అభివృద్ధి చేసి ప్రజల రుణం తీర్చుకుంటా వెల్లడించిన మెదక్ పార్లమెంటు సభ్యులు రఘునందన్ రావు.
అమీన్‌పూర్,జూన్,1,(మెదక్ టుడే) న్యూస్ ప్రతినిధి.జాతీయ రహదారిపై లింగంపల్లి చౌరస్తా నుండి అమీన్‌పూర్ వరకు నేరుగా రాకపోకలు సాగించేందుకు అమీన్‌పూర్ వాసులు దశాబ్దాలుగా కంటున్న కల త్వరలోనే సాకారం కానుంది. ఈ మేరకు లింగంపల్లి చౌరస్తా వద్ద నాలాపై బ్రిడ్జి నిర్మాణానికి నాలుగు కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయించినట్లు మెదక్ పార్లమెంటు సభ్యులు రఘునందన్ రావు ప్రకటించారు. సోమవారం ఆయన లింగంపల్లి చౌరస్తా వద్ద నాలా పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ.. గత ఏడాది చివరలో లింగంపల్లి చౌరస్తా నుండి అమీన్‌పూర్ మీదుగా సుల్తాన్‌పూర్ రింగ్ రోడ్ వరకు రేడియల్ రోడ్డు నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఆర్.వి. కన్నన్‌తో కలిసి స్థల పరిశీలన చేసిన విషయాన్ని గుర్తు చేశారు. నాలాగా మారిన చిన్న వాగుపై ఉన్న ఆక్రమణలను తొలగించి, వంతెనను నిర్మించాలని, హైవే నుండి అమీన్‌పూర్ మరియు సుల్తాన్‌పూర్ వరకు నేరుగా రహదారి సౌకర్యం కల్పించాలని తాము అధికారులను కోరామని తెలిపారు.ఈ దీర్ఘకాలిక డిమాండ్‌ను వంద రోజుల్లో పూర్తి చేయాలని కమిషనర్‌ను కోరగా, వారు సానుకూలంగా స్పందించి కార్యాచరణను ప్రారంభించారని పేర్కొన్నారు. తద్వారా ఈ వంతెన నిర్మాణానికి నాలుగు కోట్ల రూపాయలు మంజూరయ్యాయని తెలిపారు.ఈ రహదారి నిర్మాణం పూర్తయితే అమీన్‌పూర్, సుల్తాన్‌పూర్, బొల్లారం ప్రాంతాల ప్రజలతో పాటు, శేరిలింగంపల్లి వాసులకు కూడా రింగ్ రోడ్డు ప్రయాణం ఎంతో సులభతరం అవుతుందని ఆయన వివరించారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే తమ లక్ష్యమని, తమను నమ్మి ఓట్లు వేసి గెలిపించిన ప్రజల రుణం అభివృద్ధి పనుల ద్వారా తీర్చుకుంటామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి, శేరిలింగంపల్లి నియోజకవర్గ బాధ్యులు రవికుమార్ యాదవ్, దిశ కమిటీ సభ్యులు కాసాల సుధాకర్, బీజేపీ నాయకులు ఎడ్ల రమేష్, రాచమల్ల సంతోష్ గౌడ్, వివిధ కాలనీల ప్రతినిధులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
