MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 27 March 2026, 3:43 am Digital Edition : Medak Today

అమీన్‌పూర్ పరిధిలో ఆగని బుల్డోజర్లు: అక్రమ కట్టడాల కూల్చివేత

ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే ఉపేక్షించేది లేదు: తహసీల్దార్ వెంకటేష్ హెచ్చరిక

అమీన్‌పూర్,మార్చి,26,(మెదక్ టుడే) న్యూస్:ప్రతినిధి.సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం పరిధిలోని అమీన్‌పూర్ మండల పరిధిలో ప్రభుత్వ భూముల ఆక్రమణదారులపై రెవెన్యూ యంత్రాంగం ఉక్కుపాదం మోపింది. అక్రమంగా వెలుస్తున్న కట్టడాలను రెవెన్యూ అధికారులు బుల్డోజర్లతో నేలమట్టం చేశారు. గురువారం అమీన్‌పూర్ తహసీల్దార్ వెంకటేష్ ఆధ్వర్యంలో రెవెన్యూ సిబ్బంది భారీ బందోబస్తు మధ్య ఈ కూల్చివేతలు చేపట్టారు.

కూల్చివేతల వివరాలు:

  • ఐలాపూర్ గ్రామం: ఇక్కడ సర్వే నంబర్ 823 లోని ప్రభుత్వ భూమిలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన 3 బేస్‌మెంట్లు, నిర్మాణంలో ఉన్న ఒక ఇంటిని అధికారులు పూర్తిగా కూల్చివేశారు.
  • అమీన్‌పూర్ సర్వే నంబర్ 993: ఈ సర్వే నంబర్ పరిధిలోని ప్రభుత్వ స్థలంలో వెలసిన అక్రమ కట్టడాలను కూడా రెవెన్యూ యంత్రాంగం తొలగించింది.

చట్టం అందరికీ ఒక్కటే – తహసీల్దార్ వెంకటేష్:

ఈ సందర్భంగా తహసీల్దార్ వెంకటేష్ మాట్లాడుతూ ఆక్రమణదారులకు ఘాటు హెచ్చరికలు జారీ చేశారు:

“ప్రభుత్వ భూములను ఆక్రమించి కట్టడాలు నిర్మిస్తే ఎంతటి వారైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. పెద్దలు, పేదలు అనే తారతమ్యం మాకు లేదు; చట్టం ముందు అందరూ సమానులే. ప్రభుత్వ భూమిని కాపాడటమే మా మొదటి ప్రాధాన్యత. ఆక్రమణలకు పాల్పడే వారిపై కేవలం కూల్చివేతలతోనే ఆగకుండా, వారిపై కఠినమైన క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తాము.”

ఒకరికి ఒక న్యాయం, మరొకరికి మరొక న్యాయం చేసే ప్రసక్తే లేదని, అక్రమ నిర్మాణాల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ స్థలాల్లో భూమి కొనుగోలు చేసే ముందు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లేనిపక్షంలో భారీగా నష్టపోతారని సూచించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, జిపిఓ లు, విలేజ్ రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.