MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 11 March 2026, 12:26 am Digital Edition : Medak Today

టైలర్స్ కాలనీలో రెచ్చిపోయిన భూబకాసురులు: శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయం వద్ద ప్రభుత్వ భూమి కబ్జా!

సర్వే నంబర్ 993లో రాత్రికి రాత్రే అక్రమ నిర్మాణాలు

  • ప్రభుత్వ కాంపౌండ్ వాల్ కూల్చివేత.. స్థానికుల ఆందోళన

•కబ్జాదారులపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఎమ్మార్వోకు విన్నపం

అమీన్పూర్,మార్చి,10,(మెదక్ టుడే) న్యూస్:ప్రతినిధి.సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ జిహెచ్ఎంసి పరిధిలోని టైలర్స్ కాలనీలో భూ కబ్జాదారులు బరితెగించారు. శ్రీ రేణుక ఎల్లమ్మ స్వామి ఆలయ సమీపంలో ఉన్న విలువైన ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు రాత్రికి రాత్రే పావులు కదిపారు. సర్వే నంబర్ 993లో ఉన్న ప్రభుత్వ స్థలానికి రక్షణగా ఉన్న కాంపౌండ్ వాల్‌ను గుర్తుతెలియని వ్యక్తులు కూల్చివేసి, అక్రమంగా గదుల నిర్మాణం చేపడుతుండటం స్థానికంగా కలకలం రేపుతోంది.

రాత్రికి రాత్రే అక్రమ నిర్మాణాలు:

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. టైలర్స్ కాలనీలోని ఎల్లమ్మ ఆలయం పక్కన ఉన్న ప్రభుత్వ స్థలాన్ని కొంతకాలంగా కబ్జాదారులు కన్నేశారు. ఈ క్రమంలోనే సోమవారం రాత్రి అదను చూసి, ప్రభుత్వానికి చెందిన కాంపౌండ్ వాల్‌ను జేసీబీలతో ధ్వంసం చేశారు. అధికారుల కళ్లు గప్పి తెల్లవారేసరికి అక్కడ తాత్కాలికంగా ఇళ్లు, గదుల నిర్మాణం చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ప్రభుత్వ ఆస్తిని బహిరంగంగా ఆక్రమిస్తుంటే రెవెన్యూ విభాగం ఏం చేస్తోందని కాలనీవాసులు ప్రశ్నిస్తున్నారు.

స్థానికుల ఆగ్రహం – అధికారుల స్పందన కోసం నిరీక్షణ:

ఈ అక్రమ కట్టడాల వెనుక కొందరు స్థానిక బడా వ్యక్తుల హస్తం ఉందని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ భూమిని కాపాడటంతో పాటు, రక్షణ గోడను కూల్చివేసి అక్రమంగా చొరబడిన కబ్జాదారులపై తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

ఎమ్మార్వోకు విన్నపం:

సర్వే నంబర్ 993లో జరుగుతున్న ఈ అక్రమ నిర్మాణాలను తక్షణమే నిలిపివేయాలి. ఎమ్మార్వో గారు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి, ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలి. నిబంధనలను అతిక్రమించి ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలి” అని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.