MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 10 August 2026, 7:06 am Digital Edition : Shiva Kumar

అమీన్ పూర్ గ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల ఉత్సవాలు.. పోటెత్తిన భక్తసందోహం.

అమీన్ పూర్,ఆగస్టు,9,మెదక్ టుడే న్యూస్:(ప్రతినిధి)సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం పరిధిలోని అమీన్ పూర్ గ్రామంలో గ్రామ పెద్దల ఆధ్వర్యంలో గ్రామ దేవతల బోనాల ఉత్సవాలు అత్యంత వైభవంగా, కన్నుల పండువగా జరిగాయి. గ్రామ సరిహద్దులోని కొలువైన శక్తి స్వరూపిణులు నాగులమ్మ, పోచమ్మ, నల్ల పోచమ్మ, ముత్యాలమ్మ తల్లుల ఆలయాల్లో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తాతల కాలం నుంచి ఆచారంగా వస్తున్న ఈ పండుగను గ్రామస్తులందరూ పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా ఏకతాటిపై నిలిచి అట్టహాసంగా జరుపుకోవడం విశేషం. ఉదయం నుంచే ఆలయాల వద్దకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవార్లకు బోనాలు సమర్పించారు. చుట్టుపక్కల వివిధ కాలనీల నుంచి సుమారు 4 నుంచి 5 వేల మంది భక్తులు ఈ ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. గ్రామ యువకులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తొట్టెల ఊరేగింపు భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. అమ్మవార్లకు భక్తిశ్రద్ధలతో తొట్టెలను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.ఉదయం నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తులకు, అలాగే సాయంత్రం గ్రామం నుండి భారీ ఎత్తున పోటెత్తిన బోనాల ఊరేగింపునకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా గ్రామ పెద్దలు అన్ని ఏర్పాట్లు పర్యవేక్షించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడంతో ఉత్సవాలు ప్రశాంతంగా ముగిశాయి.
ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, గ్రామస్తులు మాట్లాడుతూ.. “మా గ్రామంలో వెలసిన ఈ నలుగురు అమ్మవార్లను కొలిస్తే గ్రామం సుభిక్షంగా ఉంటుందనేది మా ప్రగాఢ నమ్మకం. తాతల కాలం నుంచి వస్తున్న ఈ సంప్రదాయాన్ని అందరం కలిసికట్టుగా కొనసాగిస్తున్నాం. అమ్మవార్ల దయతో గ్రామం సుఖశాంతులతో, సిరులతో వర్ధిల్లుతుంది” అని మనస్ఫూర్తిగా తెలిపారు. అందరూ సుఖసంతోతులతో ఉండాలని కోరుకుంటూ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.