చేగుంట, సెప్టెంబర్ 28 మెదక్ టుడే న్యూస్:చేగుంట పట్టణ కేంద్రంలో సోమవారం, (ఆర్ఎక్స్పర్ట్) సూపర్ స్పెషాలిటీ డిజిటల్ క్లినిక్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన హెల్త్ అవేర్నెస్ వాక్ ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెంపొందిస్తూ కొత్త ఉత్సాహాన్ని నింపింది.వ్యాధులు రాకముందే నివారించుకోవడం, గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను చేరువ చేయడం, సకాలంలో వైద్యులను సంప్రదించే అలవాటును ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా చేగుంటలో ఇప్పటికే గణేష్ హాస్పిటల్ లో అందుబాటులో ఉన్న (ఆర్ఎక్స్పర్ట్ )సూపర్ స్పెషాలిటీ డిజిటల్ క్లినిక్ సేవలకు అదనంగా, శ్రీ లక్ష్మి డెంటల్ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్, క్యూర్ హాస్పిటల్ లో మరో రెండు సూపర్ స్పెషాలిటీ డిజిటల్ క్లినిక్స్ ప్రారంభించారు. ఈ మూడు కేంద్రాల ద్వారా హైదరాబాద్ కు చెందిన ప్రముఖ సూపర్ స్పెషాలిటీ వైద్యుల సేవలను చేగుంట పరిసర ప్రాంతాల ప్రజలు తమకు సమీపంలోనే పొందే అవకాశం కలుగుతుందని నిర్వాహకులు తెలిపారు.ఈ సందర్భంగా డి.ఆర్. పట్నాయక్ మాట్లాడుతూ, (ఆర్ఎక్స్పర్ట్) టెలిమెడిసిన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాలో రిజిస్టర్ అయిన, జాతీయ స్థాయిలో అవార్డు పొందిన డిజిటల్ ఆరోగ్య సంరక్షణ మాధ్యమం. ఆధునిక టెలిమెడిసిన్ సాంకేతికత ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు నిపుణుల వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడమే మా ప్రధాన లక్ష్యం” అని తెలిపారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ లక్ష్మణ్, డి.ఆర్. పట్నాయక్, డాక్టర్ స్రవంతి (క్యూర్ హాస్పిటల్), డాక్టర్ రమేష్ (శ్రీ లక్ష్మి డెంటల్ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్) ఆర్ఎక్స్పర్ట్ బృందం పాల్గొని ఆరోగ్య సంరక్షణ ప్రాముఖ్యతను వివరించి, ప్రజలు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
