MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 02 June 2026, 4:42 pm Digital Edition : Shiva Kumar

భద్రాద్రిలోజాతీయపతకంవేడుకల.

జాతీయ పతాకం ఆవిష్కరణ
లబ్ధిదారులకు పథకాల పంపిణీ
సాంస్కృతిక ప్రదర్శనల సందడి

భద్రాద్రి కొత్తగూడెం,జూన్,2,(మెదక్ టుడే న్యూస్ ప్రతినిధి)తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ప్రగతి మైదానంలో మంగళవారం అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి. రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై జిల్లా కలెక్టర్ అంకిత్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజుతో కలిసి తెలంగాణ అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అమరవీరుల త్యాగాల ఫలితంగా ఆవిర్భవించిందని, వారి ఆశయాల సాధన కోసం ప్రజా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని అన్నారు. రాష్ట్రంలో రైతులు, మహిళలు, యువత, పేదల సంక్షేమాన్ని కేంద్రంగా చేసుకుని ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు.కార్యక్రమంలో భాగంగా రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ఎంపికైన లబ్ధిదారులకు మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. పేద కుటుంబాలకు గౌరవప్రదమైన జీవనం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతతో ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమాన్ని అమలు చేస్తోందన్నారు. మహిళా సాధికారతకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను ప్రతిబింబిస్తూ 478 స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాల కింద రూ.51.06 కోట్ల విలువైన చెక్కులను మంత్రి అందజేశారు. మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించి కుటుంబాభివృద్ధికి దోహదపడాలని ఆకాంక్షించారు. స్వయం సహాయక సంఘాలను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం పూర్తి మద్దతు అందిస్తోందన్నారు.
వ్యవసాయ రంగాన్ని ఆధునికీకరించే లక్ష్యంతో వ్యవసాయ యాంత్రికరణ కార్యక్రమంలో భాగంగా రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు రూ.59.53 లక్షల విలువైన ఆర్థిక సహాయ చెక్కులను పంపిణీ చేశారు. వ్యవసాయ వ్యయాలు తగ్గించి దిగుబడులు పెంచేందుకు ఆధునిక సాంకేతికత వినియోగం అవసరమని మంత్రి సూచించారు. రైతుల ఆదాయాన్ని పెంచే దిశగా ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ఉద్యమ స్ఫూర్తిని ప్రతిబింబించే నృత్యాలు, గేయాలు ప్రేక్షకులను అలరించాయి. విద్యార్థుల ప్రతిభను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, మహిళా సంఘాల సభ్యులు, రైతులు, విద్యార్థులు, వివిధ శాఖల సిబ్బంది, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, అమరవీరుల ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రాన్ని మరింత ప్రగతి పథంలో నడిపించాలని మంత్రి పిలుపునిచ్చారు.