నట్లు గుర్తించారు. సైబర్ క్రైమ్ విభాగం సహకారంతో ఐపీ అడ్రస్, ఇతర సాంకేతిక ఆధారాలను సేకరించి నిందితుడిని గుర్తించారు. తూప్రాన్ ఎస్‌ఐ శివానందం 12 మే 2026 న కేసు నమోదు చేయగా, అప్పటి ఐఓ, తూప్రాన్ సీఐ రంగకృష్ణ దర్యాప్తు పూర్తి చేసి ఛార్జిషీట్ దాఖలు చేశారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ బాలయ్య వాదనలు వినిపించారు.సాక్ష్యాధారాలను పరిశీలించిన పోక్సో ఫాస్ట్‌ట్రాక్ కోర్టు న్యాయమూర్తి సుభావాలి నిందితుడికి ఒక సంవత్సరం జైలు శిక్షతో పాటు రూ.50 వేల జరిమానా విధించినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.
ఈ కేసులో లైజనింగ్ అధికారులు ఎస్‌ఐ విఠల్, కానిస్టేబుల్ కృష్ణ, సీడీఓ నాగరాజు సహకరించారు. నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన అధికారులను, సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ,చిన్నారులకు సంబంధించిన అశ్లీల వీడియోలను చూడడం, కలిగి ఉండడం, షేర్ చేయడం, సర్క్యులేట్ చేయడం వంటి చర్యలకు పాల్పడే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోషల్ మీడియా వేదికలను దుర్వినియోగం చేస్తూ అసభ్యకరమైన, చట్టవిరుద్ధమైన కంటెంట్‌ను ప్రచారం చేసే వారిని సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో గుర్తించి, వారిపై కేసులు నమోదు చేసి, న్యాయస్థానాల్లో శిక్షలు పడేలా పోలీసు శాఖ కృషి చేస్తుందని తెలిపారు.చిన్నారుల భద్రతకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, ఇలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలు ఎక్కడైనా గుర్తించినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్పీ సూచించారు. సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగించాలని, చట్టాన్ని ఉల్లంఘించే వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్ష ఉండదని స్పష్టం చేశారు.